Begin typing your search above and press return to search.

పవన్ కు సూటిప్రశ్న వేసిన విజయసాయి

By:  Tupaki Desk   |   4 Dec 2019 5:34 AM GMT
పవన్ కు సూటిప్రశ్న వేసిన విజయసాయి
X
సోషల్ మీడియాతో యాక్టివ్ గా ఉంటూ పలు అంశాల మీద తన అభిప్రాయాల్ని విస్పష్టంగా వెల్లడిస్తుంటారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. హైదరాబాద్ శివారులో దిశా ఉదంతంపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దిశా నిందితులు పోలీస్ స్టేషన్లో ఉన్న వేళ.. ఎవరి ప్రోద్బలం లేకుండానే సామాన్యులు వేలాదిగా నిరసన వ్యక్తం చేయటం.. తమకు పది నిమిషాలు టైమిస్తే చాలంటూ నలుగురు దుర్మార్గుల విషయంలో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే.

దిశ ఉదంతంలో నిందితులకు ఉరి వేయాలని.. కాల్చేయాలని.. బహిరంగంగా ఊరిశిక్షఅమలు చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటివేళ.. ఈ వాదనలకు భిన్నమైన వాదనను వినిపించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు విజయసాయి.

రేపిస్టులకు ఉరి ఎలా వేస్తారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. దారుణమైన నేరాలకు పాల్పడిన వారికి ఉరి వేయటం ఎలా? అని ప్రశ్నించిన పవన్ తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఇలాంటివేళ.. విజయసాయి ఈ అంశం మీద స్పందించారు.

రేపిస్టులకు ఉరిశిక్ష ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నాడంటే మానసిక స్థితి ఏదో సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నట్లే.. దేశమంతా కఠినంగా శిక్షించాలని కళ్లనీళ్లు పెట్టుకుంటుంటే.. పవన్ కు మాత్రం రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమైపోయాయా? అని ప్రశ్నించారు. పవనిజం అంటే ఇదేనేమో? అంటూ సందేహాన్ని వ్యక్తం చేసిన విజయసాయి.. రాజకీయ పార్టీ పెట్టింది ఇలాంటి డిమాండ్ల కోసమేనా? అంటూ విరుచుకుపడ్డారు. పవన్ పై విజయసాయి చేసిన ట్వీట్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకోవటంతో పాటు.. వైరల్ గా మారుతున్నాయి.