Begin typing your search above and press return to search.

అక్క‌డ పోటీ!.. తండ్రీకూతుళ్ల మ‌ధ్యే!

By:  Tupaki Desk   |   21 March 2019 1:30 AM GMT
అక్క‌డ పోటీ!.. తండ్రీకూతుళ్ల మ‌ధ్యే!
X
ఎన్నిక‌లంటే ఎన్ని సిత్రాలు చూడాల్సి వ‌స్తుందో? ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కూడా రంగం సిద్ధ‌మైన వేళ‌... ఇలాంటి సిత్రాలు చాలానే చూడ‌నున్నాం. ఈ సిత్రాల్లో అస‌లు సిస‌లు సిత్రం... విశాఖ జిల్లా అర‌కు పార్ల‌మెంటుకు జ‌రిగే ఎన్నిక‌ల్లో కనిపించేదేన‌ని చెప్పాలి. ఎందుకంటే... ఇక్క‌డ ప్ర‌త్య‌ర్థులుగా నిలుస్తున్న‌ది తండ్రీకొడుకో - అన్నాత‌మ్ముళ్లో - బావాబామ‌రిదో - బంధువులో కాదు.... స్వ‌యానా తండ్రీకూతుళ్లే. ఇలాంటి పోటీ దాదాపుగా అరుద‌నే చెప్పాలి.

ప్ర‌స్తుతం అర‌కు టీడీపీ అభ్య‌ర్థిగా... మొన్న‌టిదాకా గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ లోనే కొన‌సాగి ఇటీవ‌లే టీడీపీలో చేరిన సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌ - కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్ర‌దేవ్ బ‌రిలోకి దిగిపోయారు. రాజ‌కీయాల్లో శ‌త్రువుల‌న్న మాటే ఎరుగ‌ని ఆజాత శ‌త్రువుగా ఉన్న వైరిచ‌ర్ల‌... ఈ ఎన్నిక‌ల్లో మంచి మైలేజీతోనే విజ‌యం సాధిస్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. అయితే అటు వైసీపీ కూడా కొత్త అభ్య‌ర్థిగా దివంగ‌త నేత‌ - క‌మ్యూనిస్టుల్లో అరుదైన వ్య‌క్తిగా పేరున్న దేమువు కుమార్తె గొడ్డేటి మాధ‌విని బ‌రిలోకి దించింది. మాధ‌వి కొత్త‌గా రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న నేప‌థ్యంలో ఆమె నుంచి పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న భావ‌న‌లో టీడీపీ ఉంది.

అయితే అటు వైరిచ‌ర్ల‌తో పాటు అటు టీడీపీకి షాకిస్తూ... కాంగ్రెస్ పార్టీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌న‌తోనే ఇంత ఎత్తుకు ఎదిగిన వైరిచ‌ర్ల స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ముందు ఇలా చేయిచ్చేస్తే ఎలాగ‌నుకుందో, ఏమో తెలియ‌దు గానీ... వైరిచ‌ర్ల‌కు ఆయ‌న కుటుంబం నుంచే ప్ర‌త్యర్థిని దించేసింది. వైరిచ‌ర్ల కుమార్తె శృతి దేవిని త‌మ అభ్యర్థిగా ప్ర‌కటించేసింది. ఈ మేర‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. వైరిచ‌ర్ల కంటే ముందుగానే శృతి నామినేష‌న్ వేసే అవ‌కాశాలూ లేకపోలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. క‌డుపున పుట్టిన కుమార్తెనే త‌నకు పోటీగా దిగితే ప‌రిస్థితి ఏమిట‌న్న విష‌యాన్ని అంత‌గా ప‌ట్టించుకోని వైరిచ‌ర్ల త‌న‌దైన శైలిలో ముందుకు సాగుతున్నారు. అంటే కూతురు కూతురే... పోటీ పోటీనే అన్న‌ట్టుగా. స‌రే... రెండు వేర్వేరు పార్టీల నుంచి తండ్రీకూతుళ్లు బ‌రిలోకి దిగుతున్న నేపథ్యంలో వారి ఓట్ల‌ను వారే చీల్చేసుకుంటే... మూడో అభ్య‌ర్థిగా వైసీపీ అభ్య‌ర్థి మాధ‌వి విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌కేన‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. మ‌రి ఈ ర‌స‌వ‌త్త‌ర పోరులో ఏం జ‌రుగుతుందో చూద్దాం.