Begin typing your search above and press return to search.

విజయవాడ ఎంపీ టికెట్‌ నాకే.. ఎంపీ సోదరుడు కీలక వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   19 April 2023 3:14 PM GMT
విజయవాడ ఎంపీ టికెట్‌ నాకే.. ఎంపీ సోదరుడు కీలక వ్యాఖ్యలు!
X
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని గత కొంత కాలంగా టీడీపీ అధిష్టానంపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలుమార్లు కేశినేని నాని వ్యవహారం టీడీపీలో హాట్‌ టాపిక్‌ గా మారింది. ఆయనపై టీడీపీ అధిష్టానం వేటు వేస్తుందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పని చేయలేదు. కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని (శివనాథ్‌)ని ప్రోత్సహిస్తున్నారు.

మరోవైపు కేశినేని నాని తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని పలుమార్లు ప్రకటించారు. అయితే తన సోదరుడు పేరు ఎత్తకుండా పరోక్షంగా అతడికి మాత్రం సీటు వద్దని అన్నారు. అన్నదమ్ముల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే.

కాగా హైదరాబాద్‌ లో వ్యాపారాలు చేసుకుంటూ ఉండే చిన్ని ఇటీవల కాలంలో తన జోరు పెంచారు. విజయవాడలోనే ఎక్కువ రోజులు గడుపుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ వస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి కేశినేని చిన్నినే ఎంపీగా పోటీ చేస్తారని టాక్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేశినేని నాని అప్పట్లోనే తన సోదరుడు పేరు ఎత్తకుండా ఘాటు విమర్శలు చేశారు. ఎవరికి టికెట్‌ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని తన సోదరుడు చిన్నికి మాత్రం ఇవ్వవద్దన్నారు.

మరోవైపు కేశినేని చిన్ని టీడీపీ అధిష్టానం అండతో విజయవాడ లోక్‌ సభ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. అధికార వైసీపీ.. 'జగనన్నే మా భవిష్యత్తు', 'మా నమ్మకం నువ్వే జగన్‌' అంటూ నినాదాలు రాసిన స్టిక్కర్లను రాష్ట్రమంతా వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జులు ఇంటింటికీ తిరిగి అతికిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి పోటీగా టీడీపీ మరో కార్యక్రమం చేపట్టింది. 'సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి' అనే స్టిక్కర్‌ను అతికిస్తున్నారు. అయితే ఈ స్టిక్కర్లు ఏర్పాటు చేసింది ఎంపీ కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని కావడం విశేషం. ఈ స్టిక్కర్లపైన కేవలం తన ఫొటోను, చంద్రబాబు ఫొటోను, ఎన్టీఆర్, లోకేష్, అచ్చెన్నాయుడు, స్థానిక టీడీపీ నియోజకవర్గ ఇంచార్జుల ఫొటోలను మాత్రమే ఆయన వేశారు. స్థానిక ఎంపీ అయిన కేశినేని నాని ఫొటో ఎక్కడా ఈ స్టిక్కర్లపైన లేకపోవడం గమనార్హం.

కేశినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జిల్లాలో అన్న క్యాంటీన్లు, వైద్య శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాలు చేపడుతున్న కేశినేని చిన్ని ఈ స్టిక్కర్లపై కేశినేని నాని ఫొటోలు లేకుండా చేయడం గమనార్హం. దీంతో కేశినేని సోదరుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని చెబుతున్నారు.

నేపథ్యంలో కేశినేని చిన్ని చేపడుతున్న కార్యక్రమాలు చర్చకు దారి తీస్తున్నాయి. విజయవాడ ఎంపీ అయిన తన సోదరుడు నాని ఫొటో ఎక్కడా ఉండటం లేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జి కేశినేని నాని ఉన్నారు. అయితే అక్కడ అంటించే స్టిక్కర్లపై బుద్దా వెంకన్న, నాగుల్‌ మీరా చిత్రాలు వేశారు. అలాగే జగ్గయ్యపేటలో శ్రీరాం తాతయ్య, నందిగామలో తంగిరాల సౌమ్య, మైలవరంలో దేవినేని ఉమా, తిరువూరులో శావల దేవదత్, విజయవాడ సెంట్రల్‌ లో బోండా ఉమా, తూర్పులో గద్దె రామ్మోహన్‌ చిత్రాలను కేశినేని చిన్ని స్టిక్కర్లపై ముద్రించడం గమనార్హం.

వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టిక్కెట్‌ చిన్ని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్‌ లు తనకే టికెట్‌ కేటాయించారంటూ ఆయన తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనకు టికెట్‌ ఇస్తే తాను పోటీ చేస్తానని.. లేదంటే ఎవరు పోటీ చేసినా తనకు అభ్యంతరం లేదని కేశినేని చిన్ని తెలిపారు. టీడీపీ అభ్యర్థి ఎవరయినా తాను గెలుపుకు పాటుపడతానని తెలిపారు.

ఈ నేపథ్యంలో కేశినేని నాని టీడీపీ నుంచి అవుట్‌ అయినట్టేనని చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కేశినేని చిన్నికే టికెట్‌ ఖాయమనే ప్రచారం సాగుతోంది. చంద్రబాబు, లోకేష్‌ ల నుంచి ఈ మేరకు హామీ ఉండబట్టే కేశినేని చిన్ని ఈ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు.