Begin typing your search above and press return to search.

తొందరలోనే విశాఖకు 'రాజధాని’ తరలటం ఖాయమేనా ?

By:  Tupaki Desk   |   21 Dec 2020 7:30 AM GMT
తొందరలోనే విశాఖకు రాజధాని’ తరలటం ఖాయమేనా ?
X
అధికారపార్టీ దూకుడు చూస్తుంటే తొందరలోనే పరిపాలనా రాజధాని విశాఖపట్నంకు తరలిపోవటం ఖాయమనే అనిపిస్తోంది. కోర్టు కేసులు, వివాదాలు, అమరావతి పేరుతో జరుగుతున్న ఉద్యమం అన్నంటి మధ్య ప్రభుత్వం మాత్రం తనపని తాను చేసుకుని పోతున్నట్లే ఉంది. ఎవరెంత వ్యతిరేకించినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి నుండి పరిపాలనా రాజధాని విశాఖకు తరలిపోవటానికి ఎంతోకాలం పట్టేట్లు లేదు. తాజగా వైసీపీ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి ప్రకటన చేసిన తీరే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.

విశాఖలో పరిపాలనా రాజధాని రాబోతోందని, వివిధ ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వ స్ధలాలనే ఉపయోగించబోతున్నట్లు స్పష్టంగా ప్రకటించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించినవారు ఎంత పెద్దవారైనా వాళ్ళని వదిలిపెట్టేది లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎంపి చేసిన ప్రకటన చూసిన తర్వాత ఓ విషయం స్పష్టమైపోతోంది. అదేమటంటే ప్రభుత్వ శాఖల ఏర్పాటుకు చాలా భూములు అవసరం అవుతాయి. ఆ భూమిని ప్రైవేటు వ్యక్తుల నుండి సేకరించేబదులు ఆక్రమణలను తొలగిస్తే సరిపోతుందని నిర్ణయించినట్లుంది.

టీడీపీ హయాంలో మాజీమంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు భీమిలీ, రుషికొండ, వైజాగ్-గాజువాక తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వందల ఎకరాలను కబ్జా చేశారనే ఆరోపణలున్నాయి. వాటిని మండలాలు, గ్రామాల వారీగా లెక్కలు తీసిన వైసీపీ ప్రభుత్వం ఇపుడు తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. దీని వల్ల కబ్జా చెరనుండి విడిపించిన భూములను ప్రభుత్వ నిర్మాణాలకు ఉపయోగించబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే కొన్ని వందల ఎకరాలను ఇలా కబ్జాల నుండి విడిపించింది. ప్రభుత్వ భూమే అందుబాటులోకి వచ్చింది కాబట్టి ప్రైవేటుభూములను కొనాల్సిన అవసరం లేదు. గీతం యూనివర్సిటి, సబ్బంహరి, వెలగపూడి రామకృష్ణబాబు, పీలా గోవింద సత్యనారాయణతో పాటు అనేక మంది టీడీపీ నేతల చెరలో ఉన్న భూములను ప్రభుత్వం యుద్దప్రాతిపదికను విడిపిస్తోంది. ఇదే విషయమై ప్రభుత్వం నియమించిన సిట్ నివేదిక ప్రభుత్వానికి అందితే మరిన్ని కబ్జాల వివరాలు అందటం, వాటిని కూడా తిరిగి స్వాదీనం చేసుకోవటం ఖాయం.