Begin typing your search above and press return to search.

పోటీకి ఎలా దిగాలో చెప్పి.. 175 స్థానాల గెలుపు మాటేంది జగన్?

By:  Tupaki Desk   |   1 March 2023 2:00 PM GMT
పోటీకి ఎలా దిగాలో చెప్పి.. 175 స్థానాల గెలుపు మాటేంది జగన్?
X
అందుకే అంటారు.. ఒక మాట అంటే మరో మాట వస్తుందని. ఈ సత్యం తెలిసిన వారు తక్కువ మాట్లాడతారు. ఆవేశాలకు పోరు. అనవసర సవాళ్లు విసరరు. కానీ.. అలాంటివాటి గురించి పెద్దగా పట్టింపులేని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల కారణంగా ఇప్పుడు కొత్త ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. తన గొప్పతనాన్ని చాటుకునేందుకు చెబుతున్నట్లుగా ఉన్నఆయన మాటలు.. తన తండ్రి కమ్ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చిన్నబుచ్చేలా.. ఆయన సాధించిన ఘన విజయాల్ని తక్కువ చేసేలా మారతాయన్న విషయాన్ని జగన్ ఎందుకు గుర్తించటం లేదు?

అదే పనిగా సీఎం జగన్ ప్రస్తావిస్తున్న విషయం ఒకటి ఇప్పుడు ఆయనకు.. ఆయన తండ్రికి చేటు కలిగించేలా మారిందన్న మాట వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ.. జనసేనలు ఒంటరిగా పోటీ చేయాలని.. ఉమ్మడిగా కలిసి పోటీ చేయకూడదన్న విషయాన్ని అదే పనిగా ప్రస్తావిస్తుంటారు సీఎం జగన్. దమ్ముంటే.. 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని చెప్పే జగన్.. 2004లో తన తండ్రి ముఖ్యమంత్రి అయ్యింది నాటి టీఆర్ఎస్.. కమ్యునిస్టు పార్టీలతో జత కట్టే అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు?

ఒంటరిగా పోటీ చేయటమే దమ్ము అని చెప్పే జగన్.. మరి.. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పొత్తులతోనే ఎన్నికల్లో పోటీ చేసి.. అధికారంలోకి రావటాన్ని ఏమని చెప్పాలి? ఎలా చెప్పాలి? ఒంటరిగా పోటీ చేసి గెలవటమే దమ్ముకు అర్థమైతే.. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాధించిన విజయాలు అన్నీ కూడా దమ్ము లేవనే జగన్ చెప్పదలుచుకున్నారా? నిజానికి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పొలిటికల్ కెరీర్ లో సంపాదించిన పేరు ప్రఖ్యాతుల్ని వారసుడి రూపంలో జగన్ కు బట్వాడా చేయటం వల్లనే.. ఈ మాత్రం బలం ఉందన్నది మర్చిపోకూడదు.

దీనికి తోడు తాను బయటకు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల్ని పార్టీలోకి తీసుకొని ఎన్నికల బరిలోకి దిగిన జగన్.. ఒంటరిగా పోటీ చేసే విషయం మీద మాట్లాడటమా? అన్నది ప్రశ్నగా మారింది. రాజకీయంగా మాట్లాడటం తప్పేం కాదు. కానీ.. ఆ పేరుతో.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం ద్వారా తనకు ఈ రోజున ఇంతటి రాజకీయశక్తికి కారణమైన తన తండ్రి వైఎస్ మనసు బాధ పడేలా చేయటం ఎంతవరకు సబబు? ఒంటరిగా పోటీ చేసి గెలుచుడే అసలైన విజయంగా అభివర్ణిస్తే.. 2004లోవైఎస్ సాధించిన అపూర్వ విజయాన్ని చిన్నబుచ్చటమే అవుతుంది. ఒక బాధ్యత కలిగిన కొడుకు తన తండ్రి విషయంలో అలా వ్యవహరిస్తారా? అన్నది ఇప్పుడు సీఎం జగన్ తనకు తాను వేసుకోవాల్సిన ప్రశ్నగా చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.