ఆంధ్రాలో ఉన్నామా? కశ్మీర్ లో ఉన్నామా? నాని ట్వీట్ క్వశ్చన్

Wed Sep 11 2019 11:24:14 GMT+0530 (IST)

unable To Understand Whether We Are In Andhra Or Kashmir TDP MP Kesineni Nani Tweet

ఉద్రికత్తలు చోటు చేసుకునే అవకాశం ఉన్న నిరసనల్ని అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా అడ్డుకునే ప్రయత్నమే చేస్తుంది. తాజాగా పల్నాడులో ఏపీ ప్రధాన ప్రతిపక్షం నిర్వహిస్తున్న ఛలో ఆత్మకూరు కూడా ఈ కోవకు చెందిందే. తమ పార్టీ కార్యాకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఛలో ఆత్మకూరు కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే.. ఛలో ఆత్మకూరు కార్యక్రమం ఉద్రిక్తతల్ని పెంచే అవకాశం ఉందన్న సమాచారంతో కట్టుదిట్టమైన భద్రతను చేపట్టారు ఏపీ పోలీసులు. ఈ నిరసనకు వెళ్లే మాజీ మంత్రులు మొదలు పలువురు టీడీపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు నివాసం నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసిన మాజీ మంత్రి నారా లోకేశ్ ను పోలీసులు బయటకు రానివ్వలేదు.

 తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల్ని సైతం ఆత్మకూరుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీనిపై పలువురు టీడీపీ నేతలు తప్పు పడుతున్నారు. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేస్తూ.. మనం ఆంధ్రాలో ఉన్నామా లేదంటే కశ్మీర్ లో ఉన్నామా అర్థం కావటం లేదని మండిపడ్డారు.

ఉద్రిక్తతల్ని రేపే నిరసన కార్యక్రమాల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్న నాని.. హోదా సాధన కోసం 2017లో విశాఖలో నిర్వహించాల్సిన నిరసన కార్యక్రమాన్ని నాటి టీడీపీ ప్రభుత్వం ఎలా అడ్డుకుందో తెలియంది కాదు. చివరకు ప్రతిపక్ష నేతను విశాఖ ఎయిర్ పోర్ట్ లోపలకు కూడా రానివ్వకుండా పోలీసులతో అడ్డుకున్నప్పుడు నాని లాంటి నేతలకు గుర్తుకు రాని కశ్మీర్.. ఇప్పుడు గుర్తుకు రావటం ఏమిటో..? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.