Begin typing your search above and press return to search.

పవన్ పై వాలంటీర్ల వేరేలెవెల్ ఫైర్... విశ్లేషకులు అభిప్రాయం ఇదే!

By:  Tupaki Desk   |   10 July 2023 2:11 PM GMT
పవన్ పై వాలంటీర్ల వేరేలెవెల్ ఫైర్... విశ్లేషకులు అభిప్రాయం ఇదే!
X
"ఎద్దులా ఎదిగావ్.. ఇంతవరకూ బుద్ధి రాలేదు.. ఇకముందు వస్తుందో రాదో తెలీదు..." ఇది 'బద్రి' సినిమాలో పవన్ కళ్యాణ్ బ్రహ్మానందంతో పలికిన డైలాగ్! దీంతో ఇన్నేళ్లకు అదే డైలాగ్ సరిగ్గా సరిపోయేలా తన ప్రవర్తన దిగజారింది అని పవన్ ని ఉద్దేశించి ఏపీ వాలంటీర్లు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఏపీ వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు రియాక్షన్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు.

ఇదే సమయంలో వారం రోజుల కోసారి వారాహి యాత్రకు విరామం ఇచ్చి.. ఎక్కడెక్కడో స్క్రిప్ట్ తెచ్చుకుని.. ఎక్కడలేని హుషార్ తెచ్చుకుని.. సోయి లేకుండా మాట్లాడుతు.. నిరాధారమైన ఆరోపణలు నోటికివచ్చినట్లు మాట్లాడడంలో పవన్ కళ్యాణ్ ఒక బ్రాండ్‌ గా మారిపోయారని ఈ సందర్భంగా కొంతమంది ప్రజానికం అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది.

వాస్తవాలు మాట్లాడుకోవాలంటే... కోవిడ్ దెబ్బకి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వణికిపోతున్న సమయంలో ఏపీలో వైఎస్ జగన్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన వాలంటీర్ల వ్యవస్థ చేసిన సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని అంటుంటారు సామాన్య ప్రజానికం. పైగా వాలంటీర్ల సేవలు ప్రత్యక్షంగా పొందిన వారు ఈ విషయాలు మరింత బలంగా నొక్కి చెబుతారు.

అదే సమయంలో ఇంటింటికి తిరిగి కోవిడ్ రోగులను గుర్తించి మందులు అందించడం, సేవలు చేయడంలో వాలంటీర్లు చేసిన పరిచర్య చిన్న విషయం కాదనేది అంతా చెప్పే మాట! ఇదే సమయంలో జగన్ అందిస్తున్న ప్రతీ సంక్షేమ పథకాన్ని.. మరి ముఖ్యంగా రేషన్, పెన్షన్ లతోపాటు గ్రామ సచివాలయాలు అందించే ప్రతీ సేవను ఇంటిముందుకు తేవడంలో వాలంటీర్ల పాత్ర అజరామరం అనేది అధికంగా వినిపించే ప్రశంస.

దీంతో ఈ వ్యవస్థపై దేశవ్యాప్తంగా అభినందనలు వస్తున్నాయంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఉదాహరణకు కేరళ తో పాటు చాలా రాష్ట్రాలు ఆంధ్ర మోడల్ ను గుర్తించి వారి వారి రాష్ట్రాల్లో కూడా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చే దిశగా అధ్యయనాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇలాంటి వాలంటీర్లపై పవన్ కల్యాణ్ నిరాధార ఆరోపణలు చేశారని.. అది పూర్తిగా హేయమైన చర్య అని ఏపీ ప్రజానికం దుయ్యబడుతున్నారని తెలుస్తుంది.

ఇదే సమయంలో వాలంటీర్ల పేరెంట్స్ పవన్ వ్యాఖ్యలపై మరింతగా దుమ్మెత్తి పోస్తున్నారని అంటున్నారు. అదేవిధంగా... ప్రతినెలా ఒకటో తేదీ ఉదయాన్నే పెన్షన్ తీసుకునే వృద్ధులను ఈ విషయం గురించి ప్రస్థావించినప్పుడు... పవన్ ని నోటికొచ్చినట్లు తిడుతున్నారని తెలుస్తుంది. పవన్ తన రాజకీయ ప్రయోజనాలకోసం ఇలా వాలంటీర్లపై పడి ఏడ్వడం సరైంది కాదని అవ్వాతాతలు అంటున్నారని సమాచారం.

