Begin typing your search above and press return to search.

యాత్రలకు శాశ్వతంగా చెక్....సుప్రీం కోర్టు ఏం చెబుతుందో....?

By:  Tupaki Desk   |   24 Nov 2022 10:30 AM GMT
యాత్రలకు శాశ్వతంగా చెక్....సుప్రీం కోర్టు ఏం చెబుతుందో....?
X
రాజకీయ యాత్రలుగా రాజధాని యాత్రలు మారి కొన్నాళ్ళ పాటు ఏపీలో అలజడిని సృష్టించారు. వారు చేశారని వీరు వీరు అన్నారని వారు ఇలా ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా సవాళ్లు చేసుకుంటూ సాగాయి. అమరావతి టూ అరసవెల్లి అంటూ అక్కడ రైతులు సెప్టెంబర్ 12న తలపెట్టిన యాత్రతో అసలైన కధ మొదలైంది. మా ఉత్తరాంధ్రాలో పరిపాలనా రాజధాని పెట్టాలని కోరుకుంటూంటే మీరు ఎలా వస్తారు అంటూ వైసీపీ నేతలు ప్రశ్నించడంతో ఆ యాత్ర కాస్తా రాజకీయ రంగు పులుముకుంది.

అమరావతి రైతుల పాదయాత్ర వెనకాల టీడీపీ ఉందని ఆరోపించిన వైసీపీ తానుగా చొరవ తీసుకుని మూడు రాజధానుల కోసం జేఏసీ ఏర్పాటు చేసి మరీ కధ నడిపించింది. అయితే రాజధాని యాత్రలు కాస్త రాజకీయ యాత్రలుగా మారిపోయి వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా సమరం సాగిన వేళ ఉన్నట్లుండి అమరావతి రైతులు దీపావళి పండుగ ముందు తమ పాదయాత్రను వాయిదా వేసుకున్నారు.

పండుగ అయ్యాకనే తాము తిరిగి యాత్ర చేపడతామని చెప్పారు కానీ ఇప్పటికి నెల్లాళ్ళు అవుతున్నా వారు యాత్రను తిరిగి స్టార్ట్ చేయలేదు. దానికి కారణాలు అనేకం ఉన్నాయని అంటున్నారు. పోలీసులు అమరావతి రైతుల యాత్ర మీద ఆంక్షలను గట్టిగా బిగించడంతో వారు యాత్ర చేయలేకపోయారు. దాని మీద హై కోర్టుకు వెళ్ళి ఆంక్షలను సడలించమని కూడా కోరుకున్నారు.

కానీ కోర్టు ఆ విషయంలో రైతులకు భరోసా ఇవ్వలేదు. తాము చెప్పిన పద్ధతిలోనే యాత్ర చేయాలని సూచించింది. ఈ పరిణామాల క్రమంలో రైతులు తర్జన భర్జన పడి చివరికి యాత్రను ఆపేశారు. మరో వైపు అమరావతి రైతులు వచ్చే దారిలోనే ఎదురుగా నిలబడి మూడు రాజధానులకు జై అంటూ వైసీపీ ఆద్వర్యంలో నల్ల జండాల ప్రదర్శలతో పాటు ఒక దశలో వారి మీద వీరు రాళ్ళు కూడా రువ్వుకున్న సంఘటనలు జరిగాయి.

ఇపుడు ఈ వైపు కూడా సైలెంట్ అయ్యారు. అమరావతి రైతులు పాదయాత్ర స్టార్ట్ చేస్తే తాము కూడా మళ్లీ ర్యాలీలు, ఆందోళనలు చేపడతామని మూడు రాజధానుల డిమాండ్ చేస్తున్న జేయేసీ నేతలు అంటున్నారు. అయితే అమరావతి రైతులు తమ పాదయాత్ర స్టార్ట్ చేసేది ఉండదని అంటున్నారు. ఈ మధ్యలో ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడంతో అత్యున్నత న్యాయ స్థానంలో ఈ కేసు విచారణలో ఉంది. ప్రస్తుతం ఈ నెల 28కి విచారణ వాయిదా వేశారు.

కోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందో చూడాలని అంతవరకూ ఆందోళనలు చేపట్టకపోవడమే బెటర్ అన్న ఆలోచనలలో అమరావతి రైతులు ఉన్నారని అంటున్నారు. ఎందుకంటే విచారణ మీద ఈ పరిణామాల ప్రభావం పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. మొత్తానికి చూస్తే మూడు రాజధానుల విషయంలో కూడా సుప్రీం కోర్టు తీర్పు మీదనే దృష్టి పెట్టారని చెబుతున్నారు. దాంతో ఇరు వర్గాలు ఇపుడు ఆందోళనలకు స్వస్తి పలికినట్లే అంటున్నారు. దీంతో ఇక రాజధాని యాత్రలకు శాశ్వతంగా చెక్ పడినట్లే అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.