Begin typing your search above and press return to search.

ఎవరీ తహవూర్ రాణా? భారత్ కు అప్పగింతకు అమెరికా కోర్టు ఓకే

By:  Tupaki Desk   |   19 May 2023 8:47 AM GMT
ఎవరీ తహవూర్ రాణా? భారత్ కు అప్పగింతకు అమెరికా కోర్టు ఓకే
X
తాజాగా వెలువడిన తీర్పు ఒకటి భారత్ - అమెరికాల మధ్య సంబంధాల్ని మరింత మెరుగుపర్చేదని చెప్పాలి. కీలక నేరారోపణ లు ఎదుర్కొంటున్న తహవూర్ రాణా ను భారత్ కు అప్పగించేందుకు అమెరికా కోర్టు ఓకే చెప్పింది. ఆయన్ను తమకు అప్పజెప్పాలని భారత్ చేసిన అభ్యర్థన కు సానుకూలత వచ్చింది. భారత్ - అమెరికా మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా ఈ తీర్పును అమెరికా కోర్టు ఇచ్చింది.

ఇంతకీ తహవూర్ రాణా ఎవరు? అన్నంతనే.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన ముంబయి దాడుల్లో కీలక భూమిక పోషించినట్లుగా ఆరోపణలు ఉన్నవారిలో ఒకడు. 2008లో ముంబయిలో జరిగిన మారణకాండలో వందల మంది (166 మంది) ప్రాణాల్ని పోగొట్టుకోవటానికి.. భారీ నష్టానికి కారకుల్లో ఇతగాడు ఒకడు. ఈ ఉగ్రదాడికి ఆర్థిక నిధులు అందించింది ఇతడే. ఇతడి పాత్ర మీద ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతోంది. గతంలో ఇతడి మీద ఉగ్రవాదులకు సాయం చేశారన్న ఆరోపణ మీద షికాగో కోర్టు 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది.

ముంబయిలో ఉగ్రవాదులు జరిపిన దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డేవిడ్ హెడ్లీకి తహవూర్ అత్యంత సన్నిహితుడు. దాడుల కు ముందు ముంబయిలో తుది రెక్కీ నిర్వహించింది కూడా హెడ్లీనే. ఇదే విషయాన్ని హెడ్లీ గతంలోనే తహవూర్ గురించి చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. తాజాగా కాలిఫోర్నియాలో విచారణ జరిగిన కోర్టు కేసులో తాజాగా తీర్పు నిస్తూ.. తహవూర్ రాణా ను భారత్ కు అప్పగించాలని కోర్టు ఆదేశాల్ని జారీ చేసింది. పాకిస్థాన్ మూలాలు ఉన్న ఇతడ్ని త్వరలో భారత్ కు అప్పగించనున్నారు.

ఇక్కడో ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించాలి. వచ్చే నెల (జూన్) 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన కు ముందు భారత్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తహవూర్ రాణా ను అప్పగించేందుకు సిద్ధం కావటం.. మోడీ పర్యటనకు మరింత ప్రాధాన్యత పెరుగుతుందని చెబుతున్నారు. రెండు దేశాల మధ్య స్నేహం మరింత ముందుకు వెళుతుందని చెప్పాలి. మోడీ పర్యటన నేపథ్యంలో ఆయన కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడన్.. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ లు స్టేట్ డిన్నర్ ను ఏర్పాటు చేయనున్నారు.