ఇదే సమయంలో వాలంటీర్లలో సుమారు 70% వరకూ మహిళలే ఉన్న విషయం కూడా గ్రహించలేని పవన్ కల్యాణ్... ఆ మహిళా వాలంటీర్ల ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడారని ఫైరవుతున్నారు! ఈ సందర్భంగా రెండు లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కి... తాను చదివిన పుస్తకాల్లో ఎక్కడా సభ్యతా, సంస్కారం అనే పదాలు లేవా అని మహిళా వాలంటీర్లు ప్రశ్నిస్తున్నారని తెలుస్తుంది.

గతంలో... వాలంటీర్లను కూలీలు, గోనెసంచుల మోసేవాళ్ళు అంటూ హేళనగా మాట్లాడిన చంద్రబాబు ఇప్పటికే బుద్ధితెచ్చుకుని తమ ప్రభుత్వం వచ్చినా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం అని చెప్పారని అంటూ గుర్తుచేస్తున్న వాలంటీర్లు... చంద్రబాబుకు, లోకేష్ కు ఉన్నపాటి జ్ఞానం కూడా పవన్ కు లేకుండా పోయిందని ఎద్దేవా చేస్తున్నారని సమాచారం.

హైదరాబాద్ లో కాపురం.. రెగ్యులర్ గా షూటింగులు.. విరామం దొరికినప్పుడు ఏపీకి పర్యటనలు చేస్తూ జీవనం సాగిస్తున్న పవన్... విజయవంతంగా నడుస్తూ, ప్రజల ఆధరాభిమానాలు చూరగొంటున్న వ్యవస్థలపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరైన చర్య కాదని పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు!

ఇదే సమయంలో "మీలాంటి పార్ట్ టైం గాళ్ళను ఎక్కడ పెట్టాలో జనానికి బాగా తెలుసు.. అందుకే రెండుచోట్లా ఓడగొట్టి మూల కూర్చోబెట్టారు.. అయినా బుద్ధిరాలేదు.. వస్తుందో లేదో తెలీదు.. మధ్యలో కేంద్ర ఇంటలిజెన్స్ పేరు ఎందుకు" అంటూ మరికొంతమంది వాలంటీర్లు ఫైరవుతున్నారని తెలుస్తుంది.

ఇదే క్రమంలో కేంద్ర నిఘా సంస్థలు వారు చేసే పనులు, కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తెలియకుండా జరుగుతాయని.. చెప్పాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు చెబుతారు కానీ... వార్డ్ మెంబర్ గా కూడా గెలవని పవన్ కు ఎలా చెబుతారు అని మరికొంతమంది వాలంటీర్లు ప్రశ్నిస్తున్నారు.

ఈ విధంగా తీవ్రస్థాయిలో పవన్ పై ఫైరవుతున్న వాలంటీర్లు, వారి తరుపున నిలబడ్డ ఏపీ ప్రజానికం... "గోదావరి జిల్లాల్లో ఇష్టానుసారం మాట్లాడి ఎక్కువ ప్యాకేజి తెచ్చుకోవాలని కోరుకుంటున్నట్లున్నావ్.. కానీ అది జరగదు. మళ్ళీ నువ్వు ఎక్కడ నుంచి పోటీ చేసినా 2019 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయి.. అది మా బాధ్యత.." అని పవన్ కు గతం గుర్తుచేస్తూ భవిష్యత్త్ కు సంబంధించి హెచ్చరికలు చేస్తున్నారని తెలుస్తుంది.

ఇలా ఈ స్థాయిలో పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాలంటీర్లు, వారి కుటుంబ సభ్యులు, వాలంటీర్ల తరుపున నిలబడుతున్న ప్రజలు... "ప్యాకేజీ డబ్బులు కావాలంటే చంద్రబాబుతో పెట్టుకో.. దెబ్బలే కావాలనుకుంటే తమతో పెట్టుకో" అనే స్థాయిలో వార్నింగులు ఇస్తుండటం గమనార్హం. దీంతో... పవన్ క్షమాపణలు చెప్పేవారకూ ఈ వ్యవహారం సద్దుమణిగేలా లేదని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు!