Begin typing your search above and press return to search.

లోక్‌ సభ లో గ్రీన్‌ కార్పెట్, రాజ్యసభ లో రెడ్‌ కార్పెట్‌ ఎందుకు?

By:  Tupaki Desk   |   25 May 2023 10:59 AM GMT
లోక్‌ సభ లో గ్రీన్‌ కార్పెట్, రాజ్యసభ లో రెడ్‌ కార్పెట్‌ ఎందుకు?
X
మన దేశంలో కొత్తగా నిర్మించిన పార్లమెంట్‌ భవనంపై సర్వత్రా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం 16 ఎకరాల్లో రూ.1200 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించారు. భూకంపాలను సైతం తట్టుకునేలా కనీసం 150 ఏళ్లు ఉండేలా 60 వేల మంది కార్మికులు దీని నిర్మాణంలో పాలుపంచుకున్నారు.

మే 28న ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతితో పార్లమెంటు భవనాన్ని ప్రారంభింపజేయాలని 19 ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి. ప్రధాని మోదీ ప్రారంభిస్తే తాము ప్రారంభోత్సవ కార్యక్రమానికి గైర్హాజరు అవుతామని వెల్లడించాయి. మరోవైపు బీజేపీ, దాని మిత్ర పక్షాలైన 14 పార్టీలు ప్రతిపక్షాల వ్యవహార శైలిని ఖండిస్తూ తీవ్ర విమర్శలు చేశాయి.

మరోవైపు కొత్త పార్లమెంట్‌ నిర్మాణ శైలి, దానిలో ఉన్న హంగుల గురించి చర్చ జరుగుతోంది. కొత్త పార్లమెంటు భవనానికి సంబంధించిన వార్తలు, ఫొటోలు, వీడియోలు పెద్ద ఎత్తున మీడియాలో దర్శనమిస్తున్నాయి. కాగా ఈ ఫొటోలలో రాజ్యసభ హాలులో రెడ్‌ కార్పెట్, లోక్‌సభ హాలులో గ్రీన్‌ కలర్‌ కార్పెట్‌ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రెడ్‌ కార్పెట్, గ్రీన్‌ కార్పెట్‌ లపై చర్చ జరుగుతోంది.

కొత్త పార్లమెంటులోనే కాకుండా పాత పార్లమెంటులోనూ రాజ్యసభలో రెడ్‌ కార్పెట్, లోక్‌ సభలో గ్రీన్‌ కార్పెట్‌ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవే రంగులు ఎందుకున్నాయనేదానిపై ఆసక్తికర సమాధానాలు వినిపిస్తున్నాయి.

లోక్‌ సభలో సభ్యులను దేశ ప్రజలు ఎన్నుకుంటారనే సంగతి తెలిసిందే. లోక్‌ సభ సభ్యులు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికవుతారు. ఇక రాజ్యసభలో ఉన్న మొత్తం 250 మందిలో 238 మందిని వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. మరో 12 మందిని రాష్ట్రపతి నామినేట్‌ చేస్తారు.

ఈ నేపథ్యంలో లోక్‌ సభ సభ్యులకు కుగ్రామాల నుంచి నగరాల వరకు ఓటర్లు ఓట్లేస్తారు. అంటే వీరు నేల నుంచి ఎన్నికవుతారు. ప్రజలకు వీరు ప్రాతినిధ్యం వహిస్తారు. నేల అంటే వ్యవసాయం.. పచ్చదనమని.. దీనికే గుర్తుగానే లోక్‌ సభలో గ్రీన్‌ కార్పెట్‌ వేశారని చెబుతున్నారు.

ఇక రాజ్యసభకు పెద్దల సభగా పేరుంది. ఇందులో సభ్యులను శాసనసభ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. రాజ్యసభ సభ్యులు పరోక్ష పద్ధతిలో ఎన్నికవుతారు. ఎరుపు రంగును గౌరవానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే రాజ్యసభలో ఎరుపురంగు కార్పెట్‌ను వేశారు.