Begin typing your search above and press return to search.

యూకే జారీ చేసిన రెడ్ లిస్టులో భారత్ పేరు ఎందుకు లేదు?

By:  Tupaki Desk   |   16 Feb 2021 7:30 AM GMT
యూకే జారీ చేసిన రెడ్ లిస్టులో భారత్ పేరు ఎందుకు లేదు?
X
మొన్నటివరకు వణికించిన కరోనా.. ఇప్పుడు గతంగా మారుతోంది. అక్కడక్కడా కేసులు నమోదవుతున్నా.. మొత్తంగా కరోనా కేసుల తీవ్రత నుంచి దేశం బయటపడినట్లేనని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. పలు దేశాల్లో కరోనా ఇంకా విలయాన్ని క్రియేట్ చేస్తోంది. ఎక్కడో మారు మూల దేశాలు మాత్రమే కాదు.. బ్రిటన్.. జపాన్.. అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాల్లోనూ ఇంకా కరోనా పీడ వెంటాడుతూనే ఉంది. మాయదారి మహమ్మారికి చెక్ పెట్టేందుకు వీలుగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయినప్పటికి ఫలితాలు పెద్దగా రాని పరిస్థితి.

తాజాగా అగ్రదేశాల్లో ఒకటైన యూకే తాజాగా కఠినమైన ప్రయాణ ఆంక్షల్ని ప్రకటించింది. కోవిడ్ వేరియంట్లను నిరోధించేందుకు వీలుగా.. హైరిస్క్ రెడ్ లిస్టులో 33 దేశాలను చేర్చింది. కోవిడ్ కేసులు అత్యధికంగా ఉన్న దేశాల్ని రెడ్ లిస్ట్ లో చేర్చారు. ఉపశమనం కలిగించే అంశం ఏమంటే.. భారతదేశాన్ని రెడ్ లిస్ట్ లో లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రెడ్ లిస్టులో ఉన్న విదేశీ ప్రయాణికులు అంతా యూకేలో అడుగు పెట్టినంతనే.. హోటల్ లో క్వారంటైన్ తీసుకోవాల్సి ఉంటుంది. పది రోజుల పాటు అక్కడి ప్రభుత్వం చెప్పినట్లే.. క్వారంటైన్ లో ఉండాలి. లేదంటే.. కఠిన శిక్షలు ఖాయమంటున్నారు.

అలాంటి కఠినమైన శిక్షల్లో ఒకటి.. పదేళ్ల జైలుశిక్ష గా చెబుతున్నారు. ప్రభుత్వం చెప్పిన హోటళ్లలోనే గడపాల్సి ఉంటుంది. ఇందుకుగాను రవాణా ఖర్చులు.. వైద్య పరీక్షలకు దాదాపు రూ.1.76లక్షల మొత్తాన్ని ఎవరికి వారే భరించాల్సి ఉంటుంది. ఇంత శ్రమను పెట్టుకొని ఎవరు మాత్రం రూల్స్ ను బ్రేక్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఊరట కలిగించే అంశం ఏమైనా ఉందంటే.. రెడ్ లిస్టు జాబితాలో మన దేశం లేకపోవటంగా చెప్పాలి.

కరోనా కొత్త వేరియంట్లు దేశంలోకి అడుగు పెడుతున్న వేళ.. అలాంటివాటికి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాన్ని తీసుకొచ్చింది. అంతేకాదు.. యూకేలోని ప్రజలు సైతం.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే తప్పనిసరిగా.. ప్రయాణానికి మూడు రోజుల ముందు అధికారులకు ప్రయాణ వివరాలు అందించటమే కాదు.. తప్పనిసరిగా పరీక్షలు చేయించుకొని.. నెగిటివ్ రిపోర్టు ఉంటే తప్పించి ప్రయాణించే వీలు లేదంటూ నిబంధనను జారీ చేశారు. ఈ లెక్కన చూస్తే.. కరోనా నుంచి మనం చాలా త్వరగా బయటపడినట్లే. యూకేలో మాదిరి ఎలాంటి నిబంధనల పంచాయితీ లేకుండానే బయటకు రావటం.. వెళ్లటం చేయగలుగుతున్నామంటే మనకుమించిన లక్కీ ఫెలోస్ ఎవరుంటారు చెప్పండి.