Begin typing your search above and press return to search.

'విజయగర్జన'.. సభ పేరు మార్చుకోవాల్సిన టైం వచ్చిందా?

By:  Tupaki Desk   |   7 Nov 2021 11:30 AM GMT
విజయగర్జన.. సభ పేరు మార్చుకోవాల్సిన టైం వచ్చిందా?
X
కొన్ని సార్లు ఎంత మౌనంగా ఉంటారో.. మరికొన్ని సార్లు అంతకు మించిన హడావుడి చేస్తుంటారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వరుస పెట్టి కార్యక్రమాల్ని నిర్వహించటం.. ఆయనేం చేసినా.. చివర్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం ఏదో ఒక మూల కనిపించేది. అంతలా శ్రమించినప్పటికీ హుజూరాబాద్ ఓటర్లు మాత్రం కేసీఆర్ మనసకు ఏ మాత్రం నచ్చని ఓటమి తీర్పును ఇచ్చేసి షాకిచ్చారు. ఉప ఎన్నిక ఫలితం వెల్లడైన తర్వాత నుంచి ఇప్పటివరకు ఆయన నుంచి ఉప పోరు మీద స్పందన రాలేదు. ఆ మాటకు వస్తే.. ఆయన నుంచి మరెలాంటి ప్రకటన కూడా రాకపోవటం తెలిసిందే.

ఉప ఎన్నిక ఫలితం వెల్లడి కావటానికి కాస్త ముందుగా.. ఆయన భారీ ఎత్తున నిర్వహించతలపెట్టిన విజయ గర్జన భారీ బహిరంగ సభ తేదీని మార్చటం తెలిసిందే. ఇప్పుడు ఈ సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. సభ కోసం పంటలు పండే పొలాల్ని తాము ఇవ్వలేమంటూ రైతులు ఎదురుతిరగటం.. దీనిపై జరుగుతున్న రచ్చ ఇప్పుడు వార్తలుగా మారాయి. సభ నిర్వహణకు అవసరమైన మేర పొలాలు ఇవ్వకుంటే.. మీ సంగతి తేలుస్తామంటూ రైతుల్ని టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ సభ మీద ఇప్పుడు కొత్త వాదనలు షురూ అయ్యాయి. పార్టీ పెట్టి రెండు దశాబ్దాలు దాటిన నేపథ్యంలో ఈ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని.. ఇందుకోసం లక్షలాదిగా ప్రజల్ని సభకు వచ్చేలా సమీకరించాలని గులాబీ బాస్ దిశానిర్దేశం చేయటం తెలిసిందే. అయితే.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత నిర్వహిస్తున్న బహిరంగ సభ పేరును ‘విజయ గర్జన’ పేరు ఏ మాత్రం సూట్ అయ్యేలా లేదన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయగర్జన పేరుతో సభను ఆర్భాటంగా నిర్వహించే కన్నా.. ఆత్మశోధన లాంటి పదాలతో సభను నిర్వహించటంబాగుంటుందన్న మాట వినిపిస్తోంది. ఉప ఎన్నికల ఓటమిని వీలైనంత త్వరగా మర్చిపోవాలని భావిస్తున్న గులాబీ బాస్ కు.. గర్జన పేరుకు బదులుగా సున్నితంగా ఉండే పేర్లతో సభను నిర్వహించటానికి ఆయన ఒప్పుకుంటారా? అన్నది ప్రశ్నే.