Begin typing your search above and press return to search.

పీజేఆర్‌ పైన గెలిచిన సీబీఐ మాజీ డైరెక్టర్‌ విజయరామారావు ఇకలేరు!

By:  Tupaki Desk   |   14 March 2023 10:22 AM GMT
పీజేఆర్‌ పైన గెలిచిన సీబీఐ మాజీ డైరెక్టర్‌ విజయరామారావు ఇకలేరు!
X
సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి విజయరామారావు అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన వయసు 85. విజయ రామారావుకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. మార్చి 13 రాత్రి 7 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు.

కాగా విజయరామారావు ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. 1999 ఎన్నికల్లో హైదరాబాద్‌ నగరంలోని ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున విజయరామారావు పోటీ చేసి విజయం సాధించారు. అంతేకాకుండా చంద్రబాబు ప్రభుత్వంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌పార్టీ సీనియర్‌ లీడర్, ప్రజల్లో మాస్‌ లీడర్‌ గా గుర్తింపు పొందిన పి. జనార్దన్‌ రెడ్డి (పీజేఆర్‌) ను ఆయన ఓడించి సంచలనం సృష్టించారు.

భూకబ్జాదారుడిపై ఒక సిన్సియర్‌ అధికారిగా పనిచేసిన వ్యక్తిని పోటీకి నిలుపుతున్నానని.. ఆయనను గెలిపించాలని చంద్రబాబు అప్పట్లో పిలుపునిచ్చారు. దీంతో అప్పటివరకు ఒక్కసారి కూడా ఎన్నికల్లో ఓడిపోని పీజీఆర్‌.. విజయ రామారావు ఓడిపోవాల్సి వచ్చింది. 2004లో పీజేఆర్‌.. విజయరామారావును ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్‌ చేతిలో విజయ రామారావు ఓడిపోయారు.

కాగా విజయరామారావు వరంగల్‌ జిల్లా ఏటూరునాగారంలో జన్మించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కొంతకాలం విద్యనభ్యసించారు. మద్రాసు యూనివర్శిటీలో బీఏ పూర్తి చేశారు. 1958లో ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. 1959లో ఐపీఎస్‌ కు ఎంపికై వివిధ హోదాల్లో పనిచేశారు. 1984లో ఎన్టీఆర్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడినప్పుడు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ విజయరామారావే.

విజయ రామారావు సీబీఐ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆయన హవాలా, బాబ్రీ మసీదు కేసు, ముంబై బాంబు పేలుళ్ల కేసు వంటి అనేక ప్రముఖ కేసులను విచారించారు.

విజయ రామారావు సర్వీసులో ఉండగానే ఎల్‌ఎల్‌బి కోర్సు పూర్తి చేశారు. ఆ తర్వాత సర్వీసుల నుంచి పదవీ విరమణ చేసి 'పోలీస్‌ మాన్యువల్‌' అనే పుస్తకాన్ని రచించారు.

రాష్ట్ర విభజన తర్వాత టీఆర్‌ఎస్‌ లో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.