Begin typing your search above and press return to search.

భారతమ్మతో ఎప్పుడు మాట్లాడాలన్న నేను నవీన్ కే ఫోన్ చేస్తా!

By:  Tupaki Desk   |   2 Feb 2023 5:00 AM GMT
భారతమ్మతో ఎప్పుడు మాట్లాడాలన్న నేను నవీన్ కే ఫోన్ చేస్తా!
X
మాజీ మంత్రి.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వయాన సోదరుడైన వైఎస్ వివకానందరెడ్డి హత్య ఉదంతం దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనంగా మారిందన్న సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును ఈ మధ్యన సీబీఐ వేగవంతం చేయటం.. ఈ మధ్యన కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. సీబీఐ ఎదుట హాజరై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే.. అవినాశ్ కాల్ డేటాను పరిశీలించినప్పుడు.. కొత్త విషయం బయటకు వచ్చింది. వైఎస్ అవినాశ్ నుంచి సీఎం జగన్ నివాసంలో పని చేసే నవీన్ ఫోన్ కు పెద్ద ఎత్తున ఫోన్లు వెళ్లటాన్ని గుర్తించారు. దీంతో.. అతడికి సైతం నోటీసులు ఇవ్వటం.. ఆ విషయం మీడియాలో రావటం ఇప్పుడు సంచలనంగా మారింది. జగన్ నివాసంలో పని చేసే నవీన్ గురించి కొంత మందికి మాత్రమే ఇప్పటివరకు తెలుసు. సీబీఐ నోటీసుల నేపథ్యంలో నవీన్ ఎవరు? అతడేం చేస్తుంటాడు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? లాంటి విషయాలెన్నో చర్చకు వస్తున్నాయి.

ఇలాంటి వేళ.. నవీన్ కు సంబంధించిన కీలక విషయాల్ని వెల్లడించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నవీన్ అనే వ్యక్తి గడిచిన పదిహేనేళ్లుగా పని చేస్తున్నాడని.. తాను సైతం ఎప్పుడైనా జగన్ ఇంట్లో భారతమ్మతో మాట్లాడాలన్నా.. వారి ఆరోగ్య పరిస్థితి.. కుటుంబ విషయాల్ని తెలుసుకోవాలనుకుంటే తాను నవీన్ కు ఫోన్ చేస్తానని వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది. వైఎస్ అవినాశ్ నుంచి పెద్ద ఎత్తున నవీన్ కు ఫోన్లు వెళ్లటం.. ఆ ఫోన్లు ఎవరు మాట్లాడారు? ఏం మాట్లాడారు? అన్న విషయాల మీద పెద్ద చర్చ జరుగుతోంది.

ఇలాంటి వేళ.. నవీన్ పులివెందులకు చెందిన వాడని.. అతడి కుటుంబం గడిచిన దశాబ్దాలుగా వైఎస్ ఇంట పని చేస్తుంటారన్న విషయాలు బయటకు రావటం తెలిసిందే. వైవీ సుబ్బారెడ్డి లాంగి ప్రముఖుడు సైతం తాను భారతమ్మతో మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటే.. నేరుగా నవీన్ కే ఫోన్ చేస్తానని చెప్పిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వివేకా హత్య కేసులో నవీన్ కు నోటీసులు ఇస్తే.. వెళ్లి వస్తాడని.. అందులో తప్పేంటి? అంటూ వైవీ సుబ్బారెడ్డి తేలిగ్గా తీసేయటం గమనార్హం. నవీన్ విషయాన్ని పత్రికల్లో భూతద్దంలో చూపిస్తున్నారని మండిపడ్డారు.

సీబీఐ ఆఫీసులో అవినాశ్ రెడ్డి.. సీబీఐ అధికారులే ఉన్నప్పుడు అక్కడ జరిగిన విషయాలు బయటకు ఎలా వచ్చాయన్న దానిపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుబ్బారెడ్డి... ఆ విషయంపై సీబీఐతో విచారణ చేయించాలని వ్యాఖ్యానించటం గమనార్హం. సుబ్బారెడ్డి మర్చిపోయిన విషయం ఏమంటే.. తమ రాజకీయ ప్రత్యర్థులు.. ఆ మాటకు వస్తే.. ప్రధాని మోడీ.. జనసేన అధినేత పవన్ కలిసి భేటీ అయిన వేళ.. జనసేన అధినేతకు క్లాస్ పడిందంటూ జగన్ అనుకూల మీడియాలో వార్తలు రావటాన్ని సుబ్బారెడ్డి మర్చిపోయినట్లుగా ఉంది. అలాంటప్పుడు ఆ తరహా అంశాల మీద కూడా సీబీఐ చేత విచారణ చేయించాలన్న డిమాండ్ ను సుబ్బారెడ్డి చేసి ఉంటే బాగుండేది. కానీ.. అప్పుడు మౌనంగా ఉండి.. ఇప్పుడు విచారణ చేయించాలని అడిగితే ఏం బాగుంటుందన్న విషయాన్ని టీటీడీ పెద్దాయన గుర్తిస్తే బాగుంటుందేమో?

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.