Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఎస్ఎస్ఎల్ సీలో ఫెయిలయ్యారా? ఆ విషయాన్ని చెప్పిందెవరు?

By:  Tupaki Desk   |   18 Feb 2023 10:03 AM GMT
చంద్రబాబు ఎస్ఎస్ఎల్ సీలో ఫెయిలయ్యారా? ఆ విషయాన్ని చెప్పిందెవరు?
X
తెలుగుదేశం పార్టీ అధినేత.. దాదాపు పద్నాలుగున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు సంబంధించిన రాజకీయ జీవితం గురించి అందరికి తెలిసిందే. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కానీ.. ఆయన వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా వివరాలు బయటకు రావు. ఆయన బాల్యం.. కాలేజీ రోజులు.. యువకుడిగా ఉన్న వేళలో ఆయన గురించిన విషయాలు పెద్దగా ఫోకస్ కావు.

ఇటీవల ఆదరణ పొందుతున్న టాక్ షోల కారణంగా కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా పాప్ సింగర్ గా సుపరిచితమైన స్మిత నిర్వహిస్తున్న నిజం టాక్ షోకు అతిధిగా విచ్చేసిన చంద్రబాబుకు సంబంధించిన కొత్త సంగతులు బయటకు వచ్చాయి.

కుర్రాడిగా ఉన్న వేళలో ఆయన ఎస్ఎస్ఎల్ సీ లో ఫెయిల్ అయిన వైనం బయటకు రావటంతో పాటు.. ఆ సందర్భంగా ఆయనేం చేశారన్న విషయాన్ని ఆయన స్నేహితుడు చెప్పిన మాటలు విస్మయానికి గురి చేస్తాయి. నిజానికి అప్పట్లో ఆయన లేకపోతే.. ఏమై ఉండేదన్న ప్రశ్నే గగుర్పాటుకు గురి చేస్తోంది. ఇంతకూ ఆయన ఎవరు? ఏం చెప్పారన్న విషయంలోకి వెళితే.. చంద్రబాబు స్నేహితుడు దేవరాజ్ నాయుడు పాత విషయాన్ని తాజాగా బయటపెట్టారు.

''1968 మేలో ఎస్ఎస్ఎల్ సీ ఫలితాలు వచ్చాయి. చంద్రబాబు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు. రైల్వే ఫ్లాట్ ఫాం దిగేసి.. పట్టాలపై వెళుతున్నారు. వెనుక నుంచి రైలు కదలటానికి సిద్ధంగా ఉంది. నేను వేగంగా పరుగెత్తికెళ్లి చంద్రబాబును వెనక్కి తీసుకొచ్చా'' అని దేవరాజ్ నాయుడు వెల్లడించారు.

ఈ ఇంటర్వ్యూ క్లిప్ ను చంద్రబాబుకు చూపించగా.. ఆయన స్పందిస్తూ..''నిజమే.. నేను ఎస్ఎస్ఎల్ సీ ఫెయిల్ అయ్యా. మళ్లీ ఆ స్కూల్లో చదవలేక తిరుపతిలో చేరా. ఆ తర్వాత ఇంకెప్పుడూ పరీక్షల్లో తప్పలేదు. జీవితంలో ఓటమి.. ఫెయిల్యూర్లు మనలో కసిని పెంచుతాయి'' అని చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారన్నది తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.