Begin typing your search above and press return to search.

అన్నీ మాటలు బాగున్నా.. ఇప్పుడు అమరావతి రైతులు గుర్తు కు రావడమేంది శ్రీదేవి?

By:  Tupaki Desk   |   27 March 2023 9:44 AM GMT
అన్నీ మాటలు బాగున్నా.. ఇప్పుడు అమరావతి రైతులు గుర్తు కు రావడమేంది శ్రీదేవి?
X
తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ కి చెందిన అభ్యర్థి ఓటమిలో కీ రోల్ ప్లే చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటూ.. పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు పడిన వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఎవరికి అందుబాటులోకి రాకుండా వెళ్లిపోయిన ఆమె.. ఆదివారం భర్త.. కుమార్తెతో కలిసి హైదరాబాద్ లో ప్రత్యక్షం కావటమే కాదు.. మీడియా సమావేశంలోనూ మాట్లాడారు.ఈ సందర్భంగా బోలెడన్ని మాటల్ని చెప్పుకొచ్చారు.

మిగిలిన మాటల సంగతి ఎలా ఉన్నా.. అమరావతి రైతుల విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై మాత్రం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే గా వ్యవహరిస్తూ.. అమరావతి రైతుల కష్టాల్ని దగ్గరి నుంచి చూసి కూడా ఒక్కరోజు అంటే ఒక్క రోజుగా పట్టించుకోని ఆమె.. రానున్న రోజుల్లో తాను అమరావతి రైతుల కు దన్నుగా నిలిచి.. వారి టెంట్లలో కూర్చొని పోరాడతానని.. అమరావతిని రాజధానిగా సాధిస్తామన్న వ్యాఖ్య చేయటం గమనార్హం.

తన కుమార్తె ఢిల్లీలో చదువుకుంటుందని.. ఎవరైనా మీ రాజధాని నగరం ఏమిటంటే.. చెప్పటానికి ఏమీ లేదన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా కాకుండా.. మన అమరావతి - మన రాజధాని అంటూ అమరావతి రైతులు చేసే పోరాటంతో తాను భాగస్వామిని అవుతానని వ్యాఖ్యానించారు. రాజధాని రైతులు తన కళ్లు తెరిపించిందనుకు సంతోషంగా ఉందన్నారు. వారితో కలిసి టెంట్ లో కూర్చొని సేవ్ అమరావతి అంటూ ముదుకు సాగుతానని.. కచ్చితంగా అమరావతి లోనే రాజధాని కడతామన్నారు. తన ప్రాణం పోయినా అమరావతి కోసం పోరాడతానని చెప్పారు. తాను ఇప్పుడు స్వతంత్ర ఎమ్మెల్యేన ని.. తనకు పార్టీలేమీ లేవన్న ఆమె.. అమరావతి కోసం పోరుబాట పడతానని తేల్చేయటం గమనార్హం.

మరి.. వైసీపీ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఒక్కరోజు అంటే ఒక్క రోజు కూడా అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం వైపు కానీ.. వారి టెంట్ల వైపు కానీ చూడని శ్రీదేవి.. ఇప్పుడు ఏకంగా టెంట్ లో ఉండిపోతానని.. రైతులకు అండగా నిలుస్తానని వ్యాఖ్యానించటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్నగా మారింది. అమరావతి మీద అంత కమిట్ మెంట్ ఉంటే.. ఆ రోజున రోడ్డున పడ్డ అమరావతి రైతులతో కలిసి నడవలేదెందుకు?

సరే.. అప్పుడున్న పరిస్థితుల్లో నడవటం కష్టం కావొచ్చు. కానీ.. ఏదో ఒక సమయంలో కనీసం ఒక సానుకూల ప్రకటన చేసి ఉంటే బాగుండేది. అందుకు భిన్నంగా అప్పుడేమో పట్టనట్లుగా ఉండి.. ఇప్పుడు మాత్రం అమరావతి మీద ప్రేమ ఒలకపోసే వైనంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అప్పట్లో రెండు మూడు సార్లు అయినా (కనీసం ఒక్కసారైనా) అమరావతికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ఉండి ఉంటే.. ఈ రోజున టెంట్ లో కూర్చుంటాన ని చెప్పటాని కి వీలుండేది. అదేమీ లేకుండా ఇప్పుడు టెంట్ లో కూర్చోవటాని కి వెళతానని చెప్పటం అమరావతి రైతుల్ని ఇబ్బందులకు గురి చేయటమేనని చెప్పక తప్పదు. ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలపై అమరావతి రైతుల రియాక్షన్ ఏమిటో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.