Begin typing your search above and press return to search.

ఏడాదిలో ఎంత తేడా.. అదానీ ఆర్నెల్లలో అటుదిటు 'టాటా'

By:  Tupaki Desk   |   14 March 2023 6:00 PM GMT
ఏడాదిలో ఎంత తేడా.. అదానీ ఆర్నెల్లలో అటుదిటు టాటా
X
సరిగ్గా ఏడాది కిందట.. గౌతమ్ అదానీ వ్య‌క్తిగ‌త సంపద ఎంతో తెలుసా! అంతకుముందు ఏడాది వ్యవధిలో ఆయన వ్య‌క్తిగ‌త సంప‌ద‌లో ఎల‌న్‌మ‌స్క్‌ (టెస్లా), జెఫ్ బెజోస్‌ (అమెజాన్), బెర్నార్డ్ అర్నాల్ట్‌ల‌ను దాటేశారు. అలా ఏడాది కాలంలో అదానీ వ్య‌క్తిగ‌త సంప‌ద 49 బిలియ‌న్ల డాల‌ర్లు పెరిగింది. మొత్తం గౌతం అదానీ వ్య‌క్తిత సంప‌ద 153 శాతం పెరిగి 81 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకుంది. భార‌త్‌లోనూ, ఆసియాలోనూ రెండో అతిపెద్ద కుబేరుడిగా ఉన్న ఆయన నాడు మ‌రో రికార్డు నెల‌కొల్పారు. అత్య‌ధికంగా వ్య‌క్తిగ‌త సంప‌ద పెంచుకున్న కుబేరుల్లో గౌతం అదానీ మొద‌టి స్థానంలో ఉంటే.. త‌ర్వాతీ స్థానంలో గూగుల్ స‌హ‌-వ్య‌వ‌స్థాప‌కులు లారీ పేజ్‌, సెర్జెయ్ బ్రిన్‌, ల‌గ్జ‌రీ గూడ్స్ గ్రూప్ సంస్థ ఎల్వీఎంహెచ్ సీఈవో-ఫౌండ‌ర్ బెర్నార్డ్ అర్నాల్ట్ 39 బిలియ‌న్ డాల‌ర్లు పెంచుకున్నారు.

నాడు ఆ ముగ్గురిని దాటేసి..

2022 లో ఎల‌న్‌మ‌స్క్‌, జెఫ్‌బెజోస్‌, బెర్నార్డ్ అర్నాల్ట్‌ల కంటే ఎక్కువ‌గా గౌతం అదానీ వ్య‌క్తిగ‌త సంప‌ద పెంచుకున్నారు. 2020లో సంప్ర‌దాయేత‌ర ఇంధ‌న సంస్థ అదానీ గ్రీన్ సంప‌ద 17 బిలియ‌న్ల డాల‌ర్లు. అయితే, స్టాక్ మార్కెట్ల‌లో లిస్ట‌యిన త‌ర్వాత దాదాపు ఐదు రెట్లు పెరిగి 81 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరింది. కాగా, గౌతమ్‌ అదానీ సంపాదన 2021లోనూ భారీగా పెరిగింది. అదానీ గ్రూప్‌నకు చెందిన వివిధ రంగాల షేర్లు అనూహ్యంగా పుంజుకోవడంతో 2021లో ప్రపంచంలోనే అతి ఎక్కువ సంపద ఆర్జించిన వ్యక్తిగా నిలిచారు. నికర సంపద పేరుగదలలో ప్రపంచ కుబేరుల్లో నంబర్‌ 1 స్థానానికి పోటీ పడుతున్న మస్క్‌, జెఫ్ బెజోస్ కంటే అదానీ ముందున్నారు. 2020లో 17 బిలియన్‌ డాలర్లుగా ఉన్న అదానీ నికర ఆస్తి విలువ 2021లో 81 బిలియన్‌ డాలర్లకు చేరిందని ఎమ్3ఎమ్ హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022 తన నివేదికలో తెలిపింది. మరోవైపు భారత్‌కు చెందిన మరో కుబేరుడు, ఆసియాలోనే అత్యంత సంపాదనపరుడైన ముకేశ్‌ అంబానీ సంపాదన ఇదే సమయంలో 8.1 బిలియన్ల డాలర్లు పెరగడం గమనార్హం.

అదానీ గ్రూప్‌షేర్లు ఒకటి మినహా మిగిలినవన్నీ తక్కువలో తక్కువ 50 శాతం మేర పెరగడంతో అదానీ సంపాదన 2021లో ఈ స్థాయిలో పెరిగింది. ఎమ్3ఎమ్ హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2022 ప్రకారం.. గత సంవత్సరం గౌతమ్ అదానీ సంపద 49 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. గౌతమ్ నికర సంపద పెరుగుదల "మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్ నికర సంపద పెరుగుదల కంటే ఎక్కువ" అని హురున్ గ్లోబల్ పేర్కొంది. గత 10 ఏళ్లలో అంబానీ సంపద 400 శాతం వృద్ధి చెందగా, అదానీ సంపద 1,830 శాతం పెరిగినట్లు అని జాబితా హురున్ గ్లోబల్ తన నివేదికలో తెలిపింది. అదానీకి పోర్టులు, ఎయిర్‌పోర్టులు, కోల్‌మైన్స్‌, పవర్‌ ష్లాంట్లు వంటి వివిధ రంగాల్లో వ్యాపారాలున్నాయి. 1 గిగావాట్‌ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్‌ను దేశంలో ఏర్పాటు చేసేందుకు సైతం అదానీ ఎంటర్‌ ప్రెజెస్‌ ముందుకొచ్చింది. దీంతో సాంకేతిక రంగంలోనూ అదానీ గ్రూప్‌ అడుగు పెట్టినట్టయ్యింది.

సెప్టెంబరులో టాటాలను దాటేసి..

గత సెప్టెంబరులో టాటా గ్రూప్‌ను అదానీ గ్రూప్‌ వెనక్కి నెట్టింది. మార్కెట్‌ విలువ పరంగా అతిపెద్ద గ్రూప్‌గా అవతరించింది. మార్కెట్‌ విలువ పరంగా అతిపెద్ద గ్రూప్‌గా అవతరించింది. ఈ విషయంలో ఇన్నాళ్లూ అగ్రస్థానంలో ఉన్న టాటా గ్రూప్‌ను వెనక్కి నెట్టింది. అంబుజా, ఏసీసీ సిమెంట్‌ కంపెనీలను అదానీ గ్రూప్‌ కొనుగోలు చేయడం ఈ గ్రూప్‌ అగ్రస్థానానికి దోహదపడింది. 2022 సెప్టెంబరులో దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో అదానీ గ్రూప్‌నకు చెందిన 9 కంపెనీల మొత్తం విలువ రూ.22.25 లక్షల కోట్లకు చేరింది. టాటా గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.20.81 లక్షల కోట్లుగా నిలిచింది. అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ శుక్రవారం రూ.40వేల కోట్లు పెరగ్గా.. అదే సమయంలో టాటా గ్రూప్‌ మార్కెట్‌ విలువ రూ.60వేల కోట్లు క్షీణించడం గమనార్హం. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్‌ అగ్రస్థానానికి చేరింది. ఈ విషయంలో ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మూడో స్థానంలో నిలిచింది. ఆ గ్రూప్‌నకు చెందిన కంపెనీల మార్కెట్‌ విలువ రూ. 17.07లక్షలుగా ఉంది. అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ గ్రీన్‌, అదానీ పోర్ట్స్‌, అదానీ పవర్‌, అదానీ విల్మర్‌ కంపెనీలు ప్రస్తుతం మార్కెట్‌లో లిస్టయి ఉన్నాయి. వీటీకి అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ సిమెంట్స్‌ కూడా తాజాగా తోడయ్యాయి. ఈ రెండూ ఇప్పటికే మార్కెట్‌లో లిస్టయి ఉన్నాయి. ఈ రెండింటినీ మినహాయిస్తే అదానీ గ్రూప్‌నకు చెందిన మార్కెట్‌ విలువ ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు రూ.10.16 లక్షల కోట్ల మేర పెరగడం గమనార్హం. ఇదే సమయంలో టాటా గ్రూప్‌ మార్కెట్‌ వాటా రూ.2.57 లక్షల కోట్ల మేర తగ్గింది.

ప్రపంచ కుబేరుడు కాబోయి..

అదానీ గ్రూప్ కంపెనీలు 2022 సెప్టెంబరులో ఓ శుక్రవారం చేసిన ర్యాలీతో.. గౌతమ్ అదానీ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కుబేరుడు అయ్యారు. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టేసి మరి గౌతమ్ అదానీ ఈ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలీనియర్స్ జాబితా ప్రకారం గౌతమ్ అదానీ సంపద నాడు 155.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం ఈ సంపద రూ.12.42 లక్షల కోట్లు. అదానీ ప్రపంచ కుబేరుడిగా తొలి స్థానాన్ని సంపాదించుకోవడానికి అప్పటికి ఇంకా ఒక్క అడుగే మిగిలి ఉంది. ఆయన ప్రస్తుతం తొలి స్థానం కోసం ఎలన్ మస్క్‌తో పోటీపడనున్నారు. ఫోర్బ్స్ విడుదల చేసిన డేటాలో అదానీ సంపద నిన్న ఒక్క రోజే 5.5 బిలియన్ డాలర్లు పెరిగింది. నాడు.. అదానీ గ్రూప్ స్టాక్స్ ఈ ఏడాది ప్రారంభం నుంచి మంచి రిటర్న్స్‌ను అందించాయి. నాలుగు కంపెనీలు అయితే ఏకంగా రెండింతల వరకు రిటర్న్స్‌ను అందించాయి. అదానీ పవర్ 288.9 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్ 135.2 శాతం లాభాలు పండించాయి. అదానీ ఎంటర్‌ప్రైజస్ 116.6 శాతం, అదానీ గ్రీన్ 74.1 శాతం లాభపడ్డాయి. అదానీ గ్రూప్ కంపెనీలకు చెందిన ఏడు కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. తాజాగా ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌ను కూడా అదానీ కొనేశారు. నిన్నటితో ఈ డీల్ కూడా క్లోజైంది. దీంతో ఇక నుంచి ఇవి కూడా అదానీ ఖాతాల్లోనే భారీగా డబ్బులను జమ చేయనున్నాయి.

నేడు అదే టాటాల కిందకు జారి..

దేశాయ స్టాక్‌ మార్కెట్‌లో టాటా గ్రూప్‌ కంపెనీ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. తాజాగా అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ భారీ నష్టాలు చవిచూడటంతో ఒక్కసారిగా దాని మార్కెట్‌ విలువ మూడో స్థానానికి పడిపోయింది. హిండెన్ బర్గ్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. టాటా గ్రూప్ మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. దేశంలోనే రెండు అతిపెద్ద వ్యాపార సంస్థలైన టాటా, రిలయన్స్ జనవరి 25 నుంచి మార్కెట్
క్యాపిటలైజేషన్‌లో వరుసగా 2%, 4% నష్టపోగా, అదానీ ఏకంగా 51శాతం నష్టాలకు చవిచూసింది. ఈ నెల 10 నాటికి టాటా గ్రూప్ మార్కెట్ విలువ రూ. 21.1 లక్షల కోట్లకు చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్‌ విలువ దాదాపు రూ. 16 లక్షల కోట్లు ఉండగా.. అదానీ గ్రూప్‌ కంపెనీ విలువ రూ. 9.29 లక్షల కోట్లకు క్షీణించింది. టాటా గ్రూప్‌ అగ్రస్థానానికి చేరుకోగా అదానీ గ్రూప్‌ మూడో స్థానానికి పరిమితమైంది. 2022 ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూప్ కంపెనీలు మొత్తంగా 38% ఆదాయాన్ని సాధించగా, టాటాకు 25%, రిలయన్స్‌45% శాతం లాభాలను చవిచూశాయి. గతేడాది అంబుజా సిమెంట్స్, ఏసీసీని కొనుగోలు చేయడం ద్వారా టాటా గ్రూప్‌ వెనక్కినెట్టి అదానీ గ్రూప్‌ కంపెనీ టాప్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. ఐతే వరుస నష్టాల కారణంగా అదాని గ్రూప్ ప్రస్తుతం మూడో స్థానానికి పరిమితమైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.