Begin typing your search above and press return to search.

పౌరసత్వ సవరణ బిల్లు పై రాజ్యసభ లో ఎవరి బలం ఎంత ?

By:  Tupaki Desk   |   11 Dec 2019 8:17 AM GMT
పౌరసత్వ సవరణ బిల్లు పై రాజ్యసభ లో ఎవరి బలం ఎంత ?
X
పౌరసత్వసవరణ బిల్లు ఇప్పటికే లోక్ సభ లో 311-80 తేడాతో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. దీనితో ఈ బిల్లు బుధవారం రాజ్యసభ ముందుకు రానుంది. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన తరువాత రాజ్యసభలో ఆమోదం పొందితే ఆ తరువాత ఆ బిల్లు ఒక చట్టంగా మారుతుంది. అయితే రాజ్యసభలో అధికార బీజేపీకి పూర్తి మెజార్టీ లేకపోవడం.. శివసేన, జేడీయూ దూరంగా ఉండటంతో బిల్లు గట్టెక్కుతుందా అనుమానాలు వెలువడుతున్నాయి.

2014 డిసెంబర్ 31 వరకు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారతీయ పౌరసత్వం ఇస్తామని చట్టం రూపొందించారు. దీనిపై విపక్షాల నుంచి అభ్యంతరం వ్యక్తమైన సంగతి తెలిసిందే. రాజ్యసభలో శివసేన పార్టీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీతో నెలకొన్న వివాదంతో.. కేంద్ర మంత్రివర్గం నుంచి కూడా శివసేన బయటకొచ్చింది. బీజేపీతో అంటిముట్టనట్టుగానే ఉంటోంది. లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌కు శివసేన 12 మంది ఎంపీలు దూరంగా ఉన్నారు. రాజ్యసభలో జరిగి ఓటింగ్‌కు కూడా దూరంగా ఉంటారని తెలుస్తోంది. మరోవైపు జేడీయూ కూడా అంటిముట్టగానే వ్యవహరిస్తోంది. రాజ్యసభలో జేడీయూకు ఆరుగురు ఎంపీలు ఉన్నారు. ఎన్ఆర్సీ సవరణ బిల్లుకు మద్దతిచ్చేందుకు నితీశ్ కుమార్ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. కానీ బిల్లు గట్టెక్కుతుందని ప్రభుత్వ వర్గాలు ధీమాతో ఉన్నాయి.

ఇకపోతే రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 240 కాగా.. బీజేపీకి 83 మంది ఉన్నారు. జేడీయూ, ఎస్ఏడీ, ఏఐఏడీఎంకే, బీజేడీ, వైసీపీతో గట్టెక్కచ్చని భావిస్తోంది. బీజేపీ 83, జేడీయూ, ఎస్ఏడీ మూడు చొప్పున అన్నాడీఎంకే 11, బీజేడీ 7, వైసీపీ ఇద్దరు సభ్యుల మద్దతు తో ఆ సంఖ్య 128కి చేరుతుందని భావిస్తోంది. దీనితో ఈజీగా బిల్లు పాస్ అవుతుంది అని భావిస్తున్నారు. అయితే ఈ ఓటింగ్ పక్రియ లో జేడీయూ ఎలా వ్యవహరిస్తుందనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక విపక్ష కూటమికి 112 ఓట్లతో బలంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎస్పీ, వామపక్షాలు, టీఆర్ఎస్ కూడా వీరికి జతకానుంది.