Begin typing your search above and press return to search.

శ్వేత పోస్టుమార్టంలో అసలు ఏముంది?

By:  Tupaki Desk   |   28 April 2023 5:24 PM GMT
శ్వేత పోస్టుమార్టంలో అసలు ఏముంది?
X
విశాఖ బీచ్ లో శవమై తేలిన వివాహిత శ్వేతది హత్యా లేక ఆత్మహత్యా అన్న చిక్కుముడి వీడింది. సముద్రంలోంచి ఒడ్డుకు కొట్టుకు వచ్చినది శ్వేతది ఆత్మహత్యనే అని ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. ఈ మేరకు మీడియాకు పోలీసులు వెల్లడించారు.

శ్వేత డెడ్ బాడీ సముద్రంలోంచి కొట్టుకురావడం.. బట్టలు సరిగా లేకపోవడంతో ఇది హత్యనా? లేక మరేదైనా అఘాయిత్యం జరిగిందా? అన్న ప్రచారం మీడియాలో బాగా జరిగింది. అయితే పోలీసులు మాత్రం శ్వేత ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని.. ఆమెది ఆత్మహత్య అని తేల్చారు. కుటుంబంలోని గొడవలు కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

తాజాగా శ్వేత (24) మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు శవ పంచనామా నిర్వహించారు. శ్వేత డెడ్ బాడీకి ముగ్గురు వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించి ప్రాథమిక నివేదికను పోలీసులకు అందించారు. పోలీసుల చేతుల్లో ఉన్న ఆ రిపోర్టులో ఏముందనేది ఆసక్తికరంగా మారింది.

శ్వేతది ఆత్మహత్య అయినప్పటికీ అనుమానాస్పద మృతిగానే భావిస్తూ విచారణ చేస్తున్నట్టు మూడో పట్టణ పోలీసులు తెలిపారు. శ్వేత మరణం తర్వాత ఓ కీలకమైన అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శ్వేత తల్లి రమ ఇచ్చిన ఫిర్యాదులో శ్వేత ఆడపడుచు భర్త లైంగిక వేధింపులకు పాల్పడినట్టు పేర్కొన్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఆడపడుచు భర్త పై లైంగిక వేధింపులు, అత్త-ఆడపడుచులపై వరకట్నం వేధింపుల కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం ఈ కేసులో భర్త, అత్తా-మామ, ఆడపడుచులు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. శ్వేత మృతదేహాన్ని తల్లి రమ, బంధువులకు పోలీసులు అప్పగించారు. గురువారం కాన్వెంట్ కూడలిలో శ్వేత అంత్యక్రియలు జరుగనున్నాయి.

ఇక బీచ్ లోని కెమెరాలు పనిచేయడం లేదని పోలీసులు గుర్తించారు. శ్వేత ఆత్మహత్య చేసుకున్న బీచ్ రోడ్డులోని వార్ మొమోరియల్ స్థూపం సమీపంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతోనే ఆమె ఆత్మహత్య విషయంలో పోలీసులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.