Begin typing your search above and press return to search.

ఇంత సైలెంట్ ప్ర‌చారం ఎందుకు .. బీజేపీలో గుస‌గుస‌...!

By:  Tupaki Desk   |   7 May 2023 9:07 AM GMT
ఇంత సైలెంట్ ప్ర‌చారం ఎందుకు .. బీజేపీలో గుస‌గుస‌...!
X
రాష్ట్రంలో కొన్ని నెల‌లుగా గ‌మ‌నిస్తే.. బీజేపీ కీల‌క నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు వేదిక‌ల‌ పై న‌ర్మ‌గ‌ర్భ రాజ‌కీయ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. 'బూతుల' నేత‌ల‌కు 'బూత్‌'ల‌లో స‌మాధానం చెప్పాలంటూ.. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు పిలుపునిస్తున్నారు. అంటే.. రాజ‌కీయంగా వెంక‌య్య‌నాయుడు బ‌య‌ట ప‌డ‌క‌పోయినా.. ఆయ‌న వైసీపీని ఓడించాల‌నే చెబుతున్న‌ట్టుగా బీజేపీ నేత‌లు చెబుతున్నారు.

ఇదే విష‌యం పై బీజేపీ నేత‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చర్చ సాగుతోంది. ''ఆయ‌న చేస్తున్న‌ది ప్ర‌చార‌మ‌ని మేం భావిస్తున్నాం. ఈ విష‌యంలోదాప‌రికం ఎందుకు? అదేదో బాహాటంగానే చేయొచ్చుక‌దా! ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఆయ‌న రిటైర్ అయ్యారు. అంత‌మాత్రాన రాజ‌కీయాలు మాట్లాడ‌కూడ‌ద‌ని ఏం లేదు. కానీ, ఇలా న‌ర్మ‌గ‌ర్భం గా వ్యాఖ్య‌లు చేస్తే.. వేరే పార్టీ ఈ వ్యాఖ్య‌ల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని.. ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందే ప్ర‌య‌త్నం చేస్తుంది'' అని బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు విజ‌య‌వాడ‌కు చెందిన నేత ఒక‌రు వ్యాఖ్యానించారు.

అంటే.. మొత్తంగా వెంక‌య్య నాయ‌కుడు దాదాపు ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించేశార‌నేది బీజేపీ నేత‌ల భావ‌న‌. మరో వైపు వెంక‌య్య వ్యాఖ్య‌లు కూడా అలానే ఉన్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఎవ‌రిని ఎన్నుకోవాలో.. ప్ర‌త్య‌క్షంగాను.. ప‌రోక్షంగాను ఆయ‌న చెబుతున్నారని అంటున్నారు.

అయితే.. పార్టీ ఏది అనేది చెప్ప‌క‌పోవ‌డంతో బీజేపీనేత‌లు.. ఒకింత ఆవేద‌న‌, ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ పార్టీలో అనేక ప‌ద‌వులు అనుభ‌వించిన వెంక‌య్య‌.. ఇప్పుడు పార్టీ కి మేలు చేసేలా బ‌హిరంగ ప్ర‌చారం చేస్తే.. త‌ప్పేంట‌నేది రాష్ట్ర క‌మ‌లనాథుల మాట‌.

కానీ, ఆయ‌న మాత్రం తాను ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాలు చేయ‌బోన‌ని.. తాను రాజ‌కీయాల‌ కు ఎప్పుడో దూర‌మ‌య్యాన‌ని అంటున్నారు. కానీ, ఏ వేదికెక్కినా.. ఏ మైకు ప‌ట్టుకున్నా.. ప‌రోక్షంగా తెలుగు భాష విష‌యంలోనూ.. మంత్రుల వ్యాఖ్య‌ల విష‌యంలోనూ ఆయ‌న వైసీపీని విమ‌ర్శిస్తున్నార‌ని.. కానీ ఇది త‌మ‌ కు మేలు చేయ‌డం లేద‌ని.. బీజేపీ నేత‌లు చెబుతున్న మాట‌.మ‌రి బీజేపీ నేత‌ల ఆవేద‌న‌ను వెంక‌య్య అర్ధం చేసుకుంటారో లేదో చూడాలి.