Begin typing your search above and press return to search.

ఆ సామాజిక వ‌ర్గం అడిగిందేంటి.. జ‌గ‌న్ చేసిందేంటి?

By:  Tupaki Desk   |   8 Feb 2023 7:00 PM GMT
ఆ సామాజిక వ‌ర్గం అడిగిందేంటి.. జ‌గ‌న్ చేసిందేంటి?
X
ఏపీలో అనేక సామాజిక వ‌ర్గాలు ఉన్నాయి. ఎవ‌రి డిమాండ్లు వారికి ఉన్నాయి. కాపుల‌ను తీసుకుంటే.. వారికి రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని కోరుతున్నారు. అదే వ‌డ్డెర‌ల‌ను తీసుకుంటే.. ప్ర‌స్తుతం వారు బీసీలుగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే వారిని ఎస్టీలుగా మార్చాల‌ని.. దీనికి సంబంధించి మార్పు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ప‌లు సామాజిక వ‌ర్గాలు సైతం ఇలాంటి డిమాండ్లే చేస్తున్నాయి.

ఇక‌, ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మ‌ణులు(క్షుర‌కులు) కూడా కొన్ని ద‌శాబ్దాలుగా ఒక డిమాండ్‌ను రైజ్ చేస్తున్నారు. అదేంటంటే.. ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని ఆల‌యాల్లో ప‌నిచేస్తున్న త‌మ‌కు క‌నీస వేత‌నం అమ‌లు చేయాల‌నేది వారి ప్ర‌ధాన డిమాండ్‌. ప్ర‌స్తుతం వారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించే వారు కొనుగోలు చేసే టికెట్‌లో స‌గం మొత్తాన్ని కేటాయిస్తున్నారు. అంటే.. ఒక ర‌కంగా కాంట్రాక్టు ప‌న‌న్న మాట‌. దీనిని వారు వ‌ద్ద‌ని చెబుతున్నారు.

గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై కూడా వారు ఇదే డిమాండ్‌తో ఉద్య‌మం చేసినంత ప‌నిచేశారు. త‌మ‌కు క‌నీస వేత‌నం ఇప్పించాల‌ని కోరారు. అయితే.. అప్ప‌ట్లో ఇది వివాదం కావ‌డం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ హ‌యాంలోనూ.. ఇదే డిమాండ్ చేస్తున్నారు. వారికిక‌నీస వేత‌నం ఇస్తాన‌ని హామీ ఇవ్వ‌లేదు కానీ.. దీనికి సంబంధించి ప్ర‌భుత్వం చ‌ర్య‌లైతే తీసుకుంది. కానీ, ఇప్పుడు.. అనూహ్యంగా దీనిని ప‌క్క‌న పెట్టేసింది.

వారు కోరింది ప‌క్క‌న పెట్టిన ప్ర‌భుత్వం.. వారు ఏమీ ఆశించ‌ని ఒక కీల‌క బాధ్య‌త‌లు వారికి ఇచ్చేసి.. చేతులు దులుపుకొంద‌నే వాద‌న వినిపిస్తోంది. దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల ట్రస్టు బోర్డు సభ్యుల నియా­మకాల్లో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరికి తప్పనిసరిగా స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ద్వారా ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ జారీ చేసింది.

అనాదిగా ఆలయాల వ్యవస్థలో అర్చకు­లతో పాటు నాయీ బ్రాహ్మణులకు విడదీయరాని బంధం ఉందని దేవదాయ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఆలయాల్లో భజంత్రీలుగా, క్షురకులుగా, ప్రత్యేక ఉత్సవాల సమయంలో స్వామి వారి ఊరేగింపు పల్లకీ సేవల్లో నాయీ బ్రాహ్మణులు పాలు పంచుకుంటున్నారని గుర్తు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వారికి ట్ర‌స్టు బోర్డుల్లో అవ‌కాశం క‌ల్పించామ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. అయితే.. వాస్త‌వానికి వీటి వ‌ల్ల వారికి ఒరిగిందేంటి? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. వారు కోరింది ఒక‌టైతే.. జ‌గ‌న్ ఇచ్చింది మ‌రొక‌ట‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.