Begin typing your search above and press return to search.

వివేకా హత్య కేసు : ఏది వాస్తవం...ఏది అవాస్తవం...?

By:  Tupaki Desk   |   29 Jan 2023 6:00 AM GMT
వివేకా హత్య కేసు : ఏది వాస్తవం...ఏది అవాస్తవం...?
X
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురి అయ్యారు. అది 2019 మార్చి 15న జరిగింది. ఎన్నికల హడావుడితో అంతా నిమగ్నం అయిన సమయం అది. నాడు తెలుగుదేశం అధికారంలో ఉంది. ఎన్నికలు పూర్తి అయి మే 23న ఫలితాలు వచ్చేవరకూ తెలుగుదేశం ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. అంటే రెండు నెలలకు పైగా టీడీపీ ఉంది.

నాడు ఏమి జరిగింది అన్నది తెలుగుదేశం ప్రభుత్వానికి కచ్చితంగా తెలిసి ఉండాలని అంటున్నారు. ఆనాడు వైఎస్ వివేకా గుండె పోటుతో మరణించారు. అయితే గొడ్డలి పోట్లు ఆయన శరీరం మీద ఉన్నాయని తరువాత తేలింది. మరి ఏపీలో ప్రముఖ నాయకుడు, మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఇంత లైట్ గా నాటి సర్కార్ తీసుకుందా. పోలీసులు చెప్పిన దానినే నమ్మి ఊరుకుందా అన్నది ఈ రోజుకీ ప్రశ్నగానే ఉంది.

ఇక ఈ కేసు గురించి నాటి సీఎం కి ఏమీ తెలియదు అనుకుంటే పొరపాటే అని చెప్పాలి. ఆయన ఎన్నికల ప్రచారం అంతా బాబాయిని సొంత వారే హత్య చేశారని, అబ్బాయే అని జగన్ మీదనే ఆరోపణలు చేస్తూ ప్రచారం చేశారు. మరో వైపు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ హత్య జరిగింది కాబట్టి వారే బాధ్యులు అని వైసీపీ ఎదురు దాడి చేసింది. ఇలా అటూ ఇటూ ఆరోపణలే తప్ప అసలు విషయం ఏమీ బయటకు రాలేదు.

అయితే గుండె పోటు కాదు దారుణ హత్య అని తరువాత తెలిసినా కూడా ఈ కేసు ఎందుకో నత్తనడకగానే సాగింది. 2019 మే 30న జగన్ సీఎం అయ్యారు. అంటే వైఎస్ వివేకా సొంత అన్న కుమారుడు. మరి బాబాయ్ హత్య కేసులో పురోగతి సాధించి తేలుతుంది అనుకున్నారు కానీ జరగలేదు. మొదట్లో వైసీపీ సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాత్రం లోకల్ పోలీసులతోనే విచారణ జరిపింది.

దీని మీద వైఎస్ వివేకా కుమార్తె కోర్టులో కేసు వేయడంతో అలా సీబీఐ చేతికి ఈ కేసు వచ్చింది. ఇక ఏపీలో రెండేళ్ల పాటు సీబీఐ ఈ కేసు విచారించినా కూడా ఏమీ పురోగతి లేదు, దీనికి కారణం లోకల్ పోలీస్ సహకరించడంలేదు అన్న ఆరోపణలు వచ్చాయి. దాని మీద సుప్రీం కోర్టుకు వెళ్ళి ఏకంగా ఏపీ స్టేట్ నుంచే ఈ కేసుని తెలంగాణాకు సునీత మార్పించారు.

ఇక ఈ కేసులో మొదట్లో నిందితులుగా ఉన్న వారు అప్రూవర్స్ అయ్యారు. వారి వద్ద నుంచి కీలకమైన సమాచారం ఉందని దాని ఆధారంగా వైసీపీలోని కీలక వ్యక్తులనే అరెస్ట్ చేయవచ్చు అంటూ ఊహాగానాలు వినిపించాయి. ఈ కేసు విషయం మీద ఎవరు చేశారో సీబీఐ నిగ్గు తేల్చాలని ముఖ్యమంత్రి జగన్ నుంచి అంతా అంటూ వచ్చారు. మా కన్నూ మా వేలూ మేము పొడుచుకుంటామా అధ్యక్ష అని నిండు అసెంబ్లీలో జగన్ కడప ఎంపీ అవినాష్ ని వెనకేసుకుని వచ్చి మాట్లాడారు.

ఈ కేసు విషయంలో అన్ని ఆధారాలు ఉన్నాయని కొత్త ఏడాది ఏదో ఒకటి జరగడం ఖాయమని అంతా అంటున్న వేళ కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిపించింది. ఆయన స్టేట్మెంట్స్ ని వీడియో రికార్డు చేశారు. ఆయన్ని తరచి ప్రశ్నించారు అని అంటున్నారు. ఇక బయటకు వచ్చిన అవినాష్ నిజానిజాలు తేలాలని అంటున్నారు. వాస్తవాలను వక్రీకరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా విపక్షాల మీద మండిపడ్డారు. సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పాను అని ఆయన అంటున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు కోరుముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి అయితే విపక్షాల తీరుని ఎండగడుతున్నారు. అవినాష్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు అని వారు అంటున్నారు. సరే అవినాష్ మీద ఈ రోజు దాకా అనుమానం తప్ప ఆధారం ఏదీ లేదు కాబట్టి ఆయన తప్పు చేయలేదు అని భావించవచ్చు.

కానీ ఈ కేసులో ఎవరు అసలు నిందితులు అన్నది తేలాలి కదా. అంతా వాస్తవాలు అంటున్నారు. ఆ వాస్తవాలు ఏమిటి.ఎవరు హత్య చేశారు. ఇప్పటిదాకా చూస్తే వైసీపీ వారినే పిలుస్తున్నారు. వారే విచారణకు వెళ్తున్నారు. మరి ఆధారాలు సీబీఐ వద్ద ఉన్నాయని అంటున్నారు. ఇంతకీ ఎవరు దోషులు. మరో ఎన్నికకు ఏపీ సిద్ధమవుతున్న వేళ అయినా వివేకా హత్య కేసు దోషులు ఎవరో తేలుస్తారా. చూడాలి మరి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.