Begin typing your search above and press return to search.

వారాహి పంది.. పార్టీ ఇమేజ్ ఏమైపోవాలి అంబటి?

By:  Tupaki Desk   |   22 Jun 2023 2:00 PM GMT
వారాహి పంది.. పార్టీ ఇమేజ్ ఏమైపోవాలి అంబటి?
X
తిట్టొచ్చు ? తీవ్రంగా తప్పు పట్టొచ్చు. ప్రత్యర్థుల కు చెమటలు పట్టేలా.. నోటి నుంచి మాటల రానట్లుగా వ్యాఖ్యలు చేయాలి. విమర్శనాస్త్రాల్ని సంధించాలి. అయితే.. ఇవన్నీ చేసేటప్పుడు కూడా మాట లో మర్యాద మిస్ కాకూడదు. నోరు పారేసుకోవటం నిమిషం. కానీ.. దాని కారణంగా జరిగే నష్టం అపారం అన్న విషయాన్ని మంత్రి అంబటి రాంబాబు మిస్ అవుతున్నారా? అన్నది ప్రశ్న.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విరుచుకుపడే విషయంలో మంత్రి అంబటి ప్రదర్శించే దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి ఆయన.. పవన్ ను టార్గెట్ చేయాలంటే ఆయన్ను ఉద్దేశించి నిర్మాణాత్మకంగా విమర్శలు చేయాలి. ఆయన చెప్పే మాటల్లోని డొల్లతనాన్ని.. కడిగిపారేస్తూ ఉండాలి. అంతే తప్పించి.. గొంతు పెంచేసి.. నోటికి వచ్చినట్లుగా ఎంత మాట పడితే అంత మాట.. మర్యాదకు దూరంగా చేసే వ్యాఖ్యలతో ఇబ్బందులు తప్పవు.

వారాహి పేరు తో సిద్ధం చేసిన వాహనం గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదే పదే ప్రస్తావించటం.. అమ్మవారి పేరు మీద వాహనాన్ని సిద్ధం చేసినట్లు చెప్పటం తెలిసిందే. ఇలాంటి వేళ.. అమ్మవారి పేరు తో ఉన్న వారాహి ని పంది అంటూ నాటుగా మాట్లాడే మాటతో అంబటి కి జరిగే డ్యామేజ్ తో పాటు.. వైసీపీకి కూడా నష్టం వాటిల్లుతుందన్న విషయాన్ని అంబటి గుర్తించాలంటున్నారు.

పవన్ ను తిట్టాలని.. తప్పు పట్టాలంటే ఎన్నో అంశాలు ఉన్నాయని.. వాటిని పట్టుకోవాల్సిందిపోయి.. దేవత పేరు ను పలకాల్సిన తీరుతో కాకుండా.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడే ధోరణి సరికాదంటున్నారు. వారాహి అన్న పదానికి పంది అన్న అర్థం కూడా ఉంటుంది. కానీ.. వాడాల్సిన విషయాల్లో వాడాల్సింది పోయి.. అందుకు భిన్నంగా నోరు పారేసుకుంటే నష్టమేనన్న విషయాన్ని అంబటి గుర్తుంచుకోవాలన్న మాట వినిపిస్తోంది.