Begin typing your search above and press return to search.

భారత దగ్గు మందు ఎంత డేంజరో చెప్పిన డబ్ల్యూహెచ్ వో

By:  Tupaki Desk   |   26 April 2023 9:26 AM GMT
భారత దగ్గు మందు ఎంత డేంజరో చెప్పిన డబ్ల్యూహెచ్ వో
X
భారత్ లో తయారైన ఒక దగ్గుమందుపై వార్నింగ్ ఇచ్చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. తాము తనిఖీ చేసిన దగ్గు మందు కలుషితమైనట్లుగా డబ్ల్యూహెచ్ వో పేర్కొంది. పంజాబ్ కు చెందిన క్యూపీ ఫార్మాకెమ్ లిమిటెడ్ సంస్థ తయారు చేసిన దగ్గు మందులో పరిమితికి మించి డైథిలిన్ గ్లైకాల్.. ఇథిలీన్ గ్లైకాల్ తో ఉన్నట్లుగా తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ దగ్గు మందును హర్యానాకు చెందిన థ్రిల్లియం ఫార్మా సంస్థ మార్కెటింగ్ చేస్తోంది.

ఈ దగ్గు మందును చిన్నారులు వినియోగిస్తే ప్రమాదకరమని.. మరణానికి కూడా దారి తీయొచ్చని డబ్ల్యూహెచ్ వో వార్నింగ్ ఇచ్చింది. ఈ దగ్గు మందును పశ్చిమ పసిఫిక్ దేశాలైన మార్షల్ దీవులు.. మైక్రోనేషియాలోనూ గుర్తించారు. ఇందులోని ఒక బ్యాచ్ శాంపిళ్లను తనికీ చేయగా.. అందులో కలుషిత ఆనవాళ్లు గుర్తించినట్లుగా పేర్కొంది.

అయితే.. ఈ దగ్గు మందు కారణంగా ఎవరైనా చిన్నారులు అనారోగ్యం బారిన పడ్డారా? లేరా? అన్న విషయంపై మాత్రం స్పష్టత రావట్లేదు. ఈ దగ్గుమందుతోనే అనారోగ్యం బారిన పడినట్లుగా ఎలాంటి రిపోర్టుల బయటకు రాలేదు.

ఇదిలా ఉంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్నింగ్ నేపథ్యంలో క్యూపీ ఫార్మాకెమ్ ఎండీ స్పందించారు. భారత ప్రభుత్వ అనుమతితోనే తాము 18వేల దగ్గుమందు బాటిళ్లను కంబోడియాకు ఎగుమతి చేసినట్లుగా పేర్కొన్నారు. దేశీయంగా కూడా వాటిని పంపిణీ చేశామని.. కానీ.. ఎలాంటి కంప్లైంట్లు రాలేదని పేర్కొన్నారు. తయారీ సంస్థ స్పందించినప్పటికీ.. మార్కెటింగ్ సంస్థ మాత్రం మౌనంగా ఉంది.

ఇదిలా ఉంటే.. గత ఏడాది భారత్ లో తయారైన దగ్గు మందును వినియోగించిన కారణంగా గాంబియా, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్ లాంటి దేశాల్లో వినియోగించిన కారణంగా 300 మంది చిన్నారులు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో రియాక్టు అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది జనవరిలో విచారణకు ఆదేశించటం తెలిసిందే.

ఈ ఉదంతాన్ని మరిచిపోక ముందే.. మరో దగ్గు మందు కలుషిత పదార్థాలు ఉన్నట్లుగా గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించటం.. దేశీయ ఫార్మా పరపతికి దెబ్బ తగులుతుందని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మరింత కఠినమైన మార్గదర్శకాల్ని జారీ చేయాల్సి ఉందని.. కంపెనీలు చేసే తప్పులకు కఠిన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలంటున్నారు.