Begin typing your search above and press return to search.

మమత మంత్రివర్గంలో 43మందికి చోటు

By:  Tupaki Desk   |   10 May 2021 9:41 AM GMT
మమత మంత్రివర్గంలో 43మందికి చోటు
X
పశ్చిమబెంగాల్ లో సీఎం మమత బెనర్జీ మంత్రివర్గం కొలువుదీరింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొత్త క్యాబినెట్‌లో 43 మంత్రులుగా చేరారు. కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో వీరితో గవర్నర్ ప్రమాణస్వీకారం చేశారు. పలువురు అనుభవజ్ఞులు, మరికొందరు కొత్త వారికి మమత తన మంత్రివర్గంలో చోటు కల్పించారు.

మొత్తం 43 మందిలో 19 మంది సహాయ మంత్రులు ఉన్నారు. కేబినెట్ పోస్ట్ దక్కిన వారిలో మమతా బెనర్జీ గత రెండు ప్రభుత్వాల్లో ఆర్థిక మంత్రిగా ఉన్న సీనియర్ నేత అమిత్ మిత్రా కూడా ఉన్నారు. అయితే, అనారోగ్య కారణాల రీత్యా ఈ సారి ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. ఉప ఎన్నిక ద్వారా అసెంబ్లీకి మిత్రాను తీసుకువచ్చే ఆలోచనలో మమతాబెనర్జీ ఉన్నారు.

కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో సుబ్రతా ముఖర్జీ, పార్థ ఛటర్జీ, ఫిర్హద్ హకీం, జ్యోతి ప్రియ మల్లిక్, ఎం.ఘటక్, అరూప్ బిస్వాస్, డాక్టర్ షశి పంజ, జావెద్ అహ్మద్ ఖాన్ ఉన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి హుమయూన్ కబీర్, బెంగాల్ మాజీ రంజీ కెప్టెన్ మనోజ్ తివారి, సియులి సాహా కొత్తగా క్యాబినెట్‌లోకి వచ్చారు. వీరు సహాయ మంత్రులుగా కేబినెట్‌లో చేరారు.

ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా బీజేపీ ఎమ్మెల్యే సువేందుకు అధికారి పేరును బీజేపీ ఖరారు చేసింది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ 77 స్థానాల్లో గెలుపొందింది. సీఎం మమతా బెనర్జీని ఓడించిన సువేందుకే బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేసింది.