Begin typing your search above and press return to search.

ఆ మూడు గంటలు ఏమి జరిగింది...అవినాష్ మీద ప్రశ్నల వర్షం

By:  Tupaki Desk   |   19 April 2023 11:07 PM GMT
ఆ మూడు గంటలు ఏమి జరిగింది...అవినాష్ మీద ప్రశ్నల వర్షం
X
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఇ అధికారులు ఏకధాటిగా ఎనిమిది గంటల పాటు ప్రశ్నించినట్లుగా తెలిసింది. హత్య జరిగితే దాన్ని గుండెపోటుగా ఎలా చిత్రీకరించారు అని కీలకమైన ప్రశ్ననే సీబీఐ అధికారులు సంధించారు.

ఇక హత్య జరిగిన తొలి మూడు గంటలలో ఏమి జరిగింది అని కూడా సీబీఐ అధికారులు అడిగినట్లుగా తెలిసింది. తనకు వివేకా సమీప బంధువు కాబట్టి తాను ఆయన చనిపోయారని తెలిసిన వెంటనే వెళ్లానని అక్కడ వారు గుండె పోటు అని చెబితే తాను అదే చెప్పానని అవినాష్ రెడ్డి సమాధానం ఇచ్చినట్లుగా తెలిసింది.

మరో వైపు చూస్తే అవినాష్ రెడ్డి ముందు తాము అడగదలచుకున్న ప్రశ్నలను ఉంచి వాటికి సమాధానాలు సీబీఐ అధికారులు రాబట్టారు. దీనిని ఆడియో వీడియో రికార్డింగ్ చేయించారు. అవినాష్ రెడ్డిని గురువారం కూడా విచారించనున్నారు. ఈ నెల 25వ తేదీ వరకూ ప్రతీ రోజూ ఈ విచారణ ఉంటుందని తెలుస్తోంది.

మరో వైపు చూస్తే వైఎస్ వివేకా హత్య కేసులో ఏ 6, ఏ 7 నిందితులుగా ఉంటూ రిమాండులో ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కరెడ్డిలను కస్టడీ విచారణలో భాగంగా సీబీఐ కార్యాలయానికి తీసుకుని వచ్చి సీబీఐ ఈ రోజు ప్రశ్నించింది. ఇద్దరినీ వేరు వేరుగా న్యాయవాదికి వారు కనిపించే విధంగా సీబీఐ అధికారులు ఉంచి ప్రశ్నించారు.

వైఎస్ వివేకా హత్య కేసులో సాక్ష్యాధారాలు ఎందుకు చెరిపేయాల్సి వచ్చింది అని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. రక్తపు మడుగులో ఉన్న వివేకా తలకు బ్యాండేజి ని చుట్టిన విషయాన్ని సీబీఐ అధికారులు ఉదయ్ కుమార్ రెడ్డి వద్ద ప్రస్తావించి సమాధానాలు రాబట్టాలని చూసినట్లుగా తెలిసింది.

దీని మీద ఉదయ్ కుమార్ రెడ్డి చెప్పిన సమాధానాలను సీబీఐ అధికారులు రికార్డు చేసుకున్నారు. ఇక హత్య జరిగిన రోజు ఉదయ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నారు అని అడిగి సమాధానాలు రికార్డ్ చేశారు. ఇక 2019 మార్చి 15న ఉదయం కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో ఎందుకు ఉన్నావని కూడా ఉదయ్ ని ప్రశ్నించినట్లుగా తెలిసింది.

ఇక వైఎస్ వివేకా హత్యకు నెల రోజుల ముందే స్కెచ్ గీశారు అని ప్రాధమికంగా ఉన్న ఆధారాలతో సీబీఐ అధికారులు వైఎస్ భాస్కరరెడ్డిని దాని మీదనే ప్రశ్నించారని తెలిసింది. ఈ విచారణ ముగిసిన తరువాత సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఇద్దరికీ చంచల్ గూడా జైలుకు తరలించారు. ఇక గురు వారం ఉదయం తొమ్మిది గంటలకు ఇద్దరికీ రెండవ రోజు కస్టడీ విచారణలో భాగంగా సీబీఐ కార్యాలయానికి తీసుకుని రానున్నారు.