Begin typing your search above and press return to search.

ప్రీతి మృతి : కేటీఆర్ రావాలని తల్లిదండ్రుల ఆందోళన.. నిమ్స్ వద్ద ఉద్రిక్తత

By:  Tupaki Desk   |   26 Feb 2023 10:09 PM GMT
ప్రీతి మృతి : కేటీఆర్ రావాలని తల్లిదండ్రుల ఆందోళన.. నిమ్స్ వద్ద ఉద్రిక్తత
X
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థిని ప్రీతి ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం తుదిశ్వాస విడిచింది. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన ప్రీతిని మొదట ఎంజీఎంలో చికిత్స అందించారు. అనంతరం నిమ్స్ కు తరలించారు. తాజాగా నిమ్స్ లో ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు.

కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా మొదటి సంవత్సరం ‘ప్రీతి’ చదువుతోంది. ఆమె సీనియర్ పీజీ విద్యార్థి సైఫ్ కొన్నాళ్లుగా వేధిస్తుండడంతో హానికరమైన ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారస్తితిలోకి వెళ్లిపోయిన ప్రీతీని తొలుత వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించి అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. ఆమె ప్రాణాలు కాపాడేందుకు నిమ్స్ వైద్యులు చేసిన కృషి ఫలించలేదు. తాజాగా బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమెకు అమర్చిన పరికరాలు తీసేయడంతో మరణించింది.

-కేటీఆర్ రావాలని తల్లిదండ్రుల డిమాండ్

నిమ్స్ లో కన్నుమూసిన ప్రీతి మృతదేహా తరలింపునకు ఆమె తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు. ఆస్పత్రికి మంత్రి కేటీఆర్ వచ్చి తమ బిడ్డ మరణానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రాణంగా చూసుకున్న తమ బిడ్డ నేడు ప్రాణాలు కోల్పోయి అచేతనంగా పడి ఉండటాన్ని చూసి బాధిత కుటుంబం రోదిస్తున్న తీరు ఆస్పత్రిలో ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది.

-నిమ్స్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ నిమ్స్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రీతి కన్నుమూయడంతో ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. విద్యార్థి సంఘాలతోపాటు గిరిజన సంఘాలు, బీజేవైఎం శ్రేణులు ఆందోళనకు దిగాయి.దీంతో నిమ్స్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

ఇలాంటి ర్యాగింగ్ భూతానికి ఓ విద్యార్థిని బలి కావడం ఇప్పుడు తెలుగు నాట విషాదాన్ని నింపింది. ఈ విష సంస్కృతి కాలేజీల్లో లేకుండా చేసినప్పుడే ఈ మరణాలకు అడ్డుకట్ట పడే చాన్స్ ఉంటుంది.