Begin typing your search above and press return to search.

ఏమిటీ హికికోమొరి? మీ ఇంట్లో వాళ్లకు ఎప్పుడైనా ఎటాక్ కావొచ్చు

By:  Tupaki Desk   |   17 April 2023 4:10 PM GMT
ఏమిటీ హికికోమొరి? మీ ఇంట్లో వాళ్లకు ఎప్పుడైనా ఎటాక్ కావొచ్చు
X
ఇదేం పేరు? విచిత్రంగా ఉందే? ఎప్పుడు వినలేదే? చిత్ర విచిత్రమైన పేర్లు చెప్పి భయపెట్టేస్తున్నారుగా? అలాంటి క్వశ్చన్లు వేయొచ్చు. కానీ మనకు తెలియని వాటి గురించి కామెంట్లు చేసే కన్నా.. తెలుసుకోవటం ద్వారా అవగాహన పెంచుకోవటమే కాదు.. ఇలాంటి పరిస్థితులే ఎదురైతే ఏం చేయాలన్న అవగాహన కూడా మంచిదే. ఇంతకీ హికికోమొరి అంటే ఏమిటి? దాని వల్ల ఎదురయ్యే ఇబ్బందులేంటి? ఆ సమస్య బారిన పడినోళ్లు ఎలా వ్యవహరిస్తారు? దానికి ఏం చేయాల్సి ఉంటుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.

హికికోమొరి అన్నది మానసిక మైన జబ్బు. దీన్ని.. సింఫుల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే.. అంతర్ముఖులుగా వ్యవహరించటం. అంటే ఇంట్లో వారితో మొదలు కొని బయటవారితో మాట్లాడేందుకు ఇష్టపడకపోవటం.. కలిసేందుకు ఆసక్తి చూపకపోవటం.. ఆ మాటకు వస్తే ఇంట్లో తన గదిలో నుంచి బయటకు రాకపోవటం లాంటి పరిస్థితినే హికికోమొరిగా చెప్పొచ్చు. దీన్ని మొదటిసారి 1980లో గుర్తించారు. అప్పట్లో ఎదురైన ఆర్థిక మాంద్యం.. ఉద్యోగాలు పోవటం లాంటి పరిస్థితులతో కొందరు.. అప్పటివరకు తమలో ఉన్న చలాకీతనానికి భిన్నంగా ఎవరితో కలవకుండా తమదైన ప్రపంచంలో బతికేయటంగా చెప్పాలి. ఈ మానసిక రుగ్మత బారిన పడినోళ్లు తమ చుట్టూ ఒక గిరి గీసుకొని.. అందులో నుంచి బయటకు రావటానికి అస్సలు ఇష్టపడరు.

అప్పటివరకున్న అలవాట్లను వదిలేసి.. ఆందోళన.. కుంగుబాటుతోపాటు అందరూ చుట్టూ ఉన్నా ముభావంగా ఉండటం లాంటి లక్షణాలతో ఉంటారు. ఈ తీరు పెరిగే కొద్దీ ఆత్మహత్యలు చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వీరిని కమ్మేస్తుంటాయి. అయితే.. అధికారికంగా దీన్నో మానసిక సమస్యగా ప్రకటించలేదు కానీ.. ఈ లక్షణాలతో ఉన్న వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలనిమాత్రం చెప్పక తప్పదు. ఈ తరహా వైఖరి ఇటీవల కాలంలో అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. వ్యక్తిగతంగా వైఫల్యం చెందినా.

తాము అనుకున్నది అనుకున్నట్లు ఫలితాన్ని సొంతం చేసుకోలేకపోయినా ఈ మానసిక సమస్య బారిన పడుతుంటారు. జపాన్ ఆరోగ్య శాఖ ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. దాదాపు 15 లక్షల మందికి హికికోమొరి లక్షణాలు కలిగి ఉన్నట్లుగా గుర్తించారు. ఇలాంటి వారు నెలలు మాత్రమే కాదు సంవత్సరాల తరబడి కూడా ఎవరితోనూ కలవకుండా ఉండి పోతారని చెబుతున్నారు. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాల్నిజారీ చేసింది.

ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవటం.. వ్యక్తిగతంగా ఎదురయ్యే వైఫల్యాలు.. విద్యా.. ఉద్యోగాల్లో తీవ్రమైన పోటీ కారణంగా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. దక్షిణ కొరియాలో 19-39ఏళ్ల మధ్య దాదాపు మూడున్నర లక్షల మంది ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నట్లుగా చెబుతున్నారు. విద్యార్థులు ఉద్యోగుల మీద ఈ సమస్య ఎక్కువగా ఉందని గుర్తించిన అక్కడి ప్రభుత్వం వారు ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చేందుకువీలుగా మన రూపాయిల్లో నెలకు రూ.40వేల మొత్తాన్ని జీవనానికి ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు.

ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోనూ ఈ కేసులు బయటకు వస్తున్నాయి. భారత్ లోనూ ఇలాంటివి ఉన్నా.. అవగాహన లేని కారణంగా గుర్తించని పరిస్థితి. కరోనా పుణ్యమా అని చాలామంది దీని బారిన పడ్డారని చెబుతున్నారు. శారీరక అనారోగ్యానికి గురైతే వెంటనే చికిత్స తీసుకునే చాలామంది.. మానసిక సమస్యలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని కారణంగా సమస్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. అందుకే.. ఈ తరహా లక్షణాలతో ఎవరు కనిపించినా.. వారి విషయంలోజాగ్రత్తలు తీసుకుంటూ వైద్యసేవలు అందేలా చేయాలంటున్నారు. సో.. బీ కేర్ ఫుల్.