Begin typing your search above and press return to search.

అమెరికా టూర్ లో మోడీ ఏం చేస్తున్నారు?

By:  Tupaki Desk   |   21 Jun 2023 8:00 PM GMT
అమెరికా టూర్ లో మోడీ ఏం చేస్తున్నారు?
X
అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీ బిజీబిజీగా ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నానానికి న్యూయార్కుకు చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం పలికారు. తీరికలేని షెడ్యూల్ తో పలువురు ప్రముఖులతో ఆయన వరుస పెట్టి భేటీ అవుతున్నారు. ఆయన భేటీ అవుతున్న వారిలో వివిధ కంపెనీలు సీఈవోలు.. ఆర్థికవేత్తలు.. మేధావులు.. నోబెల్ గ్రహీతలు.. శాస్త్రవేత్తలు.. విద్యావేత్తలు.. వ్యాపారవేత్తలు.. వైద్య రంగ ప్రముఖులతో పాటు కళాకారులు ఉండటం గమనార్హం.

అన్ని వర్గాలతోనూ భేటీ అవుతున్న మోడీ ప్రపంచ కుబేరుడు.. టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ తో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. ఇంధన రంగం నుంచి ఆధ్మాత్మికత వరకు పలు అంశాలపై మాట్లాడుకున్నట్లుగా చెబుతున్నారు.

మోడీతో భేటీపై స్పందించిన ఎలాన్ మస్క్.. రెండో సారి భేటీ కావటం ఎంతో గౌరవంగా పేర్కొనటం విశేషం. ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ టైసన్ తో భేటీ సందర్భంగా అంతరిక్ష రంగంలో భారత్ సంస్కరణల గురించి మాట్లాడారు. ఈ రంగం వైపు యువతను ప్రోత్సహించేందుకు చేస్తున్న ప్రయత్నాలను మాట్లాడినట్లు చెబుతున్నారు.

ప్రముఖ పరిశోధనాకారుడు.. బౌద్ధమతంపై పరిశోధనలు చేసే రాబర్ట్ ఎ.ఎఫ్. థుర్ మ్యాన్ తో మోడీ భేటీ సందర్భంగా ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించటానికి బౌద్ధమతం ఏ విధంగా దోహదం చేస్తుందన్న విషయాన్ని వెల్లడించారు. ప్రముఖ రచయిత.. పెట్టుబడిదారు రే డాలియోతో మోడీ భేటీ అయ్యారు. తమ ప్రభుత్వం సంస్కరణల పథంపై చర్చించారు. భారత్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆయన్ను మోడీ కోరారు.

విద్యా రంగ ప్రముఖులతో భేటీఅయిన ప్రధాని మోడీ.. భారత్ లో విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేసే అంశంపై వారు తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. వైద్య రంగం నిపుణులతో జరిపిన భేటీలో వైద్య రంగంలో తాము ఇటీవల తీసుకొచ్చిన సంస్కరణలు. సాంకేతికతను వెల్లడించగా.. భారత్ లో ఆరోగ్య వ్యవస్థ ను మరింత మెరుగుపరిచే మార్గాలపై అభిప్రాయాల్ని తెలుసుకున్నారు.

ఇక.. బుధవారం అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ తో కలిసి నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ను ప్రధాని మోడీ సందర్శిస్తారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో మోడీ పాల్గొంటారు. జూన్ 22న అమెరికా కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.