వంటలతో మోడీకి వార్నింగ్

Sat Nov 27 2021 15:05:21 GMT+0530 (IST)

workers sent stern warning to Narendra Modi

వంటావార్పు కార్యక్రమంతో విశాఖ ఉక్కు ఉద్యోగులు కార్మికులు నరేంద్రమోడీకి గట్టి వార్నింగే పంపారు. విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఉద్యోగులు సంస్ధ పరిధిలో వందలమందికి వంటలు చేశారు. అక్కడే భోజనాలు కూడా చేశారు. ఉద్యోగులు కార్మికుల నిరసనలో ప్రజాసంఘాలు వామపక్షాల నేతలతో పాటు స్ధానికులు కూడా పెద్దఎత్తున పాల్గొన్నారు. ఇన్నిరోజులుగా దీక్షలని ధర్నాలని సమ్మెల పేరుతో కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారు తాజాగా వంటావార్పు ద్వారా నిరసన తెలపటం గమనార్హం.

లాభాల్లో ఉన్న విశాఖస్టీల్స్ ను ప్రైవేటుపరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మోడిని ఆందోళనకారులు నిలదీస్తున్నారు. గడచిన ఆరుమాసాలుగా కార్మికులు ఉద్యోగుల నేతలే కాకుండా ప్రజాసంఘాలు స్ధానికులు కూడా ఆందోళనల్లో పాల్గొంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఎవరెంతగా ఆందోళనలు చేస్తున్నా కేంద్రం మాత్రం ప్రైవేటీకరణ నుండి వెనక్కు తగ్గేది లేదని తెగేసి చెప్పేసింది.కేంద్రం వైఖరితో అందరిలోను ఆశలు తగ్గిపోయిన మాట వాస్తవం. అయితే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు మోడి ప్రకటించటం తర్వాత పార్లమెంటులో కూడా బిల్లులను ఉపసంహరించుకోవటంతో ఇక్కడ కార్మికులు ఉద్యోగుల్లో కూడా ఆశలు చిగురించాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకున్నట్లే వైజాగ్ స్టీల్స్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా మోడి వెనక్కు తీసుకోకపోతారా అని ఆలోచిస్తున్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్నారంటే ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అని తెలిసిందే.

అయితే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో వెనకడుగు వేయాల్సిన అనివార్యత మోడికి ఏపిలో ఏమీలేదు. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న ప్రత్యేకహోదా రైల్వేజోన్ లాంటి హామీలనే తుంగలో తొక్కేసిన మోడికి వైజాగ్ స్టీల్ పై వెనకడుగు ఎందుకు వేస్తారు ? దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఏపీలో బీజేపీకి ఉన్నదేమీ లేదు పోవటానికి. ఒకవేళ ప్రజల ఆలోచనలకు తగ్గట్లుగా హామీలు నెరవేర్చినా స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిర్ణయంపై వెనక్కు తగ్గినా పార్టీపరంగా వచ్చే ఉపయోగం ఏమీలేదు.

అందుకనే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో మోడి వెనకడుగు వేయటంలేదు. ఏదేమైనా రేపు ఏమి జరుగుతుందో ఈరోజు ఎవరు ఏమీ చెప్పలేరు కాబట్టే ఉద్యోగులు కార్మికులతో పాటు ప్రజాసంఘాలు పార్టీలు కూడా కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనబాటపట్టాయి. మరి చివరకు ఈ విషయం ఏమవుతుందో చూడాల్సిందే.