Begin typing your search above and press return to search.

దుబాయ్ యువ‌రాణి ఇప్పుడు ఎక్క‌డున్నారు?

By:  Tupaki Desk   |   9 Sep 2018 4:49 AM GMT
దుబాయ్ యువ‌రాణి ఇప్పుడు ఎక్క‌డున్నారు?
X
యువ‌రాణి అన్నంత‌నే విలాస‌వంత‌మైన జీవితం. దేనికి లోటు లేకుండా ఉంటుంద‌ని అనుకుంటారు. కానీ.. అదంతా త‌ప్ప‌ని.. వారికి క‌ష్టాలు ఉంటాయ‌న్న విష‌యాన్ని రుజువు చేస్తోంది దుబాయ్ యువ‌రాణి రషికా ల‌తీఫా దీన‌గాథ‌. తండ్రి చెర నుంచి ఎగిరిపోవాల‌ని.. త‌న‌దైన జీవితాన్ని జీవించాల‌న్న ఆమె చిన్న కోరిక ఇప్పుడు ఆమె ఎక్క‌డ ఉందో తెలీకుండా చేయ‌ట‌మే కాదు.. ఇప్పుడామె ఆచూకీ క‌నుగొన‌ట‌మే క‌ష్టంగా మారింది.

ఈ మొత్తం ఎపిసోడ్‌ లో త‌న‌కు సంబంధం లేకున్నా.. తాను చేసిన ప‌నికి భార‌త్ ఆమెస్ట్రీ చేత వేలెత్తి చూపించే ప‌రిస్థితిని కొని తెచ్చుకుంద‌ని చెబుతున్నారు.ఇంత‌కీ దుబాయ్ యువ‌రాణి ర‌షికా లతీఫా ఎవ‌రు? ఆమె ఎందుకు పారిపోవాల‌నుకుంది? అందులో భార‌త్ చేసిన త‌ప్పేంటి?. ఆమెస్ట్రీ ఎందుకు భార‌త్‌ను వేలెత్తి చూపిస్తోంది? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వెతికిన‌ప్పుడు దొరికే జ‌వాబుల‌కు అయ్యో.. పాపం అనుకోకుండా ఉండ‌లేని ప‌రిస్థితి.

దుబాయ్‌ రాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మకతూమ్‌ కుమార్తె షికా లతీఫా. ఆరుగురు భార్య‌లున్న దుబాయ్ రాజుకు మొత్తం 30 మంది సంతానం. వారిలో ల‌తీఫా ఒక‌రు. 32 ఏళ్లున్న ల‌తీఫాను తండ్రి వేధిస్తున్న దుస్థితి. స్వేచ్ఛ లేని రాజరికం నుంచి దూరంగా పారిపోవాల‌ని.. అమెరికాలో త‌న‌దైన జీవితాన్ని గ‌డ‌పాల‌ని భావించిన ఆమె.. త‌న స్నేహితుల సాయంతో దుబాయ్ నుంచి పారిపోయే ప్లాన్ చేసింది.

అనుకున్న‌ట్లే త‌న స్నేహితుల సాయంతో దుబాయ్ సిబ్బంది క‌ళ్లు గ‌ప్పి మ‌రో ముగ్గురితో క‌లిసి మ‌ర‌ప‌డ‌వ‌లో పారిపోయింది. ఇదంతా ఈ ఏడాది మార్చిలో చోటు చేసుకుంది. వారు ప్రయాణిస్తున్న బోట్‌.. గోవా స‌ముద్ర జ‌లాల‌కు 40నాటిక‌ల్ మైల్స్ లో గుర్తించారు. భార‌త్ తీర ప్రాంత ర‌క్ష‌క ద‌ళం ఆ ప‌డ‌వ‌ను త‌మ అధీనంలో తీసుకున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

తుపాకీలు చూపించి ప‌డ‌వ‌లోని వారిపై భౌతిక దాడికి గురి చేశారు. ప‌డ‌వ‌ను దుబాయ్ యువ‌రాణి తో పాటు మ‌రో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప‌డ‌వ‌లోని సిబ్బందిని బాగా కొట్టారు. ప‌డ‌వ‌ను ధ్వంసం చేశారు. తాను ఆశ్ర‌యం కోసం కోరి వ‌చ్చాన‌ని.. త‌న‌ను ర‌క్షించాల‌ని.. త‌న‌కుసాయం చేయాల‌ని ఆమె ఎంత కోరుకున్నా భార‌త అధికారులు స్పందించ‌లేద‌ని చెబుతారు.ఆశ్ర‌యం కోరి వ‌చ్చిన ఆమె మాట‌ను విన‌కుండా ఆమెను దుబాయ్ యువ‌రాజుకు అప్ప‌గించిన‌ట్లుగా తెలుస్తోంది.

పారిపోతున్న యువ‌రాణి ప్రయాణిస్తున్న ప‌డ‌వ‌ను అదుపులోకి తీసుకున్నంత‌నే.. దుబాయ్ నుంచి ప్ర‌త్యేక హెలికాఫ్ట‌ర్ లో వ‌చ్చి యూఏఈ అధికారులు ఆమెను.. ఆమె స్నేహితుల్ని అదుపులోకి తీసుకొని వెళ్లిపోయారు. కొంత కాలానికి ఆమె స్నేహితుల్ని విడిచిపెట్టారు. అయితే.. ఇప్ప‌టికి ఆమె ఆచూకీ ల‌భించ‌ని ప‌రిస్థితి. గ‌తంలో ఇదే రీతిలో పారిపోయే ప్ర‌య‌త్నం చేసిన ఆమెను.. చీక‌టి గదిలో ఏళ్ల త‌ర‌బ‌డి బంధించి ఉంచారు.

తాజా ప్ర‌య‌త్నం విఫ‌లం కావ‌టం ఒక ఎత్తు అయితే.. అప్ప‌టి నుంచి ఆమె క‌నిపించ‌కుండా పోవ‌టంపై అమెస్ట్రీ భార‌త ప్ర‌భుత్వాన్ని త‌ప్పు ప‌డుతోంది.

ఆశ్ర‌యం కోరి వ‌చ్చిన వారిని ఇలా ఎలా అప్ప‌గిస్తార‌ని ప్ర‌శ్నిస్తోంది. భార‌త తీర ప్రాంత ర‌క్ష‌క ద‌ళం వ్య‌వ‌హార‌శైలి ఏ మాత్రం స‌రికాద‌న్న మాట‌ను అమెస్ట్రీ చెప్పింది. ఆశ్ర‌యం కోరి వ‌చ్చిన వారి ప‌ట్ల ఇలా వ్య‌వ‌హ‌రించ‌టం ఏమిట‌న్న ప్ర‌శ్న‌తో పాటు.. దీనిపై స‌మాధానం చెప్పాల‌ని భార‌త్ ను కోరింది. అప్ప‌టినుంచి క‌నిపించ‌ని యువ‌రాణికి సంబంధించి తాజాగా ఒక వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అందులో తన ఆవేద‌న‌ను వెల్ల‌డించింది. తాను పారిపోవ‌టానికి ముందే రికార్డుచేసిన‌ట్లుగా ఉన్న ఈ వీడియోలో.. తాను త‌న తండ్రి వేధింపులు భ‌రించ‌లేక పారిపోతున్న‌ట్లుగా ప్ర‌క‌టించింది. త‌న‌కు స్వేచ్ఛ లేద‌ని.. సంకెళ్ల మ‌ధ్య‌.. తండ్రి వేధింపుల మ‌ధ్య బ‌తుకుతున్న‌ట్లుగా పేర్కొంది. త‌న వీడియోను చూసే స‌మ‌యానికి తాను జీవించే అవ‌కాశం ఉండ‌దేమోన‌న్న అనుమానాన్ని వ్య‌క్తం చేసింది. బ‌హుశా ఇదే.. నా చివ‌రి వీడియో ఏమో అంటూ పేర్కొన్న ఆమె ఆచూకీపై ఆందోళ‌న అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఆమె ఎక్క‌డ ఉందో బ‌య‌ట‌పెట్టి.. ఆమె స్వేచ్ఛ‌గా జీవించేలా చ‌ర్య‌లు తీసుకోవాలంటూ యూఏఈ స‌ర్కారును అమెస్ట్రీ కోరుతోంది. యూఈఏ రాజుకు ఇలాంటి వాటికి స్పందించే అవ‌కాశం ఉందంటారా?