Begin typing your search above and press return to search.

డబ్బు పొరపాటుగా వేరే ఖాతాకు బదిలీ చేశారా? మళ్లీ రివర్స్ కావాలంటే ఇలా చేయండి !

By:  Tupaki Desk   |   17 March 2021 1:30 AM GMT
డబ్బు పొరపాటుగా వేరే ఖాతాకు బదిలీ చేశారా? మళ్లీ రివర్స్ కావాలంటే ఇలా చేయండి !
X
గతంలో ఎవరికైనా డబ్బు ఇవ్వాలంటే బ్యాంకు బేరర్ చెక్ ఇచ్చే వాళ్లం. కానీ, నేడు అందరూ దాదాపుగా నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేస్తున్నాం. ఎన్ ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ మనీ ట్రాన్స్ ఫర్ సమయాల్లో ఒక్క డిజిట్ తేడా వచ్చినా నగదు వేరే వారి ఖాతాకు బదిలీ అయిపోతుంది. ఒకవేళ వేరే ఖాతాకు బదిలీ అయిపోతే పరిస్థితి ఏంటి, మన నగదు వెనక్కి వస్తుందా, నిబంధనలు ఏం చెబుతున్నాయి అనే విషయాలని చూద్దాం.

ఈ రోజుల్లో ఆన్‌లైన్ డబ్బు బదిలీలు సర్వసాధారణం అయిపోయాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ), పేటిఎమ్, నెట్ బ్యాంకింగ్, ఫోన్ పే, గూగుల్ పే వంటి ఎన్నో రకాల థర్డ్ పార్టీ నగదు లావాదేవీల యాప్స్ అందుబాటులోకి రావడంతో.. బ్యాంకులకు వెళ్లకుండానే జనాలు డబ్బును ఆన్‌ లైన్ ద్వారా ట్రాన్స్‌ ఫర్ చేస్తున్నారు. ఈ ఆన్ ‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలపై ప్రజలు ఎక్కువగా ఆధారపడుతున్నారు. అందులో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి.

ఉదాహరణకు, మీరు అనుకోకుండా డబ్బును వేరొకరి ఖాతాకు బదిలీ చేస్తే, ఆ నగదును మళ్లీ ఎలా తిరిగి పొందగలరు, ఆ మొత్తాన్ని తిరిగి మీ ఖాతాలోకి క్రెడిట్ చేసే అధికారం బ్యాంకుకు ఉందా, ఇలా పలు ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. తప్పుగా వేరే అకౌంట్‌లోకి క్రెడిట్ అయిన మొత్తాన్ని తిరిగి రివర్స్ చేసే అధికారం బ్యాంకులకు లేదు. ఎప్పుడైతే లబ్దిదారుడు. బాధితుడిపై దయతలిస్తే తప్ప, బ్యాంకులకు ఆ డబ్బును తిరిగి రివర్స్ చేసే అధికారం, అనుమతి లభించదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ట్రాన్సక్షన్లలో బ్యాంక్ కేవలం ఫెసిలిటేటర్ గా మాత్రమే పనిచేయగలదని బ్యాంక్ బజార్ డాట్ కామ్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు అధిల్ శెట్టి వెల్లడించినట్లు ఓ ప్రముఖ పోర్టల్ కథనాన్ని ప్రచురించింది.

పొరపాటున మీరు డబ్బును క్రెడిట్ చేయాల్సిన అకౌంట్ కాకుండా వేరే ఖాతాలోకి క్రెడిట్ చేస్తే.. తక్షణం మీ బ్యాంక్ కస్టమర్ కేర్ ‌కు కాల్ చేసి విషయాన్ని అంతా వివరించండి. లావాదేవీ జరిగిన ఖచ్చితమైన సమయం, తేదీతో పాటు, నగదు తప్పుగా బదిలీ అయిన ఖాతా నంబర్‌ను కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌కు చెప్పండి. దీనితో మీరు తప్పుగా ఎంటర్ చేసిన ఖాతాకు బదిలీ అయిన సొమ్ము 5-6 పనిదినాల్లో తిరిగి మీ అకౌంట్‌కు క్రెడిట్ అవుతుంది. ఒకవేళ అది జరగకపోతే.. మీరు మీ బ్యాంకును సంప్రదించి, తప్పుగా జరిగిన లావాదేవీల గురించి మేనేజర్‌కు తెలియజేయాలి. సదరు బ్యాంక్ డబ్బు బదిలీ అయిన లబ్ధిదారుడి వివరాలను తనిఖీ చేసి.. ఆ వ్యక్తికి అదే శాఖలో ఖాతా ఉంటే.. నగదు విషయమై అభ్యర్థిస్తుంది. కొన్నిసార్లు బ్యాంకులు ఇలాంటి లావాదేవీలను సెటిల్ చేయడానికి రెండు నెలల సమయాన్ని కూడా తీసుకుంటాయి. ఆ డబ్బును తిరిగి మీ ఖాతాలోకి క్రెడిట్ చేసుకోవడానికి 8-10 పనిదినాలు పడుతుంది. లేకపోతే, మీరు లావాదేవీని ఖచ్చితమైన బ్యాంక్ స్టేట్మెంట్, చిరునామా, ఐడి ప్రూఫ్ మొదలైన వాటితో నిరూపించాల్సి ఉంటుంది.

మీ ఖాతాకు వేరెవరో పొరపాటుగా నగదు జమ చేస్తే ఇవ్వడం, ఇవ్వకపోవడం అన్నది మీ ఇష్టమే. కానీ, పంపిన వారు కోర్టును ఆశ్రయిస్తే అప్పుడు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. జమ ఎవరి నుంచి, ఎందుకు వచ్చిందన్న వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సమర్పించలేకపోతే నగదును వెనక్కి తిరిగి ఇవ్వడంతోపాటు జైలు శిక్షను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. నగదు మీదే అని చెబితే ఆదాయపన్ను కట్టాల్సి ఉంటుంది. రూ.50వేలకు మించి నగదు లావాదేవీలపై ఆదాయపన్ను శాఖ యంత్రాంగం కన్నేసి ఉంచింది. వారు నోటీసు ఇస్తే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.