Begin typing your search above and press return to search.

మన బలం పెరిగితే మాట ఎంతలా మారిపోయింది బుగ్గన

By:  Tupaki Desk   |   24 Nov 2021 6:37 AM GMT
మన బలం పెరిగితే మాట ఎంతలా మారిపోయింది బుగ్గన
X
బలం ఉంటే ఒకలా.. బలం లేకుంటే మరోలా? అన్నది ఉంటుందా? అంటే.. అలాంటి తీరు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ కదా? అన్న భావన కలుగక మానదు. కానీ.. అలాంటివేమీ పట్టించుకోకుండా కాలానికి తగ్గట్లుగా.. తమ అవసరానికి తగ్గట్లుగా మాటలు చెప్పటం ఏపీ అధికారపక్షానికి అలవాటుగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఏ ఎండకు ఆ గొడుగు అన్న సామెతెను గుర్తుకు తెచ్చేలా వారి తీరు ఉందని చెప్పాలి.

ఇప్పటికే మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించిన జగన్ సర్కారు.. తాజాగా అందరి అంచనాల్ని నిజం చేస్తూ.. మండలి రద్దు తీర్మానాన్ని సైతం వెనక్కి తీసుకున్నారు. దీనికి సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా వైసీపీ సర్కారు కొలువు తీరింది. అసెంబ్లీలో తమకు తిరుగులేని బలం ఉన్నప్పటికీ.. అందుకు భిన్నంగా మండలిలో మాత్రం బలం లేని పరిస్థితి. దీంతో.. అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాల్ని మండలికి వెళ్లేసరికి కొర్రీలు పడటం.. మోకాలు అడ్డు పెట్టటం లాంటివి చోటు చేసుకునేవి.

దీంతో.. సీఎం జగన్ కు చిరాకెత్తిపోయింది. అంతే.. మండలిని రద్దు చేయాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ 2020 జనవరి 27న తీర్మానం తీసుకొంది. ఆ సందర్భంగా పెద్ద ఎత్తున అభ్యంతరాలు.. విమర్శలు వెల్లువెత్తాయి.

అయినప్పటికీ తాము తీసుకున్న నిర్ణయానికి తగ్గట్లు వాదనలు వినిపించటమే తప్పించి.. మండలి రద్దు విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరించారు. అయితే.. ఇటీవల కాలంలో టీడీపీ సభ్యుల పదవీ కాలం పూర్తి కావటం.. మండలిలో సభ్యుల సంఖ్య అధికారవైసీపీకి చెందిన వారు పెరిగిపోతున్నారు. తాజాగా.. ఏపీ అధికార పక్షానికి చెందిన నేతలు పెద్ద ఎత్తున ఉండటంతో.. మండలిలో వారి బలం భారీగా పెరగ్గా.. విపక్ష టీడీపీ అధిక్యత పూర్తిగా తగ్గింది.

ఈ నేపథ్యంలో మండలి రద్దుకు సంబంధించి గతంలో తమ ప్రభుత్వం చేసిన తీర్మానం.. దానికి అసెంబ్లీ ఆమోదించిన బిల్లు.. ప్రస్తుతం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది. ఇదిలా ఉండగా.. మంగళవారం ఉదయం మండలి రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్న వైనాన్ని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. గతంలో మండలి రద్దు తీర్మానాన్ని చేసే సందర్భంలో వినిపించిన వాదనకు తగ్గట్లే.. తాజాగా వినిపించిన వాదన వింటే నోరెళ్లబెట్టాల్సిందే.

బుగ్గన ప్రవేశ పెట్టిన రద్దు తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఆమోదించటం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యల్ని కచ్ఛితంగా వినాల్సిందే. భవిష్యత్తు కోసం వాటిని వీలైనంత వరకు గుర్తు పెట్టుకోవాల్సి అవసరం ఉంది.

సమయానుకూలంగా తమకు తగ్గట్లుగా వాదనల్ని వినిపించే వారి టాలెంట్ ఎంతన్న విషయం తాజాగా బుగ్గన వారి మాటల్లోనే వింటే..

- 2019లో ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు వెంటనే చట్ట రూపంలో అమలు కావాలనే ఉద్దేశం ఉండగా.. వివిధ కారణాలతో ఆలస్యమయ్యాయి. దీనికి సంబంధించిన వివరాల్ని అసెంబ్లీలో చర్చించాం.

- ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నికైన వారే సుప్రీం ప్రజాప్రతినిధులు. శాసన మండలి సలహాలు ఇచ్చేందుకు అదనం మాత్రమే. ఇది ప్రజాస్వామ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

- 2020 జనవరి 27న అప్పటి పరిస్థితులను అనుసరించి మండలి రద్దుకుతీర్మానం చేశాం. అసెంబ్లీలో విద్యావంతులు ఉన్నందున మండలి అవసరం లేదని చర్చించిన తర్వాతే తీర్మానం చేసి.. కేంద్రానికి పంపాం. అదిప్పుడు అక్కడ పెండింగ్ లో ఉంది.

- ప్రస్తుతం మండలి కొనసాగుతున్నందున సభ్యుల పదవీకాలం ఎప్పటివరకు ఉంటుందనే దానిపై అనిశ్చితి ఏర్పడింది. ఇలాంటివేళ సానుకూల నిర్ణయాలు రాకపోవచ్చు. కేంద్ర హోం శాఖ వద్ద పెండింగ్ లో ఉన్న రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

- కొత్తగా వచ్చే వారు విద్యావంతులు.. ప్రజలకు సేవ చేసే వారు వస్తున్నారు. మండలి ఛైర్మన్ గా దళిత వ్యక్తి ఎన్నికయ్యారు. కొత్త సభ్యుల సలహాలు.. సూచనలు తీసుకుంటూ ప్రతి ఒక్కటీ రాజకీయం చేయకూడదన్న ఆలోచనతోనే మండలిని కొనసాగించాలని భావించాం.

బుగ్గన మాటలు వింటే.. అప్పట్లో విద్యావంతులు అసెంబ్లీలో ఉన్నారని.. మండలి అక్కర్లేదంటే.. తాజాగా మాత్రం అసెంబ్లీలోనే కాదు.. మండలిలోనూ విద్యావంతులు ఉన్నారని.. వారి సలహాలు తీసుకొని ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తామంటూ చెప్పిన వైనాన్ని చూస్తే.. బుగ్గనకు మించిన కవరింగ్ మరెవరూ చేయలేరన్న అభిప్రాయం పలువురి నోటి వెంట వినిపిస్తోంది. ఏమైనా.. తాము అనుకున్నదే జరగాలన్న మొండితనం ఎంతన్నది తాజా తీర్మానాన్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుందని చెప్పొచ్చు.