Begin typing your search above and press return to search.

కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన ప్రకటన!

By:  Tupaki Desk   |   6 May 2023 1:36 PM GMT
కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన ప్రకటన!
X
2020, 2021 సంవత్సరాల్లో కరోనా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. చిన్న, పేద దేశాలే కాకుండా బాగా అభివృద్ధి చెందిన దేశాలు, ధనిక దేశాలు కూడా కరోనా ధాటికి బెంబేలెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా మరణించారు. మనదేశంలోనూ అనధికారికంగా 25 లక్షల మందికి పైగా మరణించారని వార్తలు వచ్చాయి. అధికారికంగానే మృతుల సంఖ్య 5 లక్షలు దాటింది. కరోనాతో ప్రపంచ దేశాలన్నీ దాని నివారణ, వైద్య చికిత్స సదుపాయాలకే తమ మొత్తం నిధులను ఖర్చు చేయాల్సి రావడంతో ఆర్థికంగానూ కుదేలయ్యాయి.

వ్యాక్సిన్లతో కరోనాను కొంత వరకు నివారించినా అది రకరకాల వేరియంట్లతో ప్రపంచంపైన దాడి చేస్తూనే వస్తోంది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్న ప్రతి ముగ్గురిలో ఒకరు కరోనాతోనే మృతి చెందుతున్నారని వైద్య నిపుణులు, వివిధ ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కీలక ప్రకటన చేసింది. కరోనా ఇకపై ప్రపంచ విపత్తు కాదని ప్రకటించింది. ప్రపంచ విపత్తుగా ప్రకటించే స్థాయిలో ప్రస్తుతం దాని ప్రభావం లేదని తెలిపింది. వైద్య, ఆరోగ్య నిపుణులతో చర్చించాకే తాము ఈ ప్రకటన చేస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

అయితే కోవిడ్‌ మహమ్మారి పూర్తిగా అంతం కాలేదని వెల్లడించింది. ఇప్పటికీ అది ప్రపంచవ్యాప్త ముప్పుగానే ఉందని తెలిపింది. దాని బారినపడి ప్రతివారం కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారని బాంబుపేల్చింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ పేర్కొన్నారు. కోవిడ్‌ ప్రపంచాన్ని మళ్లీ ప్రమాదంలో పడేసే పరిస్థితి ఉందా అనే విషయంపై నిపుణులతో మరోసారి సమీక్ష జరిపించడానికి తాము వెనుకాడబోమని ఈ సందర్బంగా ఆయన వెల్లడించారు.

అయితే ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన కరోనా వైరస్‌ గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ దశను దాటేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో కోవిడ్‌-19ను అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ఇకపై చూడాల్సిన అవసరం లేదని పేర్కొంది.

అయితే కరోనా వైరస్‌ బలహీనపడిపోయినప్పటికీ ఇంకా ముగింపు దశకు చేరుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పటికీ ఆగ్నేయాసియా, మధ్య ప్రాచ్య దేశాల్లో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయని గుర్తు చేసింది. దీంతో ప్రతీ వారం కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 2020 జనవరి 30 డబ్ల్యూహెచ్‌ఓ కోవిడ్‌–19ను అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.