Begin typing your search above and press return to search.

భారత్ కు భూకంప ప్రమాదం ఎంతమేర ఉంది?

By:  Tupaki Desk   |   9 Feb 2023 5:00 PM GMT
భారత్ కు భూకంప ప్రమాదం ఎంతమేర ఉంది?
X
తుర్కియే.. సిరియా భూకంప ఘటనల తర్వాత ప్రపంచవ్యాప్తంగా వీటిపై చర్చ నడుస్తోంది. ఈ దుర్ఘటనపై అన్ని దేశాలు మానవత్వంలో స్పందిస్తూ తుర్కియే.. సిరియాలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇదే సమయంలో తమ దేశానికి భూకంప ముప్పు ఎంత వరకు ఉందని.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వాటిపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో భారత్ లో భూకంప ప్రమాదం ఏమేరకు ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.

భూకంపాలను ఆపడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. కానీ ప్రకృతి విపత్తులను ముందుగా అంచనావేసి తగు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రాణనష్టాన్ని వీలైనంత వరకు తగ్గించుకునే అవకాశం లభించనుంది. ఇదిలా ఉంటే తుర్కియే భూకంపాన్ని ముందుగానే అంచనా వేసిన డచ్ పరిశోధకుడు ప్రాంక్ హూగర్ బీట్స్ భారత్.. పాకిస్తాన్.. ఆఫ్ఘనిస్తాన్లో త్వరలోనే భూకంపం రానుందని హెచ్చరించడం ఆందోళనను రేపుతోంది.

మరోవైపు భారత్ లోని మొత్తం భూభాగంలో 60 శాతం భూకంప ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ 2022 డిసెంబర్లో పార్లమెంటులో వెల్లడించింది. దేశంలో భూకంపాలు వచ్చే ప్రాంతాలను నాలుగు జోన్లుగా విభజించారు. ఐదో జోన్లో ఉంటే అత్యంత ప్రమాదకరమని రెండో జోన్లో ముప్పు స్వల్పంగా ఉంటుందని పేర్కొన్నారు.

దేశ రాజధాని ఢిల్లీ.. దాని పక్కనే ఉన్న గురుగ్రామ్ లకు భూకంప ముప్పు అత్యధికంగా ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ హిమాలయాలకు దగ్గర ఉండటంతో ప్రమాదం ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. భూ పొరల్లో ఫలకాల రాపిడికి ఏర్పడే ఫాల్ట్ లైన్లు యాక్టివ్ గా ఉన్న సోహనా.. మథుర.. ఢిల్లీ.. మెరాదాబాద్ వల్ల ఢిల్లీ ప్రమాదం ఉందని తెలుస్తోంది.

ప్రపంచ దేశాల్లో భూకంప ముప్పు అధికంగా ఉండే ప్రాంతం హిమాలయలేనని సైంటిస్టులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో 2400 కి.మీ పొడవునా హిమాలయాల్లో ఎక్కడైనా భూకంప కేంద్రం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హిమాలయ భూమి పొరల్లో టెక్టానిక్ ప్లేట్స్ పై 700 ఏళ్లుగా అత్యంత ఒత్తి ఉందని చెబుతున్నారు. ఈ ఫలకాలు కదులుతూ ఉండటం వల్ల అంచనాపై ఒత్తిడి పెరుగుతూ వస్తుందని చెబుతున్నారు.

ఈ క్రమంలో ఏ క్షణమైనా భూకంపం సంభవించే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. లేదంటే 200 ఏళ్ల తర్వాతనైనా రావచ్చని అంటున్నారు. దీని ప్రభావం మధ్య హిమాలయాలపై చూపిస్తుందని 2016లోనే సైంటిస్టులు హెచ్చరించారు. కాగా 1905లో హిమాలయాల్లోని కంగారంలో భూకంపం వచ్చింది. 1934లో హిమాలయ కేంద్రంగా నేపాల్.. బీహార్ లో భూకంపం రాగా 10వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

1991లో ఉత్తర కాశీలో భూకంపం వల్ల 800 మంది.. 2005లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భూకంపానికి 80 వేల మంది మృత్యువాత పడ్డారు. హిమలయాలు కాకుండా 2001లో గుజరాత్ కచ్ లో వచ్చిన భూకంపం వల్ల 20వేల మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్.. యూరోపియన్ ప్లేట్స్ తరుచూ రాపిడికి గురవుతున్న కారణంగా హిమాలయాలకు ముప్పు ఎక్కువగా ఉందని వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియాలజీ సైంటిస్టులు పేర్కొన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.