Begin typing your search above and press return to search.

వైజాగ్ సమ్మిట్...ఆయన లోటు స్పష్టం

By:  Tupaki Desk   |   6 March 2023 5:00 AM GMT
వైజాగ్ సమ్మిట్...ఆయన లోటు స్పష్టం
X
విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వైసీపీ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించింది. సమ్మిట్ కి దిగ్గజ పారిశ్రామికవేత్తలు వచ్చారు. పదమూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. ఒక విధంగా వైసీపీ ప్రభుత్వానికి బూస్టింగ్ ఇచ్చే లాంటి వార్త ఇది. ఈ నేపధ్యంలో సమ్మిట్ హిట్ అనే అంతా అంటున్నారు కానీ సభ నిర్వహణ మాత్రం ఫ్లాప్ అని చెప్పేస్తున్నారు.

సమ్మిట్ అన్నది ఇంటర్నేషనల్ లెవెల్ లో డిజైన్ చేశారు. కానీ అక్కడ భోజనాల ఏర్పాట్లు సరిగ్గా లేవు. ఎక్కడక్కడ నుంచో వచ్చిన డెలిగేట్స్ కి కూర్చునేందుకు సరైన సదుపాయాలు లేవు. ఫ్రీ రిజిస్ట్రేషన్ చేశారు. దాని వల్ల వారంతా పోలోమంటూ అక్కడకు వచ్చి ఆక్రమించేశారు. ఏయూకి చెందిన విద్యార్ధులే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు.

దీంతో డెలిగేట్స్ పడరాని పాట్లు పడ్డారు. సాయంత్రం అవుతూంతే గిఫ్టు బాక్సుల గోల స్టార్ట్ అయింది. దాని కోసం అంతా వచ్చి రచ్చ చేశారు ఈ నేపధ్యంలో అసలు వారికి ఏమీ దక్కకుండా పోయింది. ఇవేమి ఏర్పాట్లు అంటూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు విసుక్కోవడం జరిగింది. చాలా మంది ఫైర్ అయ్యారు కూడా.

నిజానికి వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఏపీ ప్రభుత్వం ఇంత పెద్ద సదస్సుని నిర్వహించింది. కానీ దాన్ని సవ్యంగా నిర్వహించి నిభాయించే నాయకత్వం లేకపోవడం వల్లనే ఈ దుస్థితి దాపురించింది అని అంటున్నారు. ప్రభుత్వానికి డబ్బు వదిలింది కానీ అప్రతిష్ట మాత్రం వచ్చింది అంటే దానికి నిర్వహణ లోపమే ప్రధాన కారణం అని అంటున్నారు.

ఇక గతంలో ఎన్నో సదస్సులను కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం నిర్వహించింది. విశాఖలో అవన్నీ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. పార్టీ పరంగా కూడా అనేక పెద్ద కార్యక్రమాలను అలవోకగా వైసీపీ చేసింది. అంతవరకూ ఎందుకు గత ఏడాది నవంబర్ లో ప్రధాని నరేంద్ర మోడీ సభ ఏయూ గ్రౌడ్స్ లో జరిగింది. దాని కోసం వారం పది రోజుల ముందు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖకు వచ్చి మొత్తం అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. చిన్న మాట కూడా ఎవరూ అనకుండా సభను నిర్వహించిన తీరు ఆయనకే చెల్లింది అని అంటారు.

అదొక్కటే కాదు, ఎన్నో కార్యక్రమాలను విజయసాయిరెడ్డి దగ్గరుండి నిర్వహించారు. ఇపుడు ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహిస్తూ అందులో ప్రభుత్వ ప్రతిష్ట ముడిపడి ఉన్న నేపధ్యంలో విజయసాయిరెడ్డికి బాధ్యతలు అప్పగించలేదా లేక ఆయన దూరంగా ఉన్నారా అన్నది తెలియదు కానీ ఆయన జస్ట్ ఒక అతిధి మాదిరిగా వచ్చి వెళ్ళిపోయారు. ఆయన కనుక మొత్తం సమ్మిట్ బాధ్యతలను భుజానికి ఎత్తుకుంటే కచ్చితంగా వేరే లెవెల్ లో ఉండేదని అంటున్నారు.

ఎవరికి ఎలా మర్యాద చేయాలో ఏ విధంగా సభను నిర్వహించాలో అన్నీ ఆయనకు తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు అనే అంటారు. ఇక విజయసాయిరెడ్డి సామాన్య నాయకుడు కారు. ఆయన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, మేధావు, ఆయనకు సదస్సుకు వచ్చిన వారిలో అత్యధికులైన కార్పోరేటర్లు బాగా తెలుసు. మంచి పరిచయాలు ఉన్నాయి. అయినా ఆయన సాయం తీసుకోకపోవడం వల్ల చివరికి ప్రభుత్వం అభాసు అయింది అనే అంటున్నారు.

అంతా అధికారుల మీద భారం వేయడంతో పాటు మంత్రి గుడివాడ అమరనాధ్ సరిగ్గా ఇంత పెద్ద సమ్మిట్ ని ఆర్గనైజ్ చేయడంలో ఫెయిల్ అయ్యారనే విమర్శలు వస్తుననయి. ఆయన ఎంతసేపూ ఫోటో సెషన్ కి అటెండ్ కావడంతో పాటు, మీడియా ముందుకు వచ్చి విపక్షాలను విమర్శించడంతోనే సమయం గడిపారు తప్ప సదస్సు ఎలా సాగుతోంది అన్న దాని మీద ఆయన ఏమీ ఫోకస్ చేయలేకపోయారు అని అంటున్నారు.

దాంతో ఎక్కడెక్కడ నుంచో సదస్సుకు వచ్చిన డెలిగేట్స్ కి మాత్రం ఆకలి అలసట మిగిలాయి. దంతో పాటు ఏపీ మీద కూడా ఒక రకమైన అభిప్రాయం ఏర్పడింది అంటే అది పూర్తిగా నిర్వహణాలోపమే అని అంటున్నారు. మొత్తానికి ఇన్నేళ్ల వైసీపీ ప్రయాణంలో విజయసాయిరెడ్డి లేకుండా చేసిన ఈ భారీ ఈవెంట్ ఇంతలా విమర్శల పాలు అయిందంటే ఆయన లేని లోటే అంటున్నారు. ఇది ఆయన నిర్వహణా సామర్థ్యాన్ని వ్యతిరేకులు సైతం ఒప్పుకుంటారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.