Begin typing your search above and press return to search.

బయల్దేరింది దావోస్‌కు.. వెళ్లింది లండన్‌కు.. మధ్యలో జరిగింది ఇదే!

By:  Tupaki Desk   |   21 May 2022 2:47 PM GMT
బయల్దేరింది దావోస్‌కు.. వెళ్లింది లండన్‌కు.. మధ్యలో జరిగింది ఇదే!
X
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌ పర్యటన మీద ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నేతల మధ్య, అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరుగుతోంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ తన సతీమణి భారతి రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుంచి మే 20న బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే.

అయితే.. సీఎం వైఎస్‌ జగన్‌ దావోస్‌కు చేరుకోకుండా మధ్యలో టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఆగడం, మళ్లీ అక్కడ నుంచి లండన్‌కు వెళ్లడం ప్రతిపక్ష టీడీపీ నేతలకు ఆయుధంలా దొరికింది. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు.. సీఎం జగన్‌ లండన్‌కు వెళ్లడంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మే 20 ఉదయం గన్నవరం నుంచి బయలుదేరి వెళ్లిన సీఎం సాయంత్రానికి దావోస్‌ చేరుకుంటారని అధికారులు పేర్కొన్నారని.. కానీ ఆయన దావోస్‌ వెళ్లకుండా ప్రత్యేక విమానంలో లండన్‌ వెళ్లడం వెనుక ఉన్న మతలబు ఏంటని యనమల ప్రశ్నించారు. లండన్‌ కంటే ముందే దావోస్‌ వస్తుందని.. దావోస్‌కు వెళ్లడానికి లండన్‌ వరకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు.

దీనిపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వివరణ ఇచ్చారు. సీఎం జగన్‌ ప్రయాణిస్తున్న విమానం ఇంధనం నింపుకోవడానికి టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఆగిందని.. ఎయిర్‌ ట్రాఫిక్‌ ఎక్కువ ఉండటం వల్ల ఇంధనం నింపుకోవడంలో ఆలస్యం జరిగిందని తెలిపారు. దీంతో లండన్‌ విమానాశ్రయానికి చేరుకోవడానికి బాగా ఆలస్యమైందన్నారు. లండన్‌లో కూడా ఎయిర్‌ ట్రాఫిక్‌ ఎక్కువ ఉందని మంత్రి బుగ్గన తెలిపారు.

ఈ లోపు రాత్రి 10 గంటలు దాటిందని.. ఆ సమయంలో జురెక్‌లో విమానాలు దిగడానికి అనుమతి లేదన్నారు. ఎన్నో ఏళ్ల క్రితమే రాత్రి 10 గంటలు దాటాక విమానాలు దిగకుండా అక్కడ నిషేధం విధించారని చెప్పారు. దీంతో అధికారులు.. సీఎం విమానం ల్యాండింగ్‌ కోసం విజ్ఞప్తి చేశారని వివరించారు. జురెక్‌ విమానాశ్రయ అధికారులతో స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబీసీ అధికారులు కూడా మాట్లాడారని తెలిపారు. అయినా సరే రాత్రి 10 గంటలు దాటాకా విమానాలు దిగడానికి నిబంధనలు అంగీకరించవని చెప్పడంతో సీఎం జగన్‌ లండన్‌కు వెళ్లాల్సి వచ్చిందన్నారు.

ఈ వివరాలన్నింటిని స్విట్జర్లాండ్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు లండన్‌లోని భారత దౌత్య అధికారులకు తెలిపారని బుగ్గన రాజేంద్రనాథ్‌ వెల్లడించారు. దీంతో అధికారులు ముఖ్యమంత్రి జగన్‌ లండన్‌లో ఉండటానికి ఏర్పాట్లు చేశారన్నారు. తెల్లవారుజామున బయలుదేరి వెళ్లడానికి పైలెట్లు ఒక రోజంతా ప్రయాణంలో అలసిపోయి ఉన్నారని.. దీంతో ఏవియేషన్‌ నిబంధనల ప్రకారం వారు తగినంత విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందన్నారు.

వాస్తవాలు ఇవయితే ముఖ్యమంత్రి మీద అసూయతో, ఈర్ష్యతో ప్రతిపక్ష తెలుగుదేశం బురద చల్లుతోందని, నీచమైన ఆరోపణలు చేస్తోందని బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. సీఎం జగన్‌ మీద యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణలు దారుణమని, ఆయనకు వయసు పెరుగుతున్నా బుద్ధి పెరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.