Begin typing your search above and press return to search.

విశాఖ విమానాశ్ర‌యానికి మూత‌.. ఆ విమానాశ్ర‌యానికి గ్రీన్ సిగ్న‌ల్!

By:  Tupaki Desk   |   5 Sep 2022 10:32 AM GMT
విశాఖ విమానాశ్ర‌యానికి మూత‌.. ఆ విమానాశ్ర‌యానికి గ్రీన్ సిగ్న‌ల్!
X
ఇప్పటిదాకా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్య విమానాశ్ర‌యాల్లో ఒక‌టిగా ఉన్న విశాఖ‌ప‌ట్నం విమానాశ్ర‌యం ఇక మూసివేత‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ మేర‌కు విశాఖ విమానాశ్రయాన్ని విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురానికి తరలించడానికి భారత నౌకాదళం అధికారులు అంగీకరించారు. దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై నౌకాదళం, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) అధికారులు ఇటీవల ఢిల్లీలో సంతకాలు చేసిన సంగ‌తి తెలిసిందే.

అదేవిధంగా భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి సేకరించిన భూములపై ఉన్న కోర్టు కేసుల విచారణ కూడా తుది దశకు చేరింద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో త్వరలో తీర్పు రానుంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో అన్ని అడ్డంకులను అధిగమించి భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపనకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే శంకుస్థాపన చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

కాగా విశాఖప‌ట్నం విమానాశ్రయాన్ని మూసేయడంపై నౌకాదళ అధికారులతో రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్‌) గ‌త కొన్ని ఏళ్లుగా సంప్రదింపులు జరుపుతూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించకుండా భోగాపురంలో విమానాశ్రయాన్ని నిర్మించి ప్రయోజనం లేదని ఏపీఏడీసీఎల్ భావించ‌డ‌మే ఇందుకు కార‌ణం. నగరానికి సమీపంలో ఉన్న విమానాశ్రయాన్ని వినియోగించడానికే ప్రజలు ఆసక్తి చూపుతార‌నేది ఏసీఏడీసీఎల్ భావ‌న‌గా చెబుతున్నారు. రూ.కోట్లు వెచ్చించి కొత్తది నిర్మించినా ప్రయాణికులు రార‌ని అంచ‌నా వేస్తోంది.

అయితే విశాఖ‌ప‌ట్నంలో తూర్పు నౌకాద‌ళం ప్ర‌ధాన కేంద్రం ఉండ‌టంతో దాని భద్రత దృష్ట్యా విశాఖ విమానాశ్రయం విస్తరణ సాధ్యమవడం లేద‌ని అంటున్నారు. దీంతో సేవలను పెంచేందుకు భోగాపురం విమానాశ్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

కాగా విశాఖ విమానాశ్రయం 300 ఎకరాలలో విస్త‌రించి ఉంది. ఇందులో 170 ఎకరాలను నౌకాదళానికి కేటాయించేలా మౌలిక అవ‌గాహ‌న ఒప్పందం (ఎంవోయూ)లో నిబంధన చేర్చారు. మిగిలిన 130 ఎకరాలను ఏంవోయూ నిబంధనల మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి అప్పగించనున్నారు. మరోవైపు భోగాపురంలో నిర్మాణానికి మరో 28 ఎకరాలను మాత్రమే సేకరించాల్సి ఉంద‌ని చెబుతున్నారు. దీనిపై ఉన్న కోర్టు కేసుల్లో విచారణ పూర్తయి తీర్పు రిజర్వులో ఉంది. త్వ‌రలో తీర్పు రానుంద‌ని అంటున్నారు.

కాబట్టి త్వరలో భూమి పూజ నిర్వహించనున్నార‌ని తెలుస్తోంది. గ‌త టీడీపీ ప్ర‌భుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి స‌మ‌గ్ర పూర్తి నివేదిక (డీపీఆర్‌)ను సిద్ధం చేసి భూసేకరణ పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే. అప్పట్లో వైఎస్సార్సీపీ ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ప్రజలతో కలిసి విమానాశ్రయానికి వ్యతిరేకంగా ఆందోళనకు కూడా దిగ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు మాత్రం భోగాపురం విమానాశ్ర‌యానికి సై అంటోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.