Begin typing your search above and press return to search.

కుప్పంలో ఎందుకీ పరిస్దితి వచ్చింది ?

By:  Tupaki Desk   |   19 Feb 2021 2:30 PM GMT
కుప్పంలో ఎందుకీ పరిస్దితి వచ్చింది ?
X
కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయితీల్లో వైసీపీ 74 పంచాయితీల్లో విజయం సాధించింది. దీంతో గడచిన రెండు రోజులుగా వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. సరే గెలిచిన వాళ్ళు సంబరాలు చేసుకోవటం, ఓడినవాళ్లు డీలా పడిపోవటం అంతా మామూలే. కానీ వైసీపీ గెలుపుకు దారితీసిన పరిస్దితులకన్నా టీడీపీ ఓటమి అంటే చంద్రబాబునాయుడు ఓటమికి కారణాలు ఏమిటి ? పంచాయితీల్లో ఓడిపోవటం అంటే టీడీపీ మద్దతుదారులు ఓడిపోవటం కాదు చంద్రబాబు డిఫీట్ అనే చెప్పుకోవాలి.

ఇంతకీ ఇంతటి పరాభవం ఎదురవ్వటానికి కారణాలు ఏమిటి ? ఏమిటంటే బోలెడన్ని ఉన్నాయి. మొదటిది నియోజకవర్గాన్ని చంద్రబాబు మొదటినుండి పెద్దగా పట్టించుకోకపోవటం. అంటే ఇక్కడి నుండే చంద్రబాబు గడచిన 30 ఏళ్ళుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే కుప్పం అనేది ముఖ్యమంత్రి నియోజకవర్గంగా పాపులరైపోయింది. మరి సీఎం నియోజకవర్గమంటే డెవలప్మెంట్ ఏ రేంజిలో ఉండాలి ? మరి ఆ రేంజిలో డెవలప్మెంట్ జరిగిందా ?

జరిగిందా అంటే జరగలేదనే చెప్పాలి. కుప్పంను మున్సిపాలిటిగా మార్చమని సంవత్సరాలుగా ఉన్న డిమాండ్ ను కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. మంచినీటి సౌకర్యం కల్పించమని దశాబ్దాలుగా జనాలు అడుగుతున్నా పెద్దగా స్పందించలేదు. ఇలాంటి అనేక సమస్యలు సంవత్సరాలుగా అపరిష్కృతంగానే ఉండిపోయాయి. ఇదే సమయంలో ఇన్ని సంవత్సరాలుగా చంద్రబాబుకు గట్టి ప్రత్యర్ధి ఎదురుకాలేదు. కాంగ్రెస్ లో ఎవరు పోటీ చేసినా వాళ్ళని లేదా మండలస్ధాయి నేతలను టీడీపీ వాళ్ళు ఏదో రూపంలో మ్యానేజ్ చేసేసేవారు.

ఇటువంటి అనేక పోల్ మ్యానేజ్మెంట్ కారణంగా పెద్ద ప్రతిఘటన లేకుండానే చంద్రబాబు గెలుస్తున్నారు. కానీ 2014లో మొదటిసారి వైసీపీ రూపంలో గట్టి ప్రత్యర్ధి ఎదురయ్యారు. అయితే చంద్రబాబు ప్రత్యర్ధిని పట్టించుకోలేదు. దాని ప్రభావం 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనబడింది. ఓట్ల లెక్కింపులో మొదటి రెండు రౌండ్లు చంద్రబాబు వెనకబడిపోవటమే డౌన్ ఫాల్ కు సంకేతాలు. ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండే 2024 టార్గెట్ గా జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు.

కుప్పంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించటమే ధ్యేయంగా కుప్పంపై జగన్ పూర్తిస్ధాయి దృష్టి పెట్టారు. మున్సిపాలిటిగా ప్రకటించటం, మంచినీటి సౌకర్యానికి రూ 200 కోట్లు కేటాయించటం, సంక్షేమ పథకాలన్నీ పార్టీ రహితంగా అందరికీ అందేట్లు చూడటం లాంటివన్నీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూసుకుంటున్నారు. మిషన్ 2024కి పెద్దిరెడ్డే సారధి.

ఇదే సమయంలో అధికారంలో ఉన్నా లేకపోయినా నియోజకవర్గంలోని నేతల్లో చాలామందితో చంద్రబాబు కలిసింది కూడా తక్కువే. ఇటువంటి అనేక కారణాలే పంచాయితి ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణాలుగా మారాయి. మరి ఈ ఓటమి ఎన్నికలతోనే ఆగుతుందా లేదా అన్నదే ఆసక్తిగా మారింది.