Begin typing your search above and press return to search.

మార్గదర్శి మీద ఉండవల్లి సమరోత్సాహం

By:  Tupaki Desk   |   14 March 2023 6:37 PM GMT
మార్గదర్శి మీద ఉండవల్లి సమరోత్సాహం
X
మార్గదర్శి మీద కేసులు అంటే అందరి కంటే ముందు గుర్తుకు వచ్చే పేరు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఆయన 2004 నుంచి 2014దాకా ఉన్న టైం లో అప్పట్లో సీఎం గా ఉన్న వైఎస్సార్ అండతో మార్గదర్శిలో జరుగుతున్న అవతకతవకల మీద తొలిసారి ప్రపంచానికి చాటారు. దాని మీద ఆయన న్యాయ పోరాటం నేటికి పదిహేడేళ్లు అవుతున్నా ఎక్కడా తగ్గడంలేదు.

అయితే ఈ మధ్యలో ఉండవల్లి వర్సెస్ మార్గదర్శి కేసులో రామోజీరావుదే పై చేయి అయింది. ఉమ్మడి ఏపీలో ఈ కేసుని కొట్టివేశారు. ఆలస్యంగా ఆ విషయం తెలుసుకున్న ఉండవల్లి దాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. గత ఏడాది ఈ కేసులో ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ కావడంతో ఇపుడు ఉండవల్లి మరింత ఉత్సాహంతో ఈ కేసు మీద పోరాటం చేస్తున్నారు.

నిజానికి వైఎస్సార్ మరణానంతరం ఈ కేసు నత్తనడకగా సాగింది అని అంటారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఉండవల్లిది ఒంటరి పోరాటం అయింది. అయితే జగన్ సీఎం అయ్యాక మూడేళ్ళ పాటు ఈ కేసు విషయంలో పెద్దగా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు అని కూడా ప్రచారం సాగింది. అయితే ఎట్టకేలకు సుప్రీం కోర్టులో ఈ కేసు కీలక దశలో ఉండగా ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ కావడంతో అక్కడ వేగం పుంజుకుంది.

ఈ నేపధ్యంలో ఏపీలో కూడా మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద ప్రభుత్వం అక్రమాలు జరుగుతునాయని దాడులు చేయడంతో పాటు కేసులు కూడా నమోదు చేసింది. దీని మీద తెలంగాణా హై కోర్టుకు మార్గదర్శి నిర్వాహకులు వెళ్లారు. అయితే దీని మీద హై కోర్టు విచారణను వాయిదా వేసింది. ఇదిలా ఉండగా రాజమండ్రీలో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన ఉండవల్లి రామోజీరావు మారదర్శి విషయంలో చేస్తున్న అవతకతవకల మీద ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి కేసులు పెట్టడం మంచి పరిణామం అన్నారు.

ఈ కేసు విషయంలో అవసరమైన పూర్తి సమాచారం తాను ఏపీ సీఐడీ అధికారూలకు ఇస్తానని చెప్పారు. అవిభక్త కుటుంబం హెచ్ యూ ఎఫ్ పేరిట మార్గదర్శిలో చిట్స్ సేకరిస్తున్నారని ఆయన అన్నారు. మార్గదర్శిలో అనేక రకాలుగా చట్టవిరుద్ధమైన అక్రమాలు జరిగాయని ఆ వివరాలు మొత్తం తన దగ్గర ఉన్నాయని ఆయన చెప్పారు.

మార్గదర్శి చిట్ ఫండ్ యాక్ట్ 14 (2) ప్రకారం సేకరించిన మొత్తం నగదుని జాతీయ బ్యాంకులలో జమ చేయాలని, అలా కాకుండా వేరే వ్యాపారాలకు మళ్ళిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇక మార్గదర్శి ఫైనాన్షియర్స్ మీద తాను కేసు పెట్టే సమయానికి 1360 కోట్ల నష్టంలో ఉందని ఆయన వెల్లడించారు. మార్గదర్శిలో అవకతవకలు జరుగుతున్నాయని 2008లోనే నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వట్టి వసంత్ కుమార్ ఫిర్యాదు చేశారని ఉండవల్లి గుర్తు చేశారు.

మార్గదర్శి తాను చిట్స్ ద్వారా సేకరించిన మొత్తాలను అనేక సంస్థలలో పెట్టడం చట్ట విరుద్ధం అని ఆయన అన్నారు. ఈ కేసు విషయం ఇపుడు సుప్రీం కోర్టులో ఉందని, ఏప్రిల్ 11న అది విచారణకు వస్తోదని ఆయన చెబుతూ ఏపీ ప్రభుత్వం ఈ కేసులో తీసుకుంటున్న చర్యలు ఈ కేసులో జరుగుతున్న లేటెస్ట్ అప్ డేట్స్ అన్నీ కూడా సుప్రీం కోర్టుకు తాను తెలియచేస్తాను అని ఆయన అన్నారు.

అంతే కాదు మార్గదర్శి చిట్ ఫండ్స్ లో జరుగుతున్న చట్ట విరుద్ధమైన కార్యకలాపాలన మీద ఎంఫోర్స్ డైరెక్టరేట్ తో సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఎన్నో అవకతవకలు ఉన్నందున ఈ కేసుని సీరియస్ గానే ప్రభుత్వాలు చూడాలని, దీని మీద ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని ఆయన సూచించారు.

మొత్తానికి మార్గదర్శి కేసు విషయంలో ఆనాడు వైఎస్సార్ మాదిరిగా నేడు జగన్ దూకుడు గా ముందుకు సాగుతున్నారు. అదే టైం లో ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే ఈ కేసుని నాటి నుంచి నేటి దాకా న్యాయపరమైన పోరాటం చేస్తూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

ఈ సందర్భంగా ఉండవల్లి ఒక్కటే మాట అంటున్నారు. దేశంలోని చట్టాలు, కోర్టులు సామాన్యుడికి అయినా రామోజీరావుకు అయినా ఒక్కటే అని. ఆయన తప్పు చేస్తే ఎందుకు వదిలేయాలని. ఈ విషయంలో తాను తప్పు చేయలేదు అని రామోజీరావు ముందుకొచ్చి చెబితే తాను దేనికైనా సిద్ధమని ఉండవల్లి సవాల్ చేస్తున్నారు. మరి ఈ కేసు పురగోతి ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.