Begin typing your search above and press return to search.

ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో 'ఓటు' విలువ తగ్గిందెందుకు?

By:  Tupaki Desk   |   17 July 2022 10:40 AM GMT
ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు విలువ తగ్గిందెందుకు?
X
ఆట కానీ రాజకీయం కానీ.. పోటీ ఎక్కడ ఉన్నా ఫలితం ముందే తెలిస్తే మజా ఉండదు. ఇప్పుడు అలాంటి పరిస్థితే రాష్ట్రపతి ఎన్నికల్లో నెలకొంది. ఆ మాటకు వస్తే.. రాష్ట్రపతి ఎన్నికలు ఎప్పుడు జరిగినా పెద్ద ఆసక్తి ఉండదు. ఎందుకంటే.. తుది ఫలితం మీద ముందే అంచనా ఉంటుంది. ఈ కారణంతోనే రాష్ట్రపతి ఎన్నిక కంటే కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా అధికారపక్షం ఎవరిని ఎంపిక చేస్తుందన్న దాని మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.

ఈసారి అంతే. అధికారపక్షం మెజార్టీ బొటాబొటిగా ఉందనుకుంటే.. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మద్దతు ఇచ్చేందుకు మిత్రపక్షాలతో సంబంధం లేని పార్టీలు సైతం ముందుకు వచ్చాయి. దీంతో.. రాష్ట్రపతి ఎన్నిక ఏకపక్షంగా మారింది. కాంగ్రెస్.. దాని మిత్రపక్షాలతో పాటు మరికొన్ని పార్టీలు కలిసి మద్దతు ఇస్తున్న మరో రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా.. 'ఆత్మ ప్రబోధం' ప్రకారం ఓటు వేయమని వేడుకుంటున్నా.. అలాంటివేమీ జరిగే సూచనలు కనిపించటం లేదు. దీంతో.. ఎన్నికల ఫలితాలు ద్రౌపది ముర్ముకు అనుకూలంగా ఉండనున్నాయి.

అయితే.. ఇప్పుడు అందరి ఫోకస్ మోడీషాలు డిసైడ్ చేసిన ద్రౌపదికి ఎన్ని ఓట్లు వస్తాయి? యశ్వంత్ సిన్హాకు పడాల్సిన ఓట్లలో క్రాస్ ఓటింగ్ ఏమైనా జరుగుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈసారి కశ్మీర్ రాష్ట్రంగా లేని నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల వేళ ఎంపీ ఓటుకు ఉండే ఓటు విలువ తగ్గిపోయింది. కశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎంపీ ఓటు 708గా ఉంటే.. అదిప్పుడు 700లకు తగ్గింది. 776 మంది లోక్ సభ.. రాజ్యసభ సభ్యులు.. 4120ఎమ్మెల్యేలు కలిపి మొత్తంగా 4896 మంది ప్రజా ప్రతినిధులు తమ ఓటుహక్కును వినియోగించనున్నారు.

మొత్తం ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల విలువ 10,86,431 కాగా అందులో యాభై శాతం కంటే ఎక్కువ ఓట్లు పోలైన అభ్యర్థిని విజేతగా నిర్ణయించారు. ఇప్పటికే 44 పార్టీలు ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వటంతో ఆమెకు 6 లక్షలకు పైగా విలువైన ఓట్లు పోల్ అవుతాయని అంచనా. అంటే.. 50 శాతం దాటాల్సిన ఓట్లకు.. తాజాగా మద్దతు ఇచ్చే పార్టీల ఓట్లను లెక్కేస్తే మూడింట రెండు వంతుల మెజార్టీ విజయం సాధిస్తుందని చెబుతున్నారు.

ఈసారి ఎన్నికల్లో 84 ఏళ్ల యశ్వంత సిన్హాను 64 ఏళ్ల ద్రౌపది ముర్ము ఓడించనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఒకప్పుడు బీజేపీలో ఒక వెలుగు వెలిగిన యశ్వంత్ సిన్హాను.. ఇంతకాలం బీజేపీలో ఉన్నా పెద్దగా ఫోకస్ కాని ద్రౌపది ముర్ము అనే మహిళా నేత చేతుల్లో ఓడిపోనున్నారు. వాజ్ పేయ్ హయాంలో బీజేపీని మరింత బలోపేతం చేయటానికి వ్యూహాలు రచించిన కీలక టీంలో సభ్యుడైన యశ్వంత్.. తాను పెంచి పెద్ద చేసిన పార్టీ చేతుల్లో ఓడిపోనున్నారు. కాల మహిమ ఏమంటే.. యశ్వంత్ ఒక వెలుగు వెలిగిన వేళలో బీజేపీలో ఎవరికి పట్టని నరేంద్రమోడీ.. ఇప్పుడు పార్టీ అంతా తానైపోగా.. యశ్వంత్ అసలు ఆ పార్టీకి చెందని వాడిగా మారిపోవటం.