Begin typing your search above and press return to search.

వైట్ హౌస్ దగ్గర ట్రక్కుతో రచ్చ సాయి వర్షిత్ ఫ్యూచర్ ఏం కానుంది?

By:  Tupaki Desk   |   26 May 2023 10:28 AM GMT
వైట్ హౌస్ దగ్గర ట్రక్కుతో రచ్చ సాయి వర్షిత్ ఫ్యూచర్ ఏం కానుంది?
X
ఎందుకు చేశాడో? అసలేం ఆలోచిస్తున్నాడో? మనసులో ఏముందో? లాంటి సందేహాలు సాయి వర్షిత్ కందుల ఉదంతం గురించి తెలిసినంతనే మదిలో మెదిలో ఆలోచనలు. పందొమ్మిదేళ్ల కుర్రాడు..ఒక భారీ ట్రక్కుతో వైట్ హౌస్ లోకి ఎంటరై.. అమెరికా అధ్యక్షుడ్ని హతమార్చి.. అధికారాన్ని హస్తగతం చేసుకోవటమే లక్ష్యమని చెప్పే మాటల్ని వింటే ఎక్కడో ఏదో తేడా కొడుతుందన్న భావన కలుగక మానదు.

అయితే.. తీవ్రమైన నేరానికి పాల్పడి అంతర్జాతీయంగా సంచలనంగా మారిన సాయి వర్షిత్ ఫ్యూచర్ ఎలా ఉండనుంది? అన్నది ప్రశ్నగా మారింది.

తాజాగా అతడ్ని కోర్టులో ప్రవేశ పెట్టారు. ఆరెంజ్ కలర్ జంప్ సూట్ లో కోర్టు ఎదుట హాజరుపర్చగా.. అక్కడి న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు క్లుప్తంగా.. పొడిగా సమాధానాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. కోర్టులో వినయంగా వ్యవహరించాడని చెబుతున్నారు. ఈ కేసును విచారించిన ఫెడరల్ కోర్టు జడ్జి రాబిన్ మెరివెదర్ అతడికి మే 30 వరకు కస్టడీకి ఆదేశిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ట్రక్కుతో వైట్ హౌస్ గోడను ఢీ కొట్టి.. అమెరికా అధ్యక్షుడే తన టార్గెట్ గా చెప్పిన సాయి వర్షిత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వాహనాన్ని పరిశీలించగా..అందులో నాజీల జెండా తప్పించి మరింకేమీ లభించలేదు.

తనను తాను నిరుద్యోగిగా పరిచయం చేసుకున్న అతడు.. తానో డేటా ఎనలిస్టుగా పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపటం.. అధ్యక్షుల వారిని చంపుతానని బెదిరించటం.. అనుమతి లేకుండా చొరబడటం లాంటి పలు అభియోగాల నేపథ్యంలో సాయి వర్షిత్ కు పదేళ్ల వరకు జైలుశిక్ష పడటం ఖాయమని చెబుతున్నారు.

అంతేకాదు.. రూ.2 కోట్ల ఫైన్ విధిస్తారని చెబుతున్నారు. వచ్చే వారం ఈ కేసు విచారణ జరగనుంది.