Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు 53 కు లింకేంది?

By:  Tupaki Desk   |   5 Dec 2019 5:29 AM GMT
కేసీఆర్ కు 53 కు లింకేంది?
X
ఎవరేమన్నా పట్టించుకోకుండా తాను అనుకున్న పనిని అనుకున్నట్లుగా చేసేందుకు ఎంతకూ వెనక్కి తగ్గని తీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతం. విమర్శలకు వెరవటం సారూ ఇంటా వంటా లేనట్లుగా ఉంది తాజా పరిణామాలు చూస్తుంటే. తాజాగా "53" పేరుతో కేసీఆర్ మీద చేస్తున్న కామెడీ అంతకంతకూ ఎక్కువ అవుతున్నట్లుగా చెబుతున్నారు.

చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడూ లేని రీతిలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయటం.. ఏకంగా 52 రోజులు చేసిన తర్వాత కూడా సీఎం స్పందించని నేపథ్యంలో తమకు తాము సమ్మె కాడిని కిందకు పడేసినట్లుగా ప్రకటించినా కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. తర్వాత రెండు రోజులకు రియాక్ట్ అయి.. ఆర్టీసీ సమ్మె ముగించటాన్ని స్వాగతం పలుకుతూ తనదైన శైలిలో పావులు కదిపారు.

కట్ చేస్తే.. ఆర్టీసీకి చెందినంత వరకూ ఎలాంటి సంఘాలు లేవని తేల్చేసిన కేసీఆర్.. ప్రైవేటీకరణ చేసేది లేదన్న అభయాన్ని ఇచ్చేశారు. అంతేనా.. సమ్మె కాలంలో కోర్టు అడిగినా.. వంద కోట్లు కూడా ఇవ్వలేనన్న కేసీఆర్.. అందుకు భిన్నంగా వరాల వర్షం కురిపిస్తూ సమ్మె కాలంలో తనను తిట్టి పోసిన వారందరి చేత పాలాభిషేకాలు చేయించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే దిశ దారుణ ఉదంతం తెర మీదకు రావటం.. జాతీయ స్థాయిలో ఇదో ఇష్యూగా మారింది. ఎప్పటిలానే తనకేమీ పట్టనట్లుగా దిశ వ్యవహారంపై పెద్దగా స్పందించింది లేదు కేసీఆర్. ఆర్టీసీ కార్మికులతో కలిసి భోజనం చేసిన రోజున దిశ ఉదంతాలు జరగకూడదన్న మాటను.. దోషులకు సత్వరం శిక్ష పడేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చేశారు. అంతే తప్పించి.. దిశ తల్లిదండ్రుల్ని కలవటం.. వారిని ఓదార్చటం లాంటి కార్యక్రమాల్ని చేపట్టలేదు.

దిశ వ్యవహారంపై దేశం మొత్తం స్పందిస్తున్న తీరునకు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రియాక్షన్ ఏ మాత్రం సంబంధం లేనిదిగా మారింది. ఈ నేపథ్యంలో కొందరు కేసీఆర్ తీరును ఎటకారం ఆడేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు 52 రోజులు చేసిన తర్వాత కానీ కదల్లేదని.. దిశ ఉదంతంలోనూ 53 రోజున స్పందించే అవకాశం ఉందని సెటైర్లు వేస్తున్నారు. మరి.. అందరూ అనుకున్నట్లే చేస్తే.. ఆయన కేసీఆర్ ఎందుకవుతారన్నది ఒక ప్రశ్న అయితే.. దిశ కుటుంబాన్ని పరామర్శించేందుకు అసలు వెళతారా? అన్నది మరో ప్రశ్నగా మారింది.