Begin typing your search above and press return to search.

నాగార్జునసాగర్ లో కామ్రేడ్ల దారెటు?

By:  Tupaki Desk   |   8 April 2021 3:30 AM GMT
నాగార్జునసాగర్ లో కామ్రేడ్ల దారెటు?
X
తెలంగాణలో కామ్రేడ్ ల కాలం ముగిసి ఎన్నో ఏళ్లు అవుతోంది. వారి మనుగడ కష్టమైంది. ఎమ్మెల్యేగా కమ్యూనిస్టులు గెలిచే రోజులు పోయాయి. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రభ తగ్గిపోయినట్టే తెలంగాణలోనూ అంతరించిపోయిందనే చెప్పాలి. కేవలం సంఘాలకు మాత్రమే వారు పరిమితమయ్యారు.

ప్రస్తుతం కమ్యూనిస్టులు పోటీచేసేందుకు తాహతు లేకుండా. తాము అభ్యర్థిని నిలబెట్టినా.. లేక మద్దతు ఇచ్చినా వారికి పరువు కూడా దక్కని దుస్థితితో కమ్యూనిస్టు పార్టీలున్నాయి.అయితే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులు పోటీపడకపోయినా.. వారి మద్దతు ఎవరికన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల మద్దతు కోరింది.

తెలంగాణలో సీపీఐ, సీపీఎం ప్రాబల్యం ఉందంటే అవి పాత నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోనే. నల్గొండలో జరుగుతున్న నాగార్జున సాగర్ లో కమ్యూనిస్టులకు కొంత ఓటు బ్యాంకు ఉంది.సాగర్ ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వండని కాంగ్రెస్ పార్టీ రెండు కమ్యూనిస్టు పార్టీలను కోరింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఎత్తుగడ వేసింది.

కాంగ్రెస్ విజ్ఞప్తిపై కమ్యూనిస్టులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పోటీచేస్తే గెలవలేకపోతున్నాం.. మద్దతు ఇచ్చిన వాళ్లు కూడా గెలవడం లేదన్న బాధ కామ్రేడ్స్ కు ఉంది. కమ్యూనిస్టులు ఇప్పుడు క్లారిటీకి రాలేకపోతున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ లలో ఎవరికి మద్దతు ఇవ్వాలన్నది వారు అయోమయానికి గురవుతున్నారు. లెక్కలు వేసుకుంటున్న కమ్యూనిస్టులు మండలాల వారీగా రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. గెలిచే పార్టీకే మద్దతివ్వాలని డిసైడ్ అయ్యారట.