Begin typing your search above and press return to search.

జూనియర్ దూరం...దూరం...!

By:  Tupaki Desk   |   20 May 2023 1:25 PM GMT
జూనియర్ దూరం...దూరం...!
X
జూనియర్ ఎన్టీఆర్ తన తాతగారి శతజయంతి ఉత్సవాలకు రావడం లేదు ఈ విషయం ఎన్టీఆర్ టీం స్పష్టం చేసింది. మే 20 జూనియర్ బర్త్ డే. ఆ రోజున ఆయన ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రోగ్రాంస్ ఉన్నాయి. అసలు జూనియర్ హైదరాబాద్ లోనే లేరని తెలుస్తోంది. ఆయన మాల్దీవుల కు వెళ్లారని అంటున్నారు.

అలా జూనియర్ తన తాత శత జయంతి ఉత్సవాలకు రావడం లేదు. దీంతో జూనియర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ ఆద్వర్యంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నా తెర వెనక టీడీపీ ఉంది. ఉత్సవ కమిటీ చైర్మన్ టీడీ జనార్ధన్ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ గా కూడా ఉన్నారు.

దాంతో ఇది ఫక్తు తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగానే జరుగుతోఅంది. మరో వైపు చూస్తే ఈ కార్యక్రమంలో జూనియర్ పాలు పంచుకుంటే చంద్రబాబుతో కలసి వేదిక మీద కనిపిస్తారు అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. దాంతో సమీకరణలు అన్నీ మారుతాయని. ఏపీ ఎన్నికల్లో జూనియర్ కచ్చితంగా ప్రచారానికి రావచ్చు అని కూడా లెక్కలేసుకున్నారు.

అయితే చాలా కాలంగా టీడీపీ కి జూనియర్ కి మధ్య గ్యాప్ అలాగే కొనసాగుతోంది. దానికి ఎవరు కారకులు ఎంత వరకూ ఎవరిది బాధ్యత ఎంతదాకా అన్నది ఎవరికీ తెలియదు. అయితే జూనియర్ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆ నేపధ్యంలోనే ఆయన తెలుగుదేశానికి అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే తెలుగుదేశంలో మూడవ తరం వారసుడు కూడా రెడీగా ఉన్నారు. నారా లోకేష్ ని బాబు తరువాత పీఠమెక్కించడానికి అటు తండ్రిగా చంద్రబాబు, ఇటు మామగా బాలయ్య ఎంతో కృషి చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం మళ్లీ గెలిస్తే చంద్రబాబు సీఎం అవుతారు. అయితే ఆయన పూర్తి టెర్మ్ పాలించకుండానే మధ్యలో లోకేష్ కి పీఠం అప్పగిస్తారు అన్న ప్రచారమూ ఉంది.

ఆ విధంగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఒక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు పోతూంటే జూనియర్ జస్ట్ ఒక స్టార్ కాంపెయినర్ గా టీడీపీలో ఉండాల్సి వస్తుంది. అందుకే జూనియర్ మాత్రం తనకు ఎందుకొచ్చిన రాజకీయం అని పెద్ద దండం పెట్టేసి అపుడే పుష్కరం కాలం అవుతుంది. ఈ మధ్యలో ఎన్నో మార్పులు జరిగాయి. అసలు జీవితంలో కలవరు అనుకున్న పెద్దల్లుడు దగ్గుబాటి కుటుంబం చంద్రబాబు తో కలుస్తోంది అని అంటున్నారు.

అలాగే ఎన్టీఆర్ మొత్తం ఫ్యామిలీ కూడా చంద్రబాబు వైపే ఈ రోజుకీ ఉంది. వారికి చంద్రబాబు ఆ తరువాత లోకేష్ సీఎం అయితే చాలు అన్నదే భావన. ఇటీవల లోకేష్ యువగళం పాదయాత్ర కర్నూల్ జిల్లాలో సాగుతూంటే ఎన్టీఆర్ కుటుంబం లోని మహిళలు అంతా వెళ్ళి లోకేష్ కి పూర్తి మద్దతు ప్రకటించారు.

ఇక ఎన్టీఆర్ కుటుంబలో హరిక్రిష్ణ కీలకంగా ఉండేవారు. ఆయన గతించాక ఆయన ఇద్దరు కొడుకులు అంటే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒక మాట మీద ఉంటున్నారు. కుమార్తె సుహాసిని మాత్రం బాబు వెంటే ఉంటుంది. టోటల్ గా చూస్తే తెలుగుదేశం పార్టీలో అత్యంత గ్లామర్ ప్రజాదరణ ఉన్న వారుగా జూనియర్ ఎన్టీఆర్ న్నారు. ఆయన తలచుకుంటే తెలుగుదేశం పార్టీని ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకురాగలడు అని ఫ్యాన్స్ తో పాటు సాధారణ జనం కూడా నమ్ముతారు.

కానీ మనసులో ఏముందో కానీ జూనియర్ అయితే ఇప్పట్లో రాజకీయాలు వద్దు అనేస్తున్నట్లుగానే కనిపిస్తోంది. తాను ఏ మాత్రం ఏ వేదిక మీద అయినా అలా కనిపించినా సంకేతాలు వేరుగా వెళ్తాయన్న భావన కూడా ఆయనకు ఉన్నట్లుగా ఉంది. అదే టైం లో జూనియర్ సినీ రంగంలోనో ఇంకా ఎత్తులు చూడాలని అనుకుంటున్నారు. దాంతో ఆయన ముందు సినిమాలే అన్నట్లుగానే కనిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ శత జయంతి వేడికలకు జూనియర్ హాజరు కాకపోవడం వెనక చెడు సంకేతాలు ఏవీ లేవు. ఆయనకు కుదరకనే రావడంలేదు అంటున్నారు.

అయితే ఇది కూడా రాజకీయం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్టీఆర్ కి తాత కంటే తన పుట్టిన రోజు వేడుకలు ఎక్కువా అని సాగదీసి సాధించేవారు ఉంటారు. అయితే ఎవరేమి అనుకున్నా ఎన్టీఆర్ కి ఒక నిర్దిష్ట విధానం ఉంది. ఆయన తాను అనుకున్న తీరునే సాగుతారు. ఆ విషయంలో ఆయన నిక్కచ్చిగానే ఉంటారు.

ఇప్పటిదాకా తన కెరీర్ లో ఏ మచ్చ లేని నటుడిగా ఉన్న జూనియర్ కి రాజకీయాల్లో కూడా బోలెడు భవిష్యత్తు ఉందని నమ్మే వారూ ఉన్నారు. దానికి ఇపుడు టైం కాదు అని అంటున్నారు. అందుకే జూనియర్ ప్రస్తుతానికి దూరం దూరం అంటున్నారు. అయితే ఇది కాలం పెట్టిన దూరమే తప్ప టీడీపీకి తాతకు జూనియర్ ఎపుడూ దగ్గరే అని అంటున్నారు అంతా.