భారత్ నిర్ణయంపై జీ-7 దేశాల ఆగ్రహానికి కారణం ఇదే!

Tue May 17 2022 11:59:10 GMT+0530 (IST)

why the G 7 countries are angry over India decision

విదేశాలకు భారత్ నుంచి గోధుమ ఎగుమతులను నిషేధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాల్లో ఆందోళన పెంచుతోంది. ప్రపంచంలో గోధుమలను ఎక్కువగా పండిస్తున్న దేశాల్లో రష్యా ఉక్రెయిన్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. దీంతో ఈ రెండు దేశాల గోధుమల ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో గోధుమల ధరలు ఆయా దేశాల్లో 60 శాతం పెరిగాయి.ఉక్రెయిన్ రష్యాల నుంచి గోధుమలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ప్రధానంగా ఆఫ్రికా పశ్చిమాసియా దేశాలే ఉన్నాయి. అయితే యుద్ధంతో ఉక్రెయిన్ రష్యాల నుంచి గోధుమల ఎగమతులు నిలిచిపోవడంతో ఆయా దేశాల్లో గోధుమల ధరలు తీవ్రంగా పెరిగిపోయాయి. గోధుమలకు కొరత ఏర్పడింది. దీంతో పేద దేశాల్లో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి.

ప్రపంచంలో ఆయా దేశాల గోధుమ అవసరాల్లో మూడొంతులు రష్యా ఉక్రెయిన్ తీరుస్తున్నాయి. అమెరికా కెనడా ఆస్ట్రేలియాల్లోనూ భారీగా గోధుమ పండుతోంది. అలాగే చైనా భారత్‌లోని ఉత్తర పశ్చిమ ప్రాంతంలోనూ గోధుమ సాగు ఎక్కువ. ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచంలో ఆహార సంక్షోభం నెలకొనే అవకాశం ఉండటంతో భారత్ విదేశాలకు గోధుమ ఎగుమతులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ అవసరాల రీత్యా గోధుమలను విదేశాలకు ఎగుమతి చేయొద్దని ట్రేడర్స్‌ను తాజాగా ఆదేశించింది. ప్రపంచ దేశాల గోధుమ అవసరాల్లో భారత్ ఐదు శాతం తీరుస్తోంది.

ఓవైపు ఉక్రెయిన్–రష్యా యుద్ధం మరోవైపు భారత్ తీసుకున్న నిర్ణయం తదితర కారణాలతో ఆయా దేశాల్లో గోధుమల ధరలు క్వింటాల్‌కు 6 శాతం పెరిగాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో మనదేశంలో మాత్రం గోధుమల ధరలు తగ్గాయి. వివిధ రాష్ట్రాల్లో ధరలు 6 నుంచి 8 శాతం వరకు పడిపోయాయి. భారత్ తీసుకున్న నిర్ణయంపై అభివృద్ధి చెందిన దేశాల కూటమి అయిన జీ–7 నిప్పులు చెరిగింది. భారత్ తీసుకున్న నిర్ణయం సరికాదని తెలిపింది. మరోవైపు ఈ విషయంలో అనూహ్యంగా చైనా మద్దతు భారత్‌కు లభించింది. తన దేశ ప్రయోజనాల రీత్యా భారత్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని చైనా మద్దతు తెలిపింది. ఆస్ట్రేలియా కెనడా అమెరికా వంటి దేశాలు గోధుమలను దాచుకోకుండా ఆయా దేశాలకు ఎగుమతి చేయాలని క్లాస్ పీకింది. ఆ పని చేయకుండా భారత్‌ను టార్గెట్ చేయడమేంటని జీ–7 దేశాలపై మండిపడింది.

కాగా జూలై 2021 నుంచి జూన్ 2022 మధ్య కాలంలో 10 మిలియన్ల మెట్రిక్ టన్నులను ఎగుమతి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే కాలానికి ఆయా ప్రపంచ దేశాల గోధుమ ఎగుమతులు 201.5 మిలియన్ల మెట్రిక్ టన్నులుగా అంచనా వేశారు. ఇక ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 వరకు మనదేశం దాదాపు 45 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను ఎగుమతి చేయడానికి ఆయా దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మొత్తంలో ఈ ఏడాది ఏప్రిల్‌లోనే 14.63 లక్షల మెట్రిక్ టన్నులను ఎగుమతి చేసింది.  అయితే ఉక్రెయిన్–రష్యా యుద్ధం తెచ్చిన పరిణామాల నేపథ్యంలో భారత్ ఎగుమతులను నిషేధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

అయితే.. పేద దేశాలు ఆహార సంక్షోభంలో ఉంటే భారత్ చూస్తూ ఊరుకోబోదని కేంద్రం స్పష్టతనిచ్చింది. మానవతా సాయం కింద పేద దేశాలకు గోధుమలను సరఫరా చేస్తామని వెల్లడించింది. తమ దేశ భద్రత ఆహార అవసరాల రీత్యానే తాము గోధుమల ఎగుమతులపై నిషేధం విధించామని తెలిపింది. అయితే జీ–7 దేశాలు మాత్రం భారత్ నిర్ణయంతో ఆయా దేశాల్లో ఆహార సంక్షోభం నెలకొంటుందని.. ధరలు కూడా అమాంతం పెరుగుతాయని ఆరోపిస్తున్నాయి.