Begin typing your search above and press return to search.

ఒకే ఒక్క హామీ : టీడీపీని జనాలకు కనెక్ట్ చేస్తుందా...?

By:  Tupaki Desk   |   13 May 2022 8:30 AM GMT
ఒకే ఒక్క హామీ : టీడీపీని జనాలకు కనెక్ట్ చేస్తుందా...?
X
తెలుగుదేశం అధినాయకుడు ఒకే ఒక్క హామీ ఇస్తున్నారు. నిజానికి ఎన్నికలు రెండేళ్లకు దగ్గర పడిన వేళ ఈ పాటికే ఎన్నో హామీలతో బాబు హోరెత్తించాలి. కానీ ఈసారి ఆయన చాలా సంయమనం పాటిస్తున్నారులా ఉంది. కానీ ఎవరూ అడగకపోయినా ఒక హామీని మాత్రం ఆయన గట్టిగానే ఇస్తున్నారు. ఆ హామీతో జనాలు కనెక్ట్ అవుతారా. అసలు ఆ హామీతో జనాలకు ఏమైనా ప్రయోజనం ఉందా. ఇవే ఇపుడు చర్చకు వస్తున్న అంశాలు.

ఇంతకీ బాబు జనాలకు ఇస్తున్న హామీ ఏంటి అంటే తమ పార్టీ అధికారంలోకి వస్తే స్పెషల్ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేస్తాను అని. అది ఎందుకు అంటే టీడీపీ వారి మీద తప్పుడు కేసులు పెట్టిన పోలీసులను విచారించడానికట. ఊరూ వాడా ఇదే విషయాన్ని బాబు చెప్పుకొస్తున్నారు. మరి దీని వల్ల సగటు జనాలకు ఒనగూడే మేలు ఏంటి మహానుభావా అంటే ఏమీ ఉండదు.

టీడీపీ వారి మీద వైసీపీ ఏలుబడిలో అనేక కేసులు పడుతున్నాయి. బడా నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఇక చంద్రబాబు మీద కూడా సీయార్డీయే కు సంబంధించి కేసులు పెట్టారు. ఇవన్నీ తప్పుడు కేసులు అని బాబు అంటున్నారు. అంతే కాదు, చట్టాన్ని క్షుణ్ణంగా చదివేసిన తన మీద ఈ కేసులా. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలా అంటూ వైసీపీ సర్కార్ మీద విరుచుకుపడుతున్నారు.

మీరు తప్పుడు కేసులు పెట్టి నన్నేమీ చేయలేరని కూడా సౌండ్ చేస్తున్న బాబు మీ అందరి భరతం పట్టే రోజు ఒకటి ఉందని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చీ రాగానే స్పెషల్ ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేసి ఈ వేధింపుల కేసులన్నింటి మీద దర్యాప్తు జరిపించి తీరుతామని బాబు అంటున్నారు.

ఏ ఒక్కరినీ వదిలే సమస్యేలేదు అని కూడా ఆయన చెబుతున్నారు. నేనంటే ఏమనుకున్నారు. కరడు కట్టిన నేరస్థుల్ల గుండెల్లో నిద్రపోయిన వాడిని, నాకే చట్టాలు గురించి చెబుతారా అంటున్నారు బాబు. సరే బాబు బాధలు బాబువి. తప్పుడు కేసులు తమ పార్టీ వారి మీద పెడుతున్నారు అన్న ఆయన ఆవేదనలో నిజం ఊండవచ్చు. రేపటి రోజున వాటి మీద దర్యాప్తు జరిపించాలనుకోవడంలోనూ తప్పు ఏ మాత్రం లేదు.

కానీ వాటి వల్ల జనాలకు ఉపయోగమేంటి బాబూ అన్నదే సూటి ప్రశ్న. రాజకీయాలు అన్నాక వారి మీద వీరూ వీరి మీద వారూ అలా కేసులు పెట్టుకుంటారు. ప్రభుత్వంలోకి వచ్చాక వాటిని విప్పుకుంటారు. అది ఫక్తు రాజకీయం. అలా సాగుతూనే ఉంటుంది. సామాన్య ప్రజలకు ఫలానా పని చేస్తామని హామీ ఇస్తే అది జనంలో చర్చకు వస్తుంది.

అంతే కానీ మేము అధికారంలోకి వస్తే వైసీపీ వారిని ఊర్ళు దాటిస్తాం, ఉరికించి కొడతామని చెప్పుకుంటూ పోతే జనాలు ఎందుకు ఓటేయాలని ఆలోచించరా. వారికి కావాల్సింది సంక్షేమం, అభివృద్ధి, ఇంతటి సభలు పెడుతూ గంటల కొద్దీ స్పీచులు ఇస్తున్న చంద్రబాబు లాంటి రాజకీయ ఘనాపాటీకి ఈ విషయం అర్ధం కావడంలేదా. లేక ఆయనకు ఇదే అత్యంత ప్రధానమైన హామీగా ఇదే కనిపిస్తోందా అన్నదే ఇక్కడ చర్చ.