Begin typing your search above and press return to search.

ఎవరీ తంగరాజు.. సింగపూర్ ఎందుకు అతన్ని ఉరి తీసింది?

By:  Tupaki Desk   |   26 April 2023 4:00 PM GMT
ఎవరీ తంగరాజు.. సింగపూర్  ఎందుకు అతన్ని ఉరి తీసింది?
X
భారత సంతతికి చెందిన తంగరాజు అనే వ్యక్తిని సింగపూర్ ఉరిశిక్షను అమలు చేసింది. భారత్ కు చెందిన వ్యక్తిని ఉరి తీసిన రెండో ఉదంతం ఇదే. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో భారత సంతతి వ్యక్తికి ఉరిని అమలు చేశారు. ఇంతకీ తంగరాజు ఎవరు? అతనిపై ఉన్న ఆరోపణలు ఏమిటి? అన్న విషయాల్లోకి వెళితే..

భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్యను గంజాయి అక్రమ రవాణా కేసులో సింగపూర్ అధికారులు అరెస్టు చేశారు. 2014లో జరిగిన ఈ ఉదంతంలో ఒక కేజీ గంజాయిని సింగపూర్ కు అక్రమంగా తరలిస్తున్న అభియోగాలు ఉన్నాయి.

అతడికి జరిపిన పరీక్షల్లో అతను డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలింది. ఈ కేసులో 2018 అక్టోబరులో అతనికి ఉరిశిక్షను అమలు చేశారు. మరో ఇద్దరితో కలిసి తంగరాజు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సహకరించినట్లుగా తేల్చిన కోర్టు.. అతడికి ఉరి శిక్ష విధించింది.

అయితే.. తంగరాజు కేసును ప్రమాణాలకు అనుగుణంగా విచారణ జరపలేదన్న విమర్శలు ఉన్నాయి. ఒక అమాయకుడైన యువకుడ్ని సింగపూర్ చంపుతున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ శిక్షపై బ్రిటన్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ తీవ్ర ఆరోపణలు చేయటం గమనార్హం.

ఆయన వాదనకు మద్దతుగా ఆస్ట్రేలియా.. యూరోపియన్ యూనియన్లు సైతం నిలిచాయి. బ్రాన్సన్ వ్యాఖ్యల్ని సింగపూర్ ఖండించింది. అయితే.. తంగరాజును ఉరిశిక్ష నుంచి తప్పించేందుకు అతని కుటుంబ సభ్యులు.. యాక్టివిస్టులు క్షమాభిక్ష కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

ఆయన మాటలు సింగపూర్ న్యాయవ్యవస్థను.. న్యాయమూర్తుల్ని కించపరిచేలా ఉన్నాయని మండిపడింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించి స్థానిక చట్టాల ఆధారంగానే శిక్షలను అమలు చేస్తున్నట్లుగా సింగపూర్ ప్రభుత్వం చెబుతోంది.

అయితే.. ఈ ఉరిశిక్ష అమలు మీద మాత్రం పలువురు ఖండిస్తున్నారు. ఇక్కడో అంశాన్ని ప్రస్తావించాలి. తంగరాజు ఉరిశిక్ష రద్దు చేసి క్షమాభిక్ష ప్రసాదించాలని పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో చివరకు తలొగ్గిన సింగపూర్ అధ్యక్షుడు హలిమా యాకోబ్ ఆఖరి నిమిషంలో లేఖ రాశారు. అయితే.. ఆయన లేఖ అధికారులకు చేరటానికి ముందే తంగరాజుకు శిక్షను అమలు చేయటం గమనార్హం.