శిల్పా చౌదరి చేతిలో రూ.3 కోట్లు మునిగిన యువ హీరో ఇతడే?

Fri Dec 03 2021 16:00:01 GMT+0530 (IST)

young hero lost Rs 3 crore to Shilpa Chaudhary

కిట్టీ పార్టీల పేరుతో టాలీవుడ్ సినీ ప్రముఖులకు వల వేసి మోసం చేసి కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.శిల్పా చౌదరిని అరెస్ట్ చేసిన పోలీసులకు విచారణలో దిమ్మదిరిగే వాస్తవాలు బయటపడుతున్నాయి. ఈమె చేతిలో కోట్లు మోసపోయిన సెలబ్రెటీలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాజాగా యువ హీరో కూడా ఈ మాయలేడి చేతిలో మోసపోయానని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం సంచలనమైంది.

శిల్పా చౌదరి టాలీవుడ్ సినీ ప్రముఖులను చీటింగ్ కేసులో సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. సెలబ్రెటీలు వారి కుటుంబ సభ్యుల దగ్గర కోట్ల రూపాయలు తీసుకున్న శిల్పా చౌదరి వారికి నకిలీ బంగారం నకిలీ చెక్కులు అంటగట్టింది.

హీరో సుధీర్ బాబు భార్య మహేష్ చెల్లెలు ప్రియదర్శిని దగ్గర రూ.2 కోట్ల 90 లక్షలు తీసుకున్న శిల్పా చౌదరి మూడు నకిలీ చెక్కులు నకిలీ బంగారాన్ని ష్యూరిటీస్ గా ఇచ్చినట్టు బయటపడింది.

తాజాగా చెక్కు మార్చేందుకు ఇండియన్ బ్యాంక్ కు వెళ్లిన ప్రియదర్శిని మోసపోయినట్టు తెలుసుకొని అవాక్కైంది. దీంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు ప్రియదర్శిని. ఆరు నెలల తర్వాత డబ్బు తిరిగి ఇస్తానని చెప్పి శిల్పా చౌదరి డబ్బు తీసుకుందని.. అడిగితే బౌన్సర్లతో బెదిరిస్తోందని ప్రియదర్శిని ఆరోపిస్తోంది.

తాజాగా శిల్పా చౌదరి మాయమాటలు నమ్మి హీరో హర్ష్ కనుమల్లి నట్టేట మునిగాడని తెలిసింది. తాను రూ.3 కోట్లు నష్టపోయానని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శిల్పా పార్టీలకు అటెంట్ అయ్యి ఆమె ట్రాప్ లో పడ్డాడట ఈ యువహీరో.

‘సెహరి’ అనే సినిమాలో హర్ష్ కనుమల్లి హీరోగా నటించాడు. మరికొందరు సెలబ్రెటీలు కూడా శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది.

తాజాగా కోర్టు ఆదేశాల మేరకు శిల్పా చౌదరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆమె భర్త శ్రీనివాస ప్రసాద్ కు మాత్రం షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. శిల్పా బెయిల్ పిటీషన్ ను కొట్టేసిన కోర్టు 2 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. శనివారం శిల్పను పోలీసులు విచారిస్తున్నారు.

శిల్పా చౌదరి బాధితులు ప్రస్తుతం ఒక్కొరొక్కరుగా బయటకు వస్తున్నారు. చాలా మంది ఆమె చేతిలో మోసపోయినట్లు తెలుస్తోంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు విచారిస్తున్నారు. చాలా మంది సంపన్న ప్రముఖులు శిల్పాపై ఫిర్యాదు చేయడానికి.. తమ డబ్బు పోయిందని చెప్పుకోవడానికి తటపటాయిస్తున్నట్టు తెలుస్తోంది. శిల్పా చౌదరి ఇంత డబ్బును ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టిందనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.