ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో నిర్మించిన ట్విన్ టవర్స్ కూల్చివేతకు రంగం సిద్దమవుతోంది. ఇందుకోసం ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేస్తుండటం సంచలనంగా మారింది. ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే ఎత్తులో సూపర్ టెక్ సంస్థ ఈ జంట భవనాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 28 ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ ట్విన్ టవర్స్ పేకమేడల్లా కుప్పకూలనున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే ట్విన్ టవర్స్ కూల్చివేతకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చుట్టుపక్క భవనాల్లో నివసిస్తున్న 7,000 మందిని ఇప్పటికే ఇతర ప్రాంతాలకు తరలించామని స్థానిక పోలీసు అధికారులు చెబుతున్నారు. అలాగే ట్విన్ టవర్స్‌కు దగ్గర్లోని నివాసాలకు వంట గ్యాస్, విద్యుత్తు సరఫరాను ఆపేశారు. పెంపుడు జంతువులు, 2500 వాహనాలను ఇలా వేటిని వదలకుండా అధికారులు అక్కడి నుంచి తరలించారు. సాయంత్రం 5:30 గంటల తర్వాత ప్రజలకు తమ నివాసాల్లోకి అనుమతిస్తారు.
ట్విన్ టవర్స్ను కూల్చడానికి ఏకంగా 3,700 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగిస్తుండటం గమనార్హం. ఇందుకోసం ఆ జంట భవనాల పిల్లర్లలో 7000 రంధ్రాలు పెట్టారు. 20,000 సర్క్యూట్లు ఏర్పాటు చేశారు. 100 మీటర్ల దూరం నుంచి రిమోట్ నొక్కగానే ట్విన్ టవర్స్ నిలువునా కుప్పకూలేలా పిల్లర్లు పేలిపోతాయని అధికారులు చెబుతున్నారు. దీన్ని 'వాటర్‌ఫాల్ టెక్నిక్'గా పిలుస్తారని అంటున్నారు.
ట్విన్ టవర్స్ కూల్చివేత ప్రక్రియలో బాంబేకు చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ, దక్షిణాఫ్రికాకు చెందిన జెట్ డిమాలిషన్స్ కలిసి పాల్గొంటున్నాయి. పేలుడుకు 10 సెకన్ల సమయం పడుతుందని, ఆ తర్వాత నాలుగైదు సెకన్లలో అవి పూర్తిగా కిందకు పడిపోతాయని చెబుతున్నారు. ఇక ట్విన్ టవర్స్ కూల్చివేతతో భారీ ఎత్తున రేగే దుమ్ము చెదరడానికి 10 నిమిషాలకు పైగానే సమయం పడుతుందని అంటున్నారు. కాగా గతంలో తెలంగాణ సచివాలయం, సెంట్రల్ జైలును, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని పాత మొతెరా స్టేడియంను ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థే కూల్చడం గమనార్హం.
కాగా ట్విన్ టవర్స్ కూల్చివేతతో దాదాపు 55 వేల టన్నుల వ్యర్థపదార్థాలు పోగుపడతాయని తెలుస్తోంది. ఈ వ్యర్థాల్లో ఏకంగా 4 వేల టన్నుల వరకు ఉక్కు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ట్విన్ టవర్స్ కూల్చాక ఆ ఉక్కును అక్కడి నుంచి తొలగించడానికి మూడు నెలలకు పైగానే సమయం పడుతుందని అంటున్నారు.
అంతేకాకుండా ట్విన్ టవర్స్ కూల్చివేతలతో భూప్రకంపనాలు కూడా వస్తాయని అంటున్నారు. ప్రజలెవరూ కంగారు పడాల్సిన పని లేదని అధికారులు చెబుతున్నారు. ట్విన్ టవర్స్ కు 30 మీటర్ల పరిధిలోనే కొన్ని సెకన్లు మాత్రమే భూప్రకంపనలు ఉంటాయని వివరిస్తున్నారు. ఇది రిక్టర్ స్కేల్‌పై 0.4 భూకంపానికి సమానమని పేర్కొంటున్నారు.
ట్విన్ టవర్స్ కూల్చివేతకు పావు గంట ముందు దగ్గర్లోని గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వేపై 450 మీటర్ల పరిధిలో ట్రాఫిక్‌ను కూడా ఆపేస్తారు. కూల్చివేత పూర్తయిన 15 నిమిషాల తర్వాతే వాహన రాకపోకలను పునరుద్ధరిస్తారు. అలాగే ట్విన్ టవర్స్ చుట్టూ ఒక నాటికల్ మైలు (1.8 కి.మీ.) మేర విమానాలకు గగనతలం అందుబాటులో ఉండదని అధికారులు తెలిపారు.
ఈ ట్విన్ టవర్స్ కూల్చివేతతో పక్కనున్న భవనాలకు ముప్పు వాటిల్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. వాటిలోకి దుమ్ము చేరకుండా, ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు జియో-టెక్స్‌టైల్ కవరింగ్ ఉపయోగిస్తున్నారు.
ఈ ట్విన్ టవర్స్ లో ఒక్కో ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ విలువ రూ.1.13 కోట్లు. రెండు జంట భవనాల్లో కలిపి 915 ఫ్లాట్లు ఉన్నాయని అంటున్నారు. వాటిని అమ్మి ఉంటే నిర్మాణ సంస్థ సూపర్ టెక్‌కు ఏకంగా రూ.1,200 కోట్ల ఆదాయం వచ్చేదని సమాచారం. ఇక 915 ఫ్లాట్లలో 633 ఇప్పటికే బుక్ అయిపోయాయి. అందుకోసం సంస్థ కొనుగోలుదార్ల నుంచి రూ.180 కోట్లు సేకరించింది. అయితే ఇప్పుడు కూల్చివేతతో ఆ మొత్తాన్ని 12 శాతం వడ్డీ చెల్లించి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
నోయిడాలోని సెక్టార్ 93ఏలో ఉన్న ఈ జంట భవనాలను నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఎమరాల్డ్ కోర్టు సమీపంలో సెక్టార్ 93ఏలో ఎపెక్స్, సియాన్ ట్విన్ టవర్స్ ఉన్నాయి. ఎపెక్స్ ఎత్తు 102 మీటర్లు. దీనిని 32 అంతస్తులతో నిర్మించారు. ఇక సియాన్ టవర్స్ 95 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఈ జంట భవనాల్లో 915 ప్లాట్స్, 21 వాణిజ్య సముదాయాలు, 2 బేస్‌మెంట్లు ఉన్నాయి. 2009లో సూపర్‌టెక్ లిమిలెడ్ కంపెనీ ఈ టవర్స్‌ను నిర్మించింది.
ఈ జంట భవనాలను పూర్తి కావడానికి మూడేళ్లు పట్టింది. దీనిపై దగ్గర్లోని సొసైటీవాళ్లు 2012లో కోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు నిర్మాణ అనుమతుల్లో అవకతవకలు జరిగినట్లు తేల్చింది. భవనాల్ని కూల్చివేయాలని 2014లో ఆదేశించింది. ఆ తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు వెళ్లింది. గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు కూడా అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థించింది. కూల్చివేతకు మూడు నెలల సమయం ఇచ్చింది. కానీ, సాంకేతికత కారణాల వల్ల ఇప్పటివరకు పట్టింది